చైన్ స్నాచర్‌‌స హల్‌చల్ | chain snackers attacks in nellore | Sakshi
Sakshi News home page

చైన్ స్నాచర్‌‌స హల్‌చల్

Published Tue, Sep 3 2013 5:56 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

chain snackers attacks in nellore

 నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్ : నగరంలో సోమవారం చైన్‌స్నాచర్‌‌స హల్‌చల్ చేశారు.  ఆరు ప్రాం తాల్లో తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించి అందిన కాడికి దోచుకెళ్లారు. సుమారు రూ. 5.18 లక్షలు విలువ చేసే 24 సవర్ల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. లక్ష్మీపురంలో సోమవారం ఉదయం 6.30 గంటలకు పద్మజ తన ఇంటి ముందు పూలు కోసుకుంటుండగా గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని ఏడు సవర్ల బంగారు గొలుసులను లాక్కెళ్లారు. మిలటరీకాలనీలో ఉదయం 7.30 గంటలకు నాటకాల లక్ష్మీనరసమ్మ(60) వెంకయ్యస్వామి జ్ఞానశాలకు వెళుతుండగా గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని 3 సవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లారు. లక్ష్మీపురానికి చెందిన కొత్తూరు రజని ఆత్మకూరు బస్టాండు సమీపంలోని మాస్టర్‌మైండ్స్ కళాశాలలో చదువుతున్న తన కుమార్తెను ఇంటికి తీసుకువచ్చేందుకు సాయంత్రం 7 గంటలకు వెళ్లింది. కుమార్తెతో కలిసి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా తడికలబజారు సెంటర్ సమీపంలో గుర్తుతెలియని దుండగులు ఎరుపు రంగు స్కూటీపై వచ్చి ఆమె మెడలోని బంగారు సరుడును లాగాడు. దీంతో ఆమె ప్రతిఘటించింది. సగం దండ ఆమె చేతికి చిక్కగా మిగిలిన సగం దండను దుండగుడు లాక్కెళ్లాడు. ఈ ఘటనలో సుమారు రెండు సవర్లు చోరీ జరిగింది.
 
   రామమ్మూర్తినగర్ గచ్చుకాలువ సెంటర్‌లోని సుందర్‌అపార్ట్‌మెంట్ ఎదురుగా గ్రంధి తాయమ్మ నివసిస్తోంది. ఆమె తన ఇంటికి సమీపంలోని షాపులో సరుకులు కొనుగోలు చేసి రాత్రి 7.15 గంటలకు ఇంటికి వెళుతున్న సమయంలో గుర్తుతెలియని ఇద్దరు దండుగులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని రెండున్నర సవర బంగారు గొలుసును లాక్కెళ్లారు. మైపాడుగేటు సెంటర్ రామ్‌నగర్‌కు చెందిన ముసునూరు శ్యామలమ్మ రాత్రి 7.30 గంటలకు తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి లోనికి వెళుతుండగా గుర్తుతెలియని దుండగుడు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని నాలుగున్నర సవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాలాజీనగర్ సాయి స్కూల్ వద్ద రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ ఉపాధ్యాయురాలి మెడలోని ఐదు సవర్ల బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగుడు లాక్కెళ్లాడు. ఈ సంఘటనలపై ఆయా ప్రాంత పోలీసులు కేసులు నమోదు చేశారు.
 
 పోలీస్ సిబ్బందిపై ఎస్పీ ఆగ్రహం : వరుస గొలుసు దొంగతనాల విషయం తెలుసుకున్న ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ నగరంలో పర్యటించారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అప్పటికే పోలీసులు నగరంలో వాహన తనిఖీలు చేపట్టారు. శె ట్టిగుంట రోడ్డు సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఎరుపు స్కూటీపై వెళుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని రెండో నగర పోలీసుస్టేషన్‌కు తరలించారు. రెండో నగర పోలీసుస్టేషన్‌కు చేరుకున్న ఎస్పీ నగర డీఎస్పీ పి. వెంకటనాథ్‌రెడ్డి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు పి. వీరాంజనేయరెడ్డి, బాజీజాన్‌సైదా, రెండో నగర సీఐ కోటారెడ్డితో సమావేశమయ్యారు. చోరీలపై అసహనం వ్యక్తం చేశారు. గస్తీ ముమ్మరం చేసి అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.
 
 జెన్‌కోలో వర్క్ టు రూల్
 ముత్తుకూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా నేలటూరులోని ఏపీ జెన్‌కో విద్యుత్ ప్రాజెక్టులో వర్క్ టు రూల్ పాటిస్తున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకే విధులు నిర్వర్తిస్తామన్నారు. అటు తర్వాత ఎంత అత్యవసరమైనా విధులు చేపట్టబోమన్నారు. ఈ నిరసన కార్యక్రమం 4వ తేదీ వరకు నిర్వహించనున్నామన్నారు.
 
 గాలివాన బీభత్సం
 వెంకటాచలం, న్యూస్‌లైన్:  మండలంలో సోమవారం గాలివాన  బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు పెను గాలులతో వర్షం  ప్రారంభమైంది. గంట కు పైగా పెనుగాలులతో కూడిన  భారీవర్షం పడింది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. కాకుటూరు గ్రామంలో వడగళ్ల వాన పడింది.  అదే విధంగా పెను గాలులకు కసుమూరులో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. కసుమూరు చిన్న ఊరిలో చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. అదే విధంగా చిన్న దర్గాలపై చెట్ల కొమ్మలు విరిగి పడడంతో గోడలపై ఉన్న కుడ్యాలు పడిపోయాయి. అదే విధంగా మస్తాన్‌వలి దర్గా ముందు ఉన్న విద్యుత్ స్తంభం స్థానికుడు ఉస్మాన్ ఇంటిపై  విరిగి పడింది. దీంతో మస్తాన్‌వలి దర్గాతో పాటు దర్గా వీధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement