సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, బండా ప్రకాశ్ గెలుపొందారు. వీరిలో బండా ప్రకాశ్‌కు అత్యధికంగా 33 ఓట్లురాగా.. సంతోష్, లింగయ్యయాదవ్‌లకు 32 ఓట్ల చొప్పున పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌కు 10 ఓట్లు పడ్డాయి. దీంతో ముగ్గురు టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందినట్టుగా రిటర్నింగ్ అధికారి నర్సింహాచార్యులు ప్రకటించి, ధ్రువ పత్రాలు అందజేశారు.
107 ఓట్లు మాత్రమే..
శాసనసభలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇద్దరు సభ్యులు (కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్) ఇటీవల అనర్హత వేటుకు గురయ్యారు. దాంతో ఎన్నికల సంఘం మిగతా 117 సభ్యులను ఓటర్లుగా ప్రకటించగా.. 108 మంది ఓటు వేశారు. మొత్తంగా టీఆర్‌ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే ఈసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీకి చెందిన ముగ్గురు (శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డితో పాటు ఆర్.కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్య), బీజేపీకి చెందిన ఐదుగురు, సీపీఎం సభ్యుడు ఒకరు ఓటు వేయలేదు.
ఇక నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్వతంత్రుడిగా గెలిచినా.. తాను కాంగ్రెస్ అసోసియేట్‌గా కొనసాగుతానని గతంలో స్పీకర్‌కు విన్నవించుకున్నారు. ఆ ధ్యాసలోనే శుక్రవారం పోలింగ్ సందర్భంగా మాధవరెడ్డి తన ఓటును కాంగ్రెస్ ఏజెంట్‌కు చూపించి వేశారు. కానీ స్వతంత్ర ఎమ్మెల్యే అయిన మాధవరెడ్డి కాంగ్రెస్ పోలింగ్ ఏజెంటుకు ఓటును చూపించడం నిబంధనల ప్రకారం తప్పు. దీనిపై టీఆర్‌ఎస్ ఫిర్యాదు చేయడంతో.. ఆ ఓటును లెక్కపెట్టవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దాంతో 107 ఓట్లను మాత్రమే లెక్కించారు. ఇక టీఆర్‌ఎస్‌లో చేరిన ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లను తిరస్కరించాలని, విప్‌ను ధిక్కరించిన వారిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించాలనే నిర్ణయించింది.
తొలి ఓటు వేసిన ఈటల
అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా ఉదయమే తెలంగాణ భవన్‌కు చేరుకుని, అక్కడే అల్పాహారం ముగించుకుని బస్సుల్లో అసెంబ్లీకి వచ్చారు. నేరుగా పోలింగ్ హాల్లోకి వెళ్లి ఓటేశారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తొలి ఓటు వేశారు. తర్వాత మంత్రులు మహేందర్‌రెడ్డి, హరీశ్‌రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సీఎల్పీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. సీఎల్పీ కార్యాలయంలో కొంతసేపు సమావేశమైన అనంతరం వెళ్లి ఓటేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మజ్లిస్ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి వేసిన చివరి ఓటుతో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక టీడీపీ, బీజేపీ, సీపీఎం సభ్యులు అసెంబ్లీకి వచ్చినా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
మీడియాను రానీయకుండా..
రాజ్యసభ ఎన్నికల కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులను అసెంబ్లీ పోలింగ్ స్టేషన్‌లోకి అనుమతించలేదు. పోలింగ్ స్టేషన్లలో ప్రవేశానికి ఎన్నికల కమిషన్ జారీ చేసిన పాసులున్నా రానీయకపోవడం గమనార్హం. రోజువారీ అసెంబ్లీ కార్యకలా పాలు జరిగే సమయంలో లాబీల్లోకి ప్రవేశ మున్నా.. ఎన్నిక జరుగుతోందంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలింగ్ ప్రారంభమైన సమయంలో మీడియా ప్రతినిధులకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది.
ఆ ముగ్గురికి అభినందనల వెల్లువ
రాజ్యసభ సభ్యులుగా గెలుపొందిన సంతోష్‌కుమార్, బండా ప్రకాశ్, లింగయ్య యాదవ్‌లను పలువురు అభినందించారు. శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, మంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇక పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నేతలు అసెంబ్లీ వద్దకు వచ్చి.. గెలుపొందినవారిని శాలువాలతో సత్క రించి, పూలబొకేలు అందించారు. గెలుపుతో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
ఆ ఏడుగురు టీఆర్‌ఎస్‌కే..
కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కు వినియోగించు కున్నారు. వారం తా కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్లకు ఓటును చూపించి మరీ.. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటేయడం గమనార్హం. టీడీపీ నుంచి గెలిచి, తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అసెంబ్లీకి వచ్చినా ఓటు వేయలేదు. టీఆర్‌ఎస్ తరఫున పోలింగ్ ఏజెంట్లుగా ఆర్.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఎం.రమేశ్‌రెడ్డి, ఎన్.రాజేశ్వర్‌రావు, గట్టు రామచందర్ రావులు వ్యవహరించారు. కాంగ్రెస్ అభ్యర్థి పక్షాన రేగా కాంతారావు, మల్లురవి, సీతక్క ఏజెంట్లుగా కూర్చున్నారు.
Comments
Please login to add a commentAdd a comment