
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రైతులకు తగినంత నష్ట పరిహారాన్ని చెల్లించడానికిగాను ప్రత్యేకంగా నిధులను ఇచ్చి ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీటర్‌లో ట్వీట్ చేశారు. ‘‘రాష్ట్రంలో అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుని తగినంత నష్టపరిహారం చెల్లించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను రాష్ట్రానికి విడుదల చేయాలి. అదే సమయంలో బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు అన్నివిధాలా ప్రయత్నించాలి’’ అని ఈ ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.
ప్రాణనష్టం విషాదకరం..
అకాల వర్షాలు, ఉరుములు, పిడుగుల కారణంగా రాష్ట్రంలో ప్రాణనష్టం జరగడం పట్ల జగన్ విచారం వెలిబుచ్చారు. అలాగే పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన మరో ట్వీట్ చేశారు. ‘‘ఏపీలో అకాల వర్షాలకు ప్రాణనష్టం జరగడం అత్యంత విషాదకరం. ఈ వర్షాల కారణంగా భారీగా పంటలు నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించి వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే బాధితులకు పరిహారాన్ని తక్షణం చెల్లించాలి’’ అని ఈ ట్వీట్‌లో ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment