అసెంబ్లీలో పార్టీలకు స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నచోట రాజ్యసభ ఎన్నికలనేవి అంతా సజావుగా సాగిపోయే మామూలు తంతు. కానీ, పార్టీ ఏదైనా సరే పాలకపక్షంతో అంటకాగడానికీ, జెండా కన్నా సొంత అజెండాకు పెద్ద పీట వేయడానికీ ప్రజాప్రతినిధులు దిగజారితే, పెద్దల సభకు ఎన్నికలు సైతం చిన్న బుద్ధులకు వేదిక అనిపించక మానవు. ఫిబ్రవరి 27న యూపీ (10 సీట్లు), కర్ణాటక (4 సీట్లు), హిమాచల్ ప్రదేశ్ (1)లలో ఎగువసభ ఎన్నికలు అలానే సాగాయి. హిమాచల్‌లో అధికార కాంగ్రెస్ సభ్యులు ఆరుగురు, యూపీలో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు ఏడుగురు క్రాస్ ఓటింగ్‌కు దిగడంతో ఆ పార్టీలు చెరొక స్థానాన్ని బీజేపీకి కోల్పోయాయి. ఒక బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు ఓటేసిన కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్ నాలుగింట తనకు దక్కాల్సిన 3 స్థానాల్ని నిలబెట్టుకుంది.
మంగళవారం 15 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరిగితే, బీజేపీ తన బలంతో గెలవగలిగిన వాటి కన్నా రెండు సీట్లు ఎక్కువగా 10 సొంతం చేసుకుంటే, కాంగ్రెస్, ఎస్పీలు తమ సంఖ్యాబలం కన్నా చెరొకటి తక్కువగా వరుసగా 3, 2 సీట్లే దక్కించుకోవడం గమనార్హం. ప్రజాప్రతినిధుల్ని రకరకా లుగా ప్రలోభపెట్టి, క్రాస్ ఓటింగ్‌కు దిగజార్చే దుష్టసంస్కృతి పూర్తి స్థాయిలో స్థిరపడినట్టు మరో సారి రుజువైంది. రాజ్యసభ ఎన్నికలకు విప్‌ల జారీ కుదరదు కానీ, తమ పార్టీ నియమించిన ఏజెంట్‌కు లెజిస్లేటర్లు తమ బ్యాలెట్ పేపర్లు చూపాలి. అయినా సరే, ఎమ్మెల్యేలు తామున్న పార్టీ వైఖరికి భిన్నంగా ఓటేయడం వర్తమాన రాజకీయాలలో విలువల పతనానికి విషాద నిదర్శనం. చిత్రమేమంటే, హిమాచల్‌లో రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు మనుగడనే బీజేపీ ప్రశ్నార్థకం చేసింది.
ఉత్తరాదిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్ని కల్లో గత ఏడాదే గెలిచి, హస్తం పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రం నుంచి తమ అభ్యర్థి గెలుపునకు కావాల్సిన బలం కన్నా ఎక్కువ ఎమ్మెల్యేలే తమకున్నారని అధికార కాంగ్రెస్ పెద్దలు ఏమరుపాటుగా ఉంటే, అదను కోసం చూస్తున్న ప్రతిపక్ష బీజేపీ తమ ‘ఆపరేషన్ కమల్’కు పదును పెట్టింది. ఫలితంగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు తిరుగుబాటు చేసి, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటేశారు. ఫలితంగా, మెజారిటీతో ఇట్టే గెలవాల్సిన కాంగ్రెస్ అభ్యర్థి – ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వీకి కాస్తా ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థితో సమానంగా మాత్రమే ఓట్లొచ్చిన పరిస్థితి. లాటరీలోనూ అదృష్టం బీజేపీ పక్షాన నిలిచేసరికి, ఆ రాజ్యసభా స్థానం కాంగ్రెస్ చేజారింది.
హిమాచల్‌లో కొద్దినెలలుగా కుతకుతలాడుతున్న అసంతృప్తిని అలక్ష్యం చేసి, బీజేపీ ‘ఆకర్షణ మంత్రాన్ని’ తక్కువగా అంచనా వేసి, కాంగ్రెస్ చేజేతులా ఈ ఓటమి కొనితెచ్చుకుంది. చివరకు అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందాల్సినవేళ సభలో మెజారిటీ కోల్పోయిన కాంగ్రెస్ సర్కార్ కూలిపోయే దుఃస్థితి తలెత్తింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలస్యంగానైనా బరిలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడింది. సీనియర్ నేతలు డీకే శివకుమార్, భూపిందర్ సింగ్ హూడా తదితరుల్ని హిమాచల్ పంపింది. సుఖూ ప్రభుత్వంలో తమకు తగిన ప్రాధాన్యం లభించడం లేదన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు. ఈ విషయంపై వారు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిష్ఠానం తాజా బుజ్జగింపులతో అంతా సద్దుమణుగుతుందా అన్నది చూడాలి.
‘నేను పోరాట యోధుణ్ణి, రాజీనామా ప్రసక్తే లేదు’ అని సీఎం సుఖూ బింకంగా చెబుతున్నా, సభలో మెజారిటీ ఆయనకుందా, సొంత ఎమ్మెల్యేల్లోనే తీవ్ర అసంతృప్తి ఉన్నందున ఆయన అధికారంలో కొనసాగగలరా అన్నది అనుమానమే. మొత్తం 68 మంది సభ్యుల హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలగం 40 మంది. ఆరుగురి క్రాస్ ఓటింగ్‌తో దాని బలం 34కు పడిపోయింది. ఇక, బీజేపికి 25 మంది ఉంటే, ఇండిపెండెంట్లు ముగ్గురున్నారు. బీజేపీ పాలిత హర్యానాలో పంచ కులాలో మకాం వేసిన కాంగ్రెస్ రెబెల్స్‌తో కలుపుకొంటే కాషాయ బలమూ 34కు చేరింది. సభలో మెజారిటీ మార్కు 35.
ఇంకా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను సంప్రతిస్తున్నారని బీజేపీ అంటున్నందున ఏమైనా జరగవచ్చు. ఈ నేపథ్యంలో నాటకీయత పెంచుతూ బుధవారం 15 మంది బీజేపీ ఎమ్మెల్యేల్ని అసెంబ్లీ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్‌తో ఇప్పటికి గండం గట్టె క్కాలన్నది తాపత్రయం. అదే జరిగినా, సుఖూను వ్యతిరేకిస్తూ, సీఎం పీఠానికై విక్రమాదిత్య సింగ్ సహా ముగ్గురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతుండడం గమనార్హం. మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమా రుడైన విక్రమాదిత్య మంత్రి పదవికి రాజీనామా ఇస్తున్నట్టు ప్రకటించడం కథలో కీలక మలుపు.
ఎన్నికల్లో మెజారిటీ ఏ పార్టీకి దక్కినా, ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేసినా, ఆఖరుకు అక్కడ బీజేపీయే అధికార చక్రం తిప్పడం కొన్నేళ్ళుగా పెరుగుతున్న ధోరణి. సామ దాన భేద దండోపా యాలు ప్రయోగించి ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యర్థి పార్టీ నేతల్ని తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీది ఇప్పుడు తిరుగులేని రికార్డు. 2019లో కర్ణాటకలో జేడీ–ఎస్ నేత కుమారస్వామి ప్రభుత్వం, 2020లో మధ్యప్రదేశ్‌లో కమలనాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్, 2022లో మహారాష్ట్రలోని శివ సేన ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్... ఇలా గత నాలుగేళ్ళలో కాషాయపార్టీ పాలబడినవి ఎన్నో.
తాజాగా హిమాచల్‌లోని సుఖూ సారథ్య కాంగ్రెస్ సర్కార్ ఆ జాబితాలో చేరేలా కనిపిస్తోంది. సుఖూ పట్ల పార్టీలో వ్యతిరేకతను సర్దుబాటు చేసుకోవాల్సింది కాంగ్రెస్. కానీ, ఒక పార్టీ అంతర్గత విభేదాల కుంపటిలో మరొక పార్టీ చలి కాచుకొని, అధికారం చేజిక్కించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమే. సంతలో ప్రజాప్రతినిధులను కొని, ప్రజాతీర్పు తమ వైపు ఉందని ఏ పార్టీ భావించినా అది అవివేకం. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. సమయం చూసి సమాధానం చెబుతారు.
చిన్న బుద్ధుల పెద్ద ఎన్నిక
Published Thu, Feb 29 2024 4:43 AM | Last Updated on Thu, Feb 29 2024 4:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment