కేంద్ర పథకాల్లో అర్హులకు అన్యాయం
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
నెల్లూరు(పొగతోట): కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక గోల్డన్‌జూబ్లీహాల్లో నిర్వహించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలు అర్హులకు అందడం లేదన్నారు. అధికారులు నిస్పక్షపాతంగా వ్యవ హరించి పింఛన్లు, తదితర పథకాలు అందేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై జన్మభూమి కమిటీల పెత్తనం లేకుండా ఉత్తర్వులు వచ్చేలా పార్లమెంట్‌లో చర్చిస్తానన్నారు. జిల్లాలో ప్రొటోకాల్ విషయంలో ప్రజాప్రతినిధులకు అవమానం జరుగుతోందని, అధికారులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. స్వయంగా తనను ప్రారంభోత్సవానికి ఆహ్వానించి శిలాఫలకంపై పేరు లేకుండా చేశారన్నారు.
ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రారంభోత్సవాల్లో మాజీలను ఆహ్వానించి వారిపేర్లు శిలాఫలకంపై నమోదు చేయడం దారుణమన్నారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కరించాలన్నారు. తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సమస్య గ్రామాలను గుర్తిస్తే ఎంపీ ల్యాడ్స్ నిధులతో పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో ఉపాధి పనుల కోసం రూ.1129 కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేదన్నారు. రోడ్లు లేని గ్రామాల జాబితా ఇస్తే నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, అసంపూర్తిగా ఉన్న పాఠశాలల భవనాలు తర్వితగతిన పూర్తి చేయాలన్నారు. ఎన్‌టీఆర్ హౌసింగ్ పథకం లబ్ధిదారుల ఎంపిక సజావుగా జరగాలని, పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ఉపాధి ఎఫ్‌ఏలను తొలగించడంతో పనులు పర్యవేక్షణ సక్రమంగా జరగడంలేదన్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ ఏ.మహమ్మద్ ఇంతియాజ్ మాట్లాడుతు సభ్యులు సూచించిన సూచనలను అమలు చేస్తామని, ప్రోటోకాల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ రామిరెడ్డి, డ్వామా పీడీ హరిత, హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి, డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ వరసుందరం, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌వీఎం అధికారులు పాల్గొన్నారు.
జన్మభూమి కమిటీల పెత్తనంపై
జీఓ చేయాలి:
పింఛన్లు, పక్కాగృహాల విషయంలో జన్మభూమి కమిటీల పెత్తనం ఎక్కువైంది. అనర్హులను ఎంపిక చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వాటి పెత్తనం చెల్లదని పార్లమెంట్‌లో జీవో జారీ చేయించాలి. రూరల్ నియోజకవర్గంలో రూ.5 వేలు ఇస్తే అనర్హులకు పింఛన్ మంజూరు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారు. అర్హులకు పథకాలు అందకపోతే అట్రాసిటీ కేసులు నమోదు చేస్తాం. రూరల్ నియోజకవర్గం మోగల్లపాళెంలో స్టేడియం నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరై నాలుగు నెలలు కావస్తున్న ఎందుకు ఖర్చు చేయాలేదు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే రూ.1,600 కోట్లు వెనుక్కుపోయే ప్రమాదం ఉంది. - కొటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి,నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే
అర్హులకు అన్యాయం చేస్తున్నారు:
పింఛన్ల మంజూరులో జన్మభూమి కమిటీలు అర్హులకు అన్యాయం చేస్తున్నారు. వికలాంగులకు కుడా ఇవ్వడం లేదు. ఇతనికి కూడా పింఛన్ అందలేదని సెల్‌ఫోన్‌లో వికలాంగుని పరిస్థితి చూపించారు. కావలి ప్రాంతంలో రెండు మంచినీటి పథకాల పనుల్లో జాప్యం జరుగుతోంది. నీటి లభ్యతున్న ప్రాంతంలో బోర్లు వేసి నీటిఎద్దడి ఉండే గ్రామాలకు సరఫరా చేయాలి. నిధుల మంజూరు, ఖర్చు వివరాలు అధికారపార్టీ నాయకులకు మాత్రమే ఇస్తున్నారు. ప్రోటోకాల్ విషయంలో అధికారులు అధికారపార్టీ నాయకులు చెప్పినట్లు అడుతున్నారు. ప్రారంభోత్సవాలకు పిలిచి అవమానపరుస్తున్నారు. పాఠశాలల్లో టాయిలెట్స్ పూర్తి స్థాయిలో నిర్మించాలి. -రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితంలేదు:
అర్హులకు పింఛన్లు అందలేదని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు. జన్మభూమి కమిటీలు ఇష్టం వచ్చినట్లు ఎంపిక చేస్తున్నారు. ఎన్‌టీఆర్ హౌసింగ్‌కు కమిటీలు ఎంపిక చేసిన జాబితా సర్పంచ్ అధ్వర్యంలో సభ నిర్వహించి అందరికి తెలియజేయాలి. సర్పంచ్ సంతకం లేకుండా గ్రామ సభ నిర్వహిస్తున్నారు. తాగునీటి ఎద్దడి నివారించాలి. ప్రోటోకాల్ విషయంలో డీఆర్‌ఓ తప్పుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు చెప్పకుండా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాలకు బిల్లులు ఏ విధంగా చెల్లిస్తారు. - కిలివేటి సంజీవయ్య,సూళ్ళూరుపేట ఎమ్మెల్యే