
పిడుగులా వచ్చి.. ఒడుపుగా తెంచి..
రోజు రోజుకూ చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోతున్నాయి. ఎటువైపు నుంచి ఎవరొచ్చి మెడలో వస్తువులు తెంచుకుపోతారోనని మహిళలు
ఏలూరు(వన్ టౌన్) :రోజు రోజుకూ చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోతున్నాయి. ఎటువైపు నుంచి ఎవరొచ్చి మెడలో వస్తువులు తెంచుకుపోతారోనని మహిళలు నిత్యం భయాందోళనలతో జీవిస్తున్నారు. ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపే మెడలోని బంగారు ఆభరణాలు దోచుకుపోతున్నారు. పిల్లలను స్కూలుకు తీసుకువెళ్లేవారు, ఉదయాన్నే గుడిలో పూజల కోసం వెళ్లేవారు, మార్నింగ్ వాక్‌లకు వెళ్లేవారు, ఒంటరిగా వెళుతున్న మహిళలే వీళ్లకు టార్గెట్. రోజుల తరబడి రెక్కీలు నిర్వహించి మరీ తమ టార్గెట్‌లు పూర్తిచేసుకుంటున్నారు. అడ్డుకుంటే ప్రాణాలను సైతం తీయడానికి వెనుకాడని ఈ స్నాచర్ల బారినపడి నిత్యం జిల్లాలో ఏదో ఓ ప్రాంతంలో మహిళలు పుస్తెలతాడుతో సహా బంగారు వస్తువులు కోల్పోవడం పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా ఏలూరు నగరంలో రోజుల వ్యవధిలో జరిగిన వరుస స్నాచింగ్‌లతో శాంతినగర్ ప్రాంత మహిళలు భయభ్రాంతులవుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటి ముందు ముగ్గు వేసేందుకు సైతం బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ ప్రాంతంలోనే ఇలాంటివి జరగడానికి ముఖ్యకారణం ఇది నగరంలో కాస్త ఖరీదైన ఏరియా కావడమే. నిత్యం రణగొణ ధ్వనులు లేకుండా, రాకపోకల రద్దీ లేకుండా విద్యాలయాలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఉద్యోగస్తులు ఎక్కువగా నివసిస్తున్నారు. పోలీసు నిఘా చెప్పుకోదగ్గ రీతిలో లేకపోవడంతో యధేచ్ఛగా చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నాయి.
పుస్తెలతాడు తెంచుకుపోయిన దుండగులు
తాజాగా శనివారం ఉదయం స్నాచర్లు ఓ మహిళమెడలో పుస్తెలతాడు తెంచుకునిపోయారు. జరిగిన సంఘటనపై ఏలూరు త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శాంతినగర్ 13వ రోడ్డులో నివాసం ఉండే జి.ముకుంద ఎప్పటిలానే ఉదయం పిల్లలను పాఠశాలలో వదిలేందుకు వెళుతుండగా ఐదవ రోడ్డులోకి రాగానే మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని బంగారు నాన్‌తాడు, రెండు గ్రాముల లక్ష్మీరూపు, రెండు గ్రాముల పున్నమిరూపు, అరకాసు సూత్రం, పగడం, ముత్యం పూసలు కలిగిన సుమారు ఏడుకాసుల బంగారపు పుస్తెలతాడు తెంచుకుపోయారు. ఒక వ్యక్తి వాహనంపై వేచి ఉండగా మరో వ్యక్తి ఆభరణం తెంచుకుని పరుగెత్తుకుని వెళ్లి వాహనంపై ఎక్కి పరారయ్యారు. దొంగ..దొంగ..అంటూ ఆమె వారి వెనుక పరిగెత్తినా ప్రయోజనం లేకపోయింది. ఆమె కేకలు విన్న స్థానికులు వచ్చి ఆమె చెప్పిన ఆనవాళ్లను బట్టి.. వారు ఈ ప్రాంతంలో దాదాపు గంట నుంచి తిరుగాడుతున్నారని చెప్పారు. టౌన్ సీఐ, సీసీఎస్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధిత మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు, స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టౌన్ సీఐ ఎన్.రాజశేఖర్, త్రీ టౌన్ ఎస్సై డి.ప్రసాద్‌కుమార్ తెలిపారు.
గూడెంలో రెండుచోట్ల
తాడేపల్లిగూడెం : అరగంట వ్యవధిలో శనివారం తాడేపల్లిగూడెంలో జరిగిన రెండు చైన్ స్నాచింగ్‌లు కలకలం రేపాయి. వివరాలిలా ఉన్నాయి. పెళ్లి శుభలేఖలు పంచడానికి బయలుదేరిన మహిళలు శేష్‌మహల్ రోడ్‌లోని చిన్న ఆంజనేయస్వామి గుడి వద్ద వాటిని పంచి, కమిషనర్ బంగ్లా సమీపంలో ఉన్న మరి కొందరికి పంచడానికి వెళుతున్నారు. వారు రాకెట్ పార్కు సమీపంలో వచ్చేసరికి వారి వెనుక వాహనంపై వస్తున్న యువకులు నారపురెడ్డి శారద అనే మహిళ మెడలోని మూడు కాసుల నల్లపూసల తావళం, నాలుగు కాసులు నాను తాడును లాక్కొని వెళ్లిపోయారు. దీంతో బెంబేలెత్తిన మహిళలు పీఅండ్‌టీ కాలనీలో జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జరిగిన ఘటన గురించి అయిన వారికి చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో ఇక్కడికి సమీపంలో ఉన్న శ్రీ భార్గవి డిపార్ట్‌మెంట్ అండ్ ఫ్యాన్సీ స్టోర్‌కు వాహనంపై ఇద్దరు యువకులు సిగరెట్లు కావాలని వెళ్లారు. సిగరెట్లు కావాలని, ఇంకా సరుకులు ఏవో కావాలని యువకులు దుకాణంలో ఉన్న గొల్లపూడి లక్ష్మిని అడిగాడు. అవి ఇవ్వడానికి వెనుకకు తిరిగిన వెంటనే యువకుడు తన మెడలోని ఏడున్నర కాసుల నానుతాడు ( సూత్రాలతో కలసి ఉన్నది ) లాక్కొని పారిపోయినట్టు బాధితురాలు గొల్లపూడి లక్ష్మి చెబుతున్నారు. దొంగదొంగా అని అరిచేలోగా, చైన్ స్నాచర్స్ బైక్‌పై ఉడాయించినట్టు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని రూరల్ సీఐ జి.మధుబాబు, రూరల్ ఎస్సై కె.రామారావులు సిబ్బందితో కలిసి సందర్శించారు. గాలింపు చర్యలు చేపట్టారు.