ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 129 రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నా.. పదవులు వదిలి, ఉద్యోగాలను పణంగా పెట్టి ‘జై సమైక్యాంధ్ర’ అని నినదిస్తున్నా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కాస్తయినా కరగలేదు. సమైక్యవాదులు కోరుతున్న ఏ ఒక్క అంశాన్నీ కనీసం పరిగణలోకి తీసుకోకుండా జీఓఎం నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇన్నాళ్ల ఉద్యమానికి దక్కిన ఫలితమిదా అని ‘పశ్చిమ’ ప్రజల గుండెలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్య వాదులు శుక్రవారం జిల్లా అంతటా బంద్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నేతలు, ఎన్జీవో నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్దఎత్తున బంద్‌లో పాలుపంచుకున్నారు. బంద్ కారణంగా జిల్లా వ్యాప్తంగా 630 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. విద్యాసంస్థలు, సినిమాహాళ్లను స్వచ్ఛందంగా మూసివేశారు.
సాక్షి, ఏలూరు :
విభజన నిర్ణయూన్ని నిరసిస్తూ జిల్లాలోని వైఎస్సార్ సీపీ శ్రేణులు శుక్రవారం వేకువజామున 4గంటలకే రోడ్డెక్కారుు. ఆర్టీసీ బస్సులను డిపోల నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారుు. సమైక్యవాదులు వెంటరాగా, భారీ ప్రదర్శనలు నిర్వహిం చారుు. బంద్‌కు సహకరించాలంటూ వ్యాపార, వాణిజ్య వర్గాలకు విజ్ఞప్తి చేశారుు. పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు జంగారెడ్డిగూడెంలో బైక్ ర్యాలీ చేశారు. ఏలూరులో వైసీపీ ఆధ్వర్యంలో ఉదయమే జూట్‌మిల్‌ను మూయించివేశారు. మోటార్ సైకిళ్ల ర్యాలీ చేశారు. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ నగరశాఖ అధ్యక్షుడు గుడిదేసి శ్రీనివాస్, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్తలు చలుమోలు అశోక్‌గౌడ్, పీవీ రావు, కొఠారు రామచంద్రరావు ఆధ్వర్యంలో నగర వీధుల్లో మోటార్ సైకిల్ ర్యాలీ చేసి దుకాణాలు మూయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ జిల్లా కన్వీనర్; పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాల రాజు పాల్గొన్నారు.
టీడీపీ, ఎన్జీవో నేతలు ఆర్టీసీ బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. న్యాయవాదులు కోర్టునుంచి ఫైర్‌స్టేషన్ వరకూ డప్పులు వాయిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎన్జీవోలు ఏలూరులోని జెడ్పీ గెస్ట్‌హౌస్ వద్ద రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణను ఘెరావ్ చేశారు. తణుకులో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు కారును వైసీపీ శ్రేణులతో కలసి సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల్లో ఎమ్మెల్యే కారు అద్దం పగిలింది. దీంతో సమైక్యవాదులపై ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంలో ఓ ఉద్యమకారుడు అస్వస్థతకు గురికాగా, మరొకరు గాయపడ్డారు. ఎమ్మెల్యే తీరుపై ఆందోళకారులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాలకొల్లులో ఎమ్మెల్యే బంగారు ఉషారాణికి సమైక్యసెగ తగిలింది. జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఉషారాణిని గోబ్యాక్ అంటూ సమైక్యవాదులు అడ్డుకున్నారు.
టైర్లకు నిప్పు.. దిష్టిబొమ్మల దహనాలు
తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. వేకువజామునే ఆర్టీసీ డిపోకు చేరుకున్న కార్యకర్తలు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్టీసీ డిపో ఎదుట. పోలీసు ఐలండ్ సెంటర్‌లో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత ఆధ్వర్యంలో కొవ్వూరులో రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్ భారీగా స్తంభించింది. వేగేశ్వరపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు భారీ మానవహారం నిర్మించగా, చాగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ, మానవహారం చేశారు.
తాడువాయిలో ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. లక్కవరంలో చింతలపూడి నియోజ కవర్గ సమన్వయకర్త కర్రా రాజారావు ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. టీడీపీ నాయకులు పాతబస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. కొయ్యల గూడెంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆరు గంటలపాటు రాస్తారోకో జరిగింది. టి.నరసాపురం ప్రధాన సెంటర్‌లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేసి, మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. పోలవరం మండలంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ సుంకర వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్ల ర్యాలీ చేశారు. జీలుగుమిల్లి సమీపంలోని ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, సమైక్యవాదులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కొయ్యలగూడెంలో టీడీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించారు.
ఏపీ ఎన్‌జీవోల పిలుపు మేరకు బుట్టాయగూడెంలో రెవెన్యూ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. ఆచంట, మార్టేరు, పెనుగొండ సెంటర్లలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. మార్టేరు, పెనుగొండ కార్యక్రమాలలో నియోజకవర్గ సమన్వయకర్త కండిబోయిన శ్రీనివాసరావు పాల్గొన్నారు. వైసీపీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఉండిలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు బంద్‌ను విజయవంతం చేశారు. ఉండి సెంటర్‌లో జాతీయ రహదారిని దిగ్బంధించి సాయంత్రం వరకు రోడ్డుపై వంటావార్పు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆకివీడు బంద్ విజయవంతమైంది.
భీమవరం పట్టణంలో పార్టీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్ ఆధ్వర్యంలో మోటారు సైకిళ్ళపై తిరుగుతూ ప్రభుత్వ కార్యాలయాలను, దుకాణాలను, బ్యాంకులను మూయించివేశారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్‌లో ఆందోళన నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, నియోజకవర్గ ఇన్‌చార్జి గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), పార్టీ పట్టణ అధ్యక్షుడు చింతా శ్రీనివాస్ (బండి శ్రీను) ఆధ్వర్యంలో ప్రకాశంచౌక్‌లో రాస్తారోకో చేశారు. ఎన్‌జీవో అసోసియేషన్ చైర్మన్ కె.కామరాజు ఆధ్వర్యంలో ఉద్యోగులు ప్రకాశంచౌక్‌లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నరసాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద షిండే, సోనియా, దిగ్విజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
నల్ల బెలూన్లను గాలిలోకి వదిలి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. వివిధ కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొన్నారు. వైసీపీ నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్‌కృష్ణ ఆధ్వర్యంలో పట్టణ బంద్ జరిగింది. ఉండ్రాజవరం మండలంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బసవా గణేష్ ఆధ్వర్యంలో దుకాణాలను మూయించారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేసి విభజన పక్రియను ఆపాలని, లేని పక్షంలో సీమాంధ్రలో వారిని తిరగనిచ్చేది లేదని సమైక్యవాదులు హెచ్చరించారు.
విభజన చీకటి.. ఉద్యమ దివిటీ
Published Sat, Dec 7 2013 3:59 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement