రాజుగారికి లైన్ క్లియర్
రాజుగారికి లైన్ క్లియర్
Published Tue, Jan 28 2014 12:56 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రాజ్యసభ ఎన్నికలకు జిల్లా నుంచి పోటీ చేసే అభ్యర్థులపై వారం రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు సోమవారం రాత్రి తెరపడింది. కోస్తా ఆంధ్రా ప్రాంతం నుంచి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చైతన్యరాజు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. రెబల్‌గా పోటీలోకి దిగేందుకు చైతన్యరాజు, విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి పోటీ పడ్డారు. దీనిపై రెండు రోజులుగా హైదరాబాద్‌లో సీమాంధ్ర ఎమ్మెల్యేలతో జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. చివరకు చైతన్యరాజుకు లైన్ క్లియర్ అయింది. ఆయన పోటీ చేసేందుకు, గంటా, ఏరాసు బరి నుంచి తప్పుకునేందుకు వారి మధ్య అంగీకారం కుదిరింది. హైదరాబాద్ మంత్రుల క్వార్టర్స్‌లో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ మూడు దఫాలుగా జరిగిన చర్చల్లో చైతన్యరాజు అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం వచ్చింది. అయితే రాయలసీమ నుంచి జేసీ దివాకరరెడ్డి పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ సీమాంధ్ర నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు చైతన్యరాజు వైపు మొగ్గు చూపారు. నామినేషన్ వేసేందుకు అవసరమైన ఎమ్మెల్యేల నుంచి సంతకాల సేకరణ పూర్తి చేసినట్టు చైతన్యరాజు అనుచరులు చెబుతున్నారు.
ఆయన మంగళవారం ఉదయం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.మరోపక్క రాయలసీమకు చెందిన మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి కూడా కాంగ్రెస్ రెబల్‌గా పోటీలో నిలుస్తున్నారు. గతంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా పని చేసిన ఆయనకు మద్దతుగా జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. బరిలో ఉంటానని చైతన్యరాజు ముందునుంచీ చెబుతున్నప్పటికీఆ ముగ్గురు ఎమ్మెల్యేలూ జేసీకి మద్దతు తెలపడంతో, మిగిలిన ఎమ్మెల్యేలు అయోమయాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఎలాగూ చైతన్యరాజు బరిలో దిగుతుండడంతో వారు ఎటువైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే. ఈ పరిస్థితుల్లో చైతన్యరాజుకు జిల్లా నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు ఓటేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
తెలుగు తమ్ముళ్ల ఆశలు అడియాసలే..
రాజ్యసభ టిక్కెట్టు కోసం జిల్లా టీడీపీ నేతలు పెట్టుకున్న ఆశలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నీళ్లు చల్లేశారు. కోస్తా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తోట సీతామహాలక్ష్మిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఈమేరకు హైదరాబాద్‌లో సోమవారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. ఆమె పేరును మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జిల్లాకు చెందిన మాజీ మంత్రులు చిక్కాల రామచంద్రరావు, డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం నిరాశ చెందుతున్నారు. తమకు అవకాశం కల్పించాలని దాదాపు వీరంతా చంద్రబాబును కోరారు. వీరిలో చిక్కాల, చినరాజప్ప సీటు ఖాయమన్న ధీమాతో కనిపించారు. కొత్తపేట నియోజకవర్గంలో పాతకాపులు తిరిగి పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో.. బీసీల్లో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యానికి రాజ్యసభ టిక్కెట్టు దక్కుతుందని ఆశించారు. చివరకు ఆయనకు కూడా చంద్రబాబు మొండిచెయ్యి చూపారు.
Advertisement
Advertisement