దొంగల ముఠా అరెస్టు: భారీగా సొత్తు స్వాధీనం
గూడూరు : నెల్లూరు జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ గజరావు భూపాల్ శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు వివరాలను వెల్లడించారు. జిల్లాలోని చిల్లకూరు, కోట, గూడూరు రూరల్ మండలాలకు చెందిన గోపాల్, ప్రసాద్, వంశీకృష్ణారెడ్డి అనే ముగ్గురు 2012 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
వారిలో గోపాల్ పై గతంలో 36 కేసులు నమోదై ఉన్నాయి. జైలు నుంచి విడుదలైన అతడు మిగతా ఇద్దరినీ కలుపుకుని దందా మొదలుపెట్టాడు. అంతా కలసి గూడూరుతో పాటు చిల్లకూరు, చిత్తమూరు, పెళ్లకూరు, నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 29 దొంగతనాలకు పాల్పడ్డారు.
తాజాగా మనుబోలు విష్ణు ఆలయంలో పంచలోహ విగ్రహాన్ని ఎత్తుకు పోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ముగ్గురినీ పట్టుకుని విచారించగా, విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. వారి నుంచి 15 కిలోల వెండి, 217 గ్రాముల బంగారంతోపాటు కారు, ఆటో, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం వారిని రిమాండ్‌కు పంపనున్నట్లు ఎస్పీ తెలిపారు.