అంతర్రాష్ట్ర గొలుసు దొంగల ముఠా అరెస్ట్ | Chain inter-state gang of thieves arrested | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర గొలుసు దొంగల ముఠా అరెస్ట్

Published Thu, Nov 27 2014 1:41 AM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM

Chain inter-state gang of thieves arrested

గణపవరం : మహిళల మెడలో బంగారు ఆభరణాలను తెంచుకుని పరారయ్యే ముగ్గురు సభ్యులు గల అంతర్‌రాష్ట్ర గొలుసు దొంగల ముఠాను భీమవరం పోలీసులు అరెస్టు చేసి, నిందితుల నుంచి రూ.4.13 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు బైక్‌లు, రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి చెప్పారు. గణపవరం సీఐ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం దౌల్‌పూర్ జిల్లాకు చెందిన రామ్ భరణ్ సింగ్‌పర్మార్, రమాకాంత్ సవిత, రవీంద్రసింగ్ నాలుగేళ్లుగా భీమవరంలో మార్బుల్స్ అతికించే పనిచేస్తున్నారు. వ్యసనాలకు బానిసలై సంపాదించిన సొమ్ము జల్సాలకు సరిపోకపోవడంతో దొంగతనాలకు అలవాటుపడ్డారు. ఒంటరిగా నడిచే వెళ్లే మహిళల మెడలోని బంగారు వస్తువులను దొంగిలిస్తున్నారు.
 
 ఈ ఏడాది జనవరి నుంచి నేరాలకు ఒడిగడుతూ ఎదురు తిరిగినవారిని తుపాకీతో బెదిరిస్తున్నారు. మావూళ్లమ్మ గుడి వద్ద ఒంటరిగా ఉన్న మహిళ మెడలో ఆభరణాలను ఈ ముగ్గురూ బైక్‌పై వచ్చి తెంపుకుని వెళుతుండగా ఆమె కేకలు వేయడంతో అక్కడే ఉన్న పాలకోడేరు కానిస్టేబుల్ వై.వెంకటేశ్వరరావు వారిని వెంబడించాడు. దీంతో నిందితుల్లో ఒకరు తన దగ్గర ఉన్న తుపాకీతో కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపాడు. కాల్పులనుంచి కానిస్టేబుల్ తప్పించుకుని వారిని పట్టుకునేందుకు వెంటపడ్డాడు. దీనిని చూసిన భీమవరం చైతన్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి హరీష్.. కానిస్టేబుల్‌తో పాటు వెంబడించి నిందితుల్లో ఒకరిని పట్టుకుని భీమవరం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
 
 మిగిలిన ఇద్దరిని సీఐలు జి.కెనడీ, ఆర్‌జీ జయసూర్యలు లూథరన్ హైస్కూల్ గ్రౌండ్‌లో బుధవారం అరెస్ట్ చేశామని ఎస్పీ వివరించారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన 15 మందిని, వారికి సహకరించిన ఏజెంట్లను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారి వివరాల తెలుసుకున్న అనంతరమే పనిలో పెట్టుకోవాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధైర్యసాహసాలు ప్రదర్శించిన కానిస్టేబుల్ వై.వెంకటేశ్వరరావుకు ఎస్పీ రివార్డు అందజేశారు. కానిస్టేబుల్, విద్యార్థి హరీష్‌కు బ్రేవరీ అవార్డు కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామన్నారు. ఏలూరు డీఎస్సీ కేజీవీ సరిత, భీమడోలు సీఐ ఎన్.దుర్గా ప్రసాద్, గణపవరం ఎస్సై ఎ.పైడిబాబు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement