'రవికిరణ్‌కు, మాకు ఎలాంటి సంబంధం లేదు'
అమరావతి: పొలిటికల్ పంచ్ రవికిరణ్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆపార్టీ ఐటీ వింగ్ ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. లక్షలమంది వైఎస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల్లో రవికిరణ్ ఒక్కరన్నారు. రవికిరణ్ కేసు విషయంలో మధుసూదన్ రెడ్డి మంగళవారం అమరావతి పోలీసుల విచారణకు హారయ్యారు.
విచారణ అనంతరం చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 30న మరోసారి విచారణకు రమ్మన్నారని తెలిపారు. తాము సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టింగ్‌లు గతంలోనూ పెట్టలేదని, భవిష్యత్‌లోనూ పెట్టమని తెలిపారు. తాము ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైనే వ్యంగ్యంగా పోస్టింగ్‌లు పెడతామే తప్ప, కించపరిచే విధంగా ఉండవన్నారు.
తాము ఈ తాటాకు చప్పుళ్లు, ఉడత బెదిరింపులకు భయపడేది లేదని మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. రవికిరణ్‌తో వైఎస్ఆర్ సీపీకి కానీ, 'సాక్షి' మీడియాకు కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో చెప్పామన్నారు. అయితే రవికిరణ్‌కు వైఎస్‌ఆర్ సీపీ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.
తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు, ఆయన కుటుంబసభ్యులపై అసభ్యంగా పెట్టిన పోస్టులపై తాను ఫిర్యాదు చేస్తే పోలీసులు తీసుకోలేదన్నారు. సాక్ష్యాలు ఉన్నప్పటికీ కనీసం తన ఫిర్యాదును తీసుకునే పరిస్థితి కూడా లేదన్నారు. పోలీసులు టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. తన ఫిర్యాదుపై దొంగ సాకులు చెబుతున్నారని ఆయన అన్నారు.
అలాగే పొలిటికల్ పంచ్ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవికిరణ్ అమరావతిలో పోలీసుల విచారణకు మరోసారి హాజరయ్యారు. తన వెబ్‌సైట్‌లో ఒక్క టీడీపీ ప్రభుత్వం మీదే కాదని, దాదాపు అన్ని రాజకీయ పార్టీలపై పోస్టులు ఉన్నాయని ఆయన తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. విచారణ కోసం పోలీసులు పిలవటంతోనే తాను అమరావతి వచ్చానని ఆయన పేర్కొన్నారు.