వీధివ్యాపారులపై అలసత్వం
చిరువ్యాపారులు.. నిగనిగలాడే పండ్లు, కూరగాయలు, తినుబండారాలను విక్రయించే వీరి జీవితాల్లో ఎలాంటి మెరుపూ ఉండదు. అద్దెలు, ఖర్చులు, పోలీసు మామూళ్లు, రోజువారీ వడ్డీలకు పోగా రోజంతా నిలువుకాళ్ల జీతంతో చేసే వ్యాపారంలో మిగిలేది స్వల్పమే. వీరిని వీధివ్యాపారులుగా గుర్తిస్తూ, కేంద్రప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసినా, అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ప్రత్యేక జోన్లు లేవు. గుర్తింపు కార్డుల పంపిణీలేదు. పావలా వడ్డీ రుణాల ప్రసక్తే లేదు.
- కేంద్రప్రభుత్వం చేసిన చట్టం అమలులో తీవ్ర నిర్వక్ష్యం
- ప్రత్యేక జోన్లు లేవు, గుర్తింపు కార్డులు సంగతి సరేసరి
- పావలా వడ్డీ రుణాల ఊసే లేదు
తెనాలి : జిల్లాలో అధికారుల అంచనా ప్రకారమే 4,397 మంది చిరువ్యాపారులు ఉన్నారు. వాస్తవ సంఖ్య యాభై శాతం అధికంగా ఉంటుందని చెబుతారు. ప్లాట్‌ఫారాలు, తోపుడుబండ్లపై, రోడ్డు పక్కన బుట్టల్లో వ్యాపారాలు చేసుకొనే పేదలకు ఆదాయం అస్తుబిస్తుగానే ఉంటుంది. సరుకు కొనుగోలుకు వడ్డీ వ్యాపారుల నుంచి రోజువారీ రూ.5, రూ.10 వడ్డీకి అప్పులు తెచ్చుకొని అమ్మకం ఆరంభిస్తారు. పెట్టుబడికి వడ్డీ, తోపుడుబండి అద్దె, తమ సాదర ఖర్చులు, వారం వంతున పోలీసులకు చెల్లించే మామూళ్లు పోతే చిరువ్యాపారులకు మిగిలేది స్వల్పమే. ఇళ్లు, దుకాణాల ఎదుట సరుకు పెట్టుకొని వ్యాపారం చేస్తే, ఆ గృహస్తులు/దుకాణ యజమానులకు రోజుకు ఇంతని డబ్బు చెల్లించాల్సిందే.
చట్టం చేసిన కేంద్రం.. కేంద్ర ప్రభుత్వం 2004లో వీరిని వీధి వ్యాపారులుగా గుర్తిస్తూ చట్టం చేసింది. మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపింది. వీరు వ్యాపారం చేసుకొనేందుకు ప్రత్యేక జోన్లు ఏర్పాటుచేయాలనీ, గుర్తింపుకార్డులు మంజూరు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసుల, రౌడీల మామూళ్ల బెడద ఉండదని ప్రభుత్వ భావన. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం వీధివ్యాపారులకు పావలా వడ్డీ రుణాలను కల్పించాలని నిర్ణయించింది. సూక్ష్మరుణాలను పట్టణ దారిద్య్ర నిర్మూలన పథకం (మెప్మా) కింద అందజేస్తామని ప్రకటించారు.
కొనసాగుతున్న నిర్లక్ష్యం.. ప్రస్తుత ప్రభుత్వం హయాంలో అలసత్వం కొనసాగుతోంది. గుంటూరు రీజియన్‌లో వీధివ్యాపారుల గుర్తింపు కేవలం 42 శాతమే జరగడంపై ఈనెల 19న గుంటూరులో జరిగిన సమీక్షా సమావేశంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎండీ డి.మురళీధరరెడ్డి సిబ్బందిపై అసహనం వ్యక్తంచేశారు. జిల్లాలో గుర్తించిన వీధివ్యాపారులు 4,397 కాగా, వాస్తవంగా మరో రెండువేలమంది అదనంగా ఉంటారనే వాదన ఉంది. ఉదాహరణకు తెనాలిలో గుర్తించిన చిరు వ్యాపారులు సంఖ్య 227 కాగా, పండ్ల, చిల్లర వర్తక సంక్షేమ సంఘం సభ్యులు 380 ఉండగా, దెబ్బతిన్న పండ్లు, కూరగాయలు తీసుకెళ్లి వే రేచోట అమ్మేవారు.
రోడ్డుపక్క ఇడ్లీ, దోసె వేసి అమ్మేవారు మరో 300 ఉంటారని సంక్షేమ సంఘం అధ్యక్షురాలు బొల్లు సుబ్బులమ్మ చెప్పారు. అధికారుల అంచనా ప్రకారమే జిల్లాలోని 4,397 మందికిగాను ఇప్పటికీ 274 మందికి మాత్రమే గుర్తింపుకార్డులు ఇచ్చారు. ఇక రుణాల సంగతి వీరిలో ఎవరికీ తెలియదు. పొన్నూరులో మున్సిపాలిటీ చొరవతో డ్వాక్రా తరహాలో పొదుపు చేయించి, కొందరికి రుణాలిచ్చినట్టు తెలిసింది. ఇకనైనా చిరువ్యాపారులను ఆదుకోవలసిన అవసరం ఉంది.