నామినేషన్ ఉపసంహరించుకుంటా.. కానీ
హైదరాబాద్: వ్యాపారాల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని రాజ్యసభ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎమ్మెల్సీ చైతన్య రాజు అన్నారు. బరిలోంచి తప్పుకోవాలని తనకు బెదిరింపులు వచ్చిన మాట వాస్తమేనని ఆయన అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన తన పట్ల పార్టీ వ్యవహరించిన తీరు బాధ కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విభజన ప్రక్రియను ఎన్నికల వరకు ఆపుతామంటే నామినేషన్ ఉపసంహరించుకుంటానని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగానే తాను రాజ్యసభకు నామినేషన్ వేసినట్టు చెప్పారు.
కాగా, రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగిన చైతన్య రాజు, ఆదాల ప్రభాకరరెడ్డి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. వీరిద్దరి నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని ఎన్నికల కమిషన్ తేల్చింది.