సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శాసనసభలోని కమిటీ హాల్ నంబర్– 1లో శుక్రవారం ఉదయం 9 గంటలకు పోలిం గ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు శాసనసభ సచివాలయం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 117 మంది ఓటర్లు ఉన్నట్టు అధికారికంగా ప్రకటించారు. మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా.. నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా జోగినపల్లి సంతోష్‌కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్యయాదవ్ బరిలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పి.బలరాంనాయక్ పోటీ చేస్తున్నారు.
10.30కు ఓటేయనున్న కేసీఆర్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉదయం 10.30 గంటలకు ఓటు వేయనున్నారు. శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ఉదయమే తొలి ఓటు వేసే అవకాశముంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. సుమారు ఆరు గంటల సమయంలో ఫలితాలను అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
పక్కా వ్యూహంతో టీఆర్‌ఎస్..
తాము నిలబెట్టిన ముగ్గురు అభ్యర్థులను కచ్చితంగా గెలిపించుకోవడడంపై టీఆర్‌ఎస్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. వరుసగా మూడు రోజులపాటు మాక్‌పోలింగ్‌ను నిర్వహించి.. ఓటు వేయడంలో ఏ మాత్రం పొరపాటు జరగకుండా ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చింది. ఒకే అభ్యర్థికి ఎక్కువగా ఓట్లు పడకుండా, అభ్యర్థులందరికీ సమానంగా వచ్చేలా ఎమ్మెల్యేలను విభజించారు కూడా. వాస్తవానికి ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం, కొన్ని పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో ఒక్కో రాజ్యసభ అభ్యర్థి గెలవడానికి 27 ఓట్లు సరిపోతాయన్న అంచనాలో టీఆర్‌ఎస్ ఉంది. టీఆర్‌ఎస్ సొంత ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, సీపీఐ మినహా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినవారు కలిపి 82 మంది ఉన్నారు.
మజ్లిస్ మద్దతిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను కలిపితే 89 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లతోనే టీఆర్‌ఎస్ ముగ్గురు అభ్యర్థులు గట్టెక్కుతారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఏడుగురు ఎమ్మెల్యేల ఓట్లు, ఒక సీపీఐ ఎమ్మెల్యే ఓటు కూడా కలిపితే అవసరానికంటే ఎక్కువగానే ఓట్లు వస్తాయని లెక్కిస్తున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా ఉదయమే తెలంగాణభవన్‌కు చేరుకుని.. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీలోని పోలింగ్ కేంద్రానికి రానున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సమావేశమై.. రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
ఓటింగ్‌కు దూరంగా బీజేపీ, టీడీపీ, సీపీఎం
రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు సమాన దూరం పాటించాలని బీజేపీ, టీడీపీ, సీపీఎం నిర్ణయించాయి. ఈ మేరకు మూడు పార్టీలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి, రాజ్యసభ ఎన్నికల్లో వైఖరిపై జాతీయపార్టీతో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో చర్చలు జరిపామని.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండింటికీ సమాన దూరం పాటించాలని నిర్ణయించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు. టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటులో సభా కార్యక్రమాలకు అడ్డు తగలడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment