‘బాబు’ జెల్ల...‘రాజు’ కల కల్ల | Chaitanya Raju hopes A.P Council Deputy Chairman post | Sakshi
Sakshi News home page

‘బాబు’ జెల్ల...‘రాజు’ కల కల్ల

Published Thu, Sep 4 2014 1:12 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

‘బాబు’ జెల్ల...‘రాజు’ కల కల్ల - Sakshi

‘బాబు’ జెల్ల...‘రాజు’ కల కల్ల

సాక్షి ప్రతినిధి, కాకినాడ :తడిగుడ్డతో గొంతు కోయడం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి రివాజేనని మరోసారి రుజువైంది. టీడీపీకి జిల్లాలో ఒకప్పుడు పాతకాపు అయిన ఎమ్మెల్సీ చైతన్యరాజు ఇటీవల ఆ పార్టీ నేతలతో తిరిగి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. స్వతంత్ర ఎమ్మెల్సీ చైతన్యరాజు కుమారుడు రవికిరణ్‌వర్మ కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. చైతన్యరాజుకు ఎమ్మెల్సీ కంటే ఉన్నతమైన పదవిని పొందాలన్న కోరిక చాలాకాలంగా ఉంది.
 
 ఈ క్రమంలో ఆయన రాజ్యసభ లో అడుగుపెట్టాలని కలలుగన్నారు. గత జనవరిలో రాజ్యసభకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఖాళీ అయిన సీటు కోసంచైతన్యరాజు చేయని ప్రయత్నం లేదు. స్వతంత్ర ఎమ్మెల్సీ కావడంతో అన్ని పార్టీల మద్దతుతో తన ఆకాంక్షను సాకారం చేసుకోవచ్చన్నాకున్నారు. తర్వాత కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుదామనుకుని ఎమ్మెల్యేలతో లాబీయింగ్ కూడా జరిపారు. చివరి నిమిషంలో అంతా మొండిచెయ్యి చూపడంతో నామినేషన్ వేయకుండానే పెద్దల సభ ఆశలకు నీళ్లు వదులకోవలసి వచ్చింది. తాజాగా చైతన్యరాజు శాసనమండలి వైస్ చైర్మన్ కావాలని ఆశపడ్డారు.
 
 ఇందుకోసం ఎప్పుడో దూరమైన టీడీపీతో కూడా చెట్టపట్టాలు వేసుకున్నారు.   ఉభయగోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీల మద్దతు టీడీపీకి కూడగట్టారు.  మండలి వైస్‌చైర్మన్ రేసులో అందరి కంటే ముందు చెతన్యరాజే ఉన్నట్టు ఆయన అనుచరగణం బాహాటంగానే చెప్పింది. చంద్రబాబు కూడా చైతన్యరాజు అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరిగింది.  అంతా అనుకున్నట్టే జరుగుతోందనుకుంటున్న తరుణంలో చైతన్యరాజుకు ఏకాభిప్రాయం మాటున టీడీపీ నుంచి గట్టి ఎదురు దెబ్బతగిలింది.
 
 టీడీపీ పెద్దల వ్యూహమే.. : ఏకగ్రీవ ప్రతిపాదన తెరపైకి రావడం, చైతన్యరాజు అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడం వెనుక టీడీపీ పెద్దల వ్యూహం ఉందంటున్నారు. చైతన్యరాజును కాక మరో ఎమ్మెల్సీని సూచించాలని కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్య కోరడంతోనే ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డిని టీడీపీ ప్రతిపాదించడం గమనార్హం. తమ నాయకుడిని చివరి వరకూ ఊరించిన టీడీపీ చివరి నిమిషంలో జెల్లకొట్టి అవమానించిందని చైతన్యరాజు అనుచరులు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు.  కాగా చైతన్యరాజు ఆశలను పెంచి, పోషించి, చివరికి తుంచి వేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నైజం వెల్లడైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బాబు ప్రజలనైనా, నేతలనైనా ఒకేరకంగా వంచించగలరని వ్యాఖ్యానిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement