MLC Chaitanya Raju
-
‘బాబు’ జెల్ల...‘రాజు’ కల కల్ల
సాక్షి ప్రతినిధి, కాకినాడ :తడిగుడ్డతో గొంతు కోయడం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి రివాజేనని మరోసారి రుజువైంది. టీడీపీకి జిల్లాలో ఒకప్పుడు పాతకాపు అయిన ఎమ్మెల్సీ చైతన్యరాజు ఇటీవల ఆ పార్టీ నేతలతో తిరిగి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. స్వతంత్ర ఎమ్మెల్సీ చైతన్యరాజు కుమారుడు రవికిరణ్‌వర్మ కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. చైతన్యరాజుకు ఎమ్మెల్సీ కంటే ఉన్నతమైన పదవిని పొందాలన్న కోరిక చాలాకాలంగా ఉంది. ఈ క్రమంలో ఆయన రాజ్యసభ లో అడుగుపెట్టాలని కలలుగన్నారు. గత జనవరిలో రాజ్యసభకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఖాళీ అయిన సీటు కోసంచైతన్యరాజు చేయని ప్రయత్నం లేదు. స్వతంత్ర ఎమ్మెల్సీ కావడంతో అన్ని పార్టీల మద్దతుతో తన ఆకాంక్షను సాకారం చేసుకోవచ్చన్నాకున్నారు. తర్వాత కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుదామనుకుని ఎమ్మెల్యేలతో లాబీయింగ్ కూడా జరిపారు. చివరి నిమిషంలో అంతా మొండిచెయ్యి చూపడంతో నామినేషన్ వేయకుండానే పెద్దల సభ ఆశలకు నీళ్లు వదులకోవలసి వచ్చింది. తాజాగా చైతన్యరాజు శాసనమండలి వైస్ చైర్మన్ కావాలని ఆశపడ్డారు. ఇందుకోసం ఎప్పుడో దూరమైన టీడీపీతో కూడా చెట్టపట్టాలు వేసుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీల మద్దతు టీడీపీకి కూడగట్టారు. మండలి వైస్‌చైర్మన్ రేసులో అందరి కంటే ముందు చెతన్యరాజే ఉన్నట్టు ఆయన అనుచరగణం బాహాటంగానే చెప్పింది. చంద్రబాబు కూడా చైతన్యరాజు అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరిగింది. అంతా అనుకున్నట్టే జరుగుతోందనుకుంటున్న తరుణంలో చైతన్యరాజుకు ఏకాభిప్రాయం మాటున టీడీపీ నుంచి గట్టి ఎదురు దెబ్బతగిలింది. టీడీపీ పెద్దల వ్యూహమే.. : ఏకగ్రీవ ప్రతిపాదన తెరపైకి రావడం, చైతన్యరాజు అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడం వెనుక టీడీపీ పెద్దల వ్యూహం ఉందంటున్నారు. చైతన్యరాజును కాక మరో ఎమ్మెల్సీని సూచించాలని కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్య కోరడంతోనే ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డిని టీడీపీ ప్రతిపాదించడం గమనార్హం. తమ నాయకుడిని చివరి వరకూ ఊరించిన టీడీపీ చివరి నిమిషంలో జెల్లకొట్టి అవమానించిందని చైతన్యరాజు అనుచరులు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. కాగా చైతన్యరాజు ఆశలను పెంచి, పోషించి, చివరికి తుంచి వేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నైజం వెల్లడైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బాబు ప్రజలనైనా, నేతలనైనా ఒకేరకంగా వంచించగలరని వ్యాఖ్యానిస్తున్నారు. -
'చైతన్యరాజు నామినేషన్ తిరస్కరించండి'
హైదరాబాద్: పెద్దల సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ చైతన్యరాజు బరి నుంచి తప్పుకునేలా అధిష్టానం ఒత్తిడి పెంచుతోంది. చైతన్యరాజు నామినేషన్ తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారికి మంత్రి వట్టి వసంత్‌కుమార్ ఫిర్యాదు చేశారు. చైతన్యరాజుపై నాన్‌బెయిలబుల్ కేసులు ఉన్నందున ఆయనను పోటీకి అనర్హుడి ప్రకటించాలని కోరారు. తనపై ఉన్న కేసుల గురించి అఫిడవిట్లో చైతన్యరాజు పేర్కొనలేదని మంత్రి తెలిపారు. చైతన్యరాజుతో పాటు ఆదాల ప్రభాకరరెడ్డి.. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీరద్దరి నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని రిటర్నింగ్ అధికారి ధ్రీవీకరించారు. -
నామినేషన్ ఉపసంహరించుకుంటా.. కానీ
హైదరాబాద్: వ్యాపారాల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని రాజ్యసభ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎమ్మెల్సీ చైతన్య రాజు అన్నారు. బరిలోంచి తప్పుకోవాలని తనకు బెదిరింపులు వచ్చిన మాట వాస్తమేనని ఆయన అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన తన పట్ల పార్టీ వ్యవహరించిన తీరు బాధ కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విభజన ప్రక్రియను ఎన్నికల వరకు ఆపుతామంటే నామినేషన్ ఉపసంహరించుకుంటానని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగానే తాను రాజ్యసభకు నామినేషన్ వేసినట్టు చెప్పారు. కాగా, రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగిన చైతన్య రాజు, ఆదాల ప్రభాకరరెడ్డి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. వీరిద్దరి నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని ఎన్నికల కమిషన్ తేల్చింది. -
రాజుగారికి లైన్ క్లియర్
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రాజ్యసభ ఎన్నికలకు జిల్లా నుంచి పోటీ చేసే అభ్యర్థులపై వారం రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు సోమవారం రాత్రి తెరపడింది. కోస్తా ఆంధ్రా ప్రాంతం నుంచి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చైతన్యరాజు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. రెబల్‌గా పోటీలోకి దిగేందుకు చైతన్యరాజు, విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి పోటీ పడ్డారు. దీనిపై రెండు రోజులుగా హైదరాబాద్‌లో సీమాంధ్ర ఎమ్మెల్యేలతో జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. చివరకు చైతన్యరాజుకు లైన్ క్లియర్ అయింది. ఆయన పోటీ చేసేందుకు, గంటా, ఏరాసు బరి నుంచి తప్పుకునేందుకు వారి మధ్య అంగీకారం కుదిరింది. హైదరాబాద్ మంత్రుల క్వార్టర్స్‌లో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ మూడు దఫాలుగా జరిగిన చర్చల్లో చైతన్యరాజు అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం వచ్చింది. అయితే రాయలసీమ నుంచి జేసీ దివాకరరెడ్డి పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ సీమాంధ్ర నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు చైతన్యరాజు వైపు మొగ్గు చూపారు. నామినేషన్ వేసేందుకు అవసరమైన ఎమ్మెల్యేల నుంచి సంతకాల సేకరణ పూర్తి చేసినట్టు చైతన్యరాజు అనుచరులు చెబుతున్నారు. ఆయన మంగళవారం ఉదయం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.మరోపక్క రాయలసీమకు చెందిన మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి కూడా కాంగ్రెస్ రెబల్‌గా పోటీలో నిలుస్తున్నారు. గతంలో జిల్లా ఇన్చార్జి మంత్రిగా పని చేసిన ఆయనకు మద్దతుగా జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. బరిలో ఉంటానని చైతన్యరాజు ముందునుంచీ చెబుతున్నప్పటికీఆ ముగ్గురు ఎమ్మెల్యేలూ జేసీకి మద్దతు తెలపడంతో, మిగిలిన ఎమ్మెల్యేలు అయోమయాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఎలాగూ చైతన్యరాజు బరిలో దిగుతుండడంతో వారు ఎటువైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే. ఈ పరిస్థితుల్లో చైతన్యరాజుకు జిల్లా నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు ఓటేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు తమ్ముళ్ల ఆశలు అడియాసలే.. రాజ్యసభ టిక్కెట్టు కోసం జిల్లా టీడీపీ నేతలు పెట్టుకున్న ఆశలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నీళ్లు చల్లేశారు. కోస్తా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తోట సీతామహాలక్ష్మిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఈమేరకు హైదరాబాద్‌లో సోమవారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. ఆమె పేరును మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జిల్లాకు చెందిన మాజీ మంత్రులు చిక్కాల రామచంద్రరావు, డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం నిరాశ చెందుతున్నారు. తమకు అవకాశం కల్పించాలని దాదాపు వీరంతా చంద్రబాబును కోరారు. వీరిలో చిక్కాల, చినరాజప్ప సీటు ఖాయమన్న ధీమాతో కనిపించారు. కొత్తపేట నియోజకవర్గంలో పాతకాపులు తిరిగి పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో.. బీసీల్లో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యానికి రాజ్యసభ టిక్కెట్టు దక్కుతుందని ఆశించారు. చివరకు ఆయనకు కూడా చంద్రబాబు మొండిచెయ్యి చూపారు.