challa madhusudan reddy
-
నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యం
కడప కార్పొరేషన్: యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్ జిల్లా కడపలోని ప్రభుత్వ ఐటీ కళాశాలల ఆవరణలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్‌ను శనివారం ఆయన ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ సీఎం ఆదేశాలతో ప్రతి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ సలహాదారు(స్కిల్ డెవలప్మెంట్, శిక్షణ) చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ స్థానికులకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా సీఎం జగన్ రెండు స్కిల్ వర్సిటీలు, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజీ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో స్కిల్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన సజ్జల సిద్దవటం: అన్నమయ్య జిల్లా సిద్దవటం మండలంలోని నేకనాపురానికి సమీపంలో డాక్టర్ సంజీవమ్మ, డాక్టర్ తక్కోలి మాచిరెడ్డి దంపతులు నిర్మించిన జీవని వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఆశ్రమానికి తన వంతుగా రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఓబులేసు పాల్గొన్నారు. -
తొలిదశలో 66 స్కిల్ హబ్స్ ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంలో భాగంగా కీలక అడుగు ముందుకు పడింది. ఇంటర్మీడియట్, అంతకంటే తక్కువ చదువు ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒకటి వంతున ఏర్పాటు చేస్తున్న 175 స్కిల్ హబ్స్, అదనంగా మరో రెండు హబ్స్ (మొత్తం 177)లో తొలిదశ కింద 66 స్కిల్ హబ్స్ గురువారం ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లా డోన్‌లో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్‌ను రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)ఎండీ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ స్థానికులకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి రెండు స్కిల్ యూనివర్సిటీలు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజీ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలో స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా 66 స్కిల్ హబ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, త్వరలోనే మిగిలిన 111 హబ్స్ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఎండీ సత్యనారాయణ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించే విధంగా కోర్సులను తీర్చిదిద్దినట్లు తెలిపారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఆయా సంస్థలే ఉపాధి కల్పిస్తాయన్నారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (స్కిల్ డెవలప్మెంట్) చల్లా మధుసూదన్‌రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలోని ప్రభుత్వ కాలేజీలో ఈ స్కిల్ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
ఈ ఏడాది 312 జాబ్ మేళాలు
సాక్షి, అమరావతి: స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా వచ్చే 12 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 312 జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రకటించింది. ఇక నుంచి ప్రతి శుక్రవారం ఒక్కో జిల్లాలో కనీసం ఒక జాబ్ మేళా నిర్వహించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఏపీఎస్ఎస్డీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి, చైర్మన్ అజయ్‌రెడ్డి, జాబ్ మేళా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, ఏపీఎస్ఎస్డీసీ ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కల్పించే విధంగా ప్రతి మంగళవారం ప్లేస్మెంట్ డే నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించే విధంగా 262 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ, గడిచిన మూడేళ్లలో 14 లక్షల మందికి ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రతీ నియోజకవర్గం పరిధిలో స్కిల్హబ్స్ ప్రారంభిస్తున్నామని, ఇందులో భాగంగా తొలి విడతలో 66 హబ్స్‌ను ఆగస్టు 15న అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఎస్ఎస్డీసీ చైర్మన్ అజయ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరంలో లక్ష మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
సుస్థిర అభివృద్ధిలో దూసుకుపోతున్న ఏపీ
సాక్షి, అమరావతి: సుస్థిర అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోందని ప్రభుత్వ సలహాదారు (స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్) సలహాదారు చల్లా మధు తెలిపారు. ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా ర్యాంకింగ్స్‌లో సుస్థిర అభివృద్ధిలో 72 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచిందని చెప్పారు. తాడేపల్లిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నీతి ఆయోగ్ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2020–21లో దేశంలో కోస్తా రాష్ట్రాల్లో ఒడిశా తర్వాతి స్థానాన్ని ఏపీ దక్కించుకొందన్నారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలు ప్రవేశపెడుతూ సంక్షేమం, అభివృద్ధి పరంగా ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శక్తివంతంగా మారుతుండటాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. ప్రభుత్వంపైన, వైఎస్సార్సీపీ పైనా ఎల్లో మీడియా బలంతో దుర్మార్గమైన కుట్ర, కుతంత్రాలతో అధికారమే పరమావధిగా టీడీపీ దుష్ప్రచారానికి ఒడిగడుతోందన్నారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన ర్యాంకులను చూసిన తర్వాత అయినా చంద్రబాబు, ఆయన కుమారుడు, టీడీపీ నేతలు వారి తీరు మార్చుకోవాలని హితవు పలికారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం ఓ విప్లవాత్మక చర్య అని అన్నారు. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో చేయలేనిది వైఎస్ జగన్ సీఎంగా రెండున్నరేళ్లలో చేసి చూపారని తెలిపారు. కేంద్ర బడ్జెట్ రాష్ట్రాలకు ప్రయోజనకారి కాదు కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరుత్సాహపరిచిందని చెప్పారు. ఈ బడ్జెట్ రాష్ట్రాలకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేదన్నారు. రాష్ట్రానికి సంబంధించిన చాలా విషయాలపై ఎలాంటి ప్రస్తావనా చేయలేదని తెలిపారు. చూడటానికి మేడిపండులా ఉన్నా, అందులో ఏమీ లేదని తెలిపారు. ఆర్థిక మంత్రి చెప్పిన సబ్ కా వికాస్ అస్సలు లేదన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా అత్యల్పంగా ఉందన్నారు. రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద లక్ష కోట్లు ఇస్తామన్నారని, ఇప్పుడున్న ఫార్ములా మేరకు రాష్ట్రానికి రూ.4 వేల కోట్లే వస్తుందన్నారు. వెంటనే ఆ ఫార్ములాను సవరించి, రాష్ట్ర వాటా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. -
'రవికిరణ్‌కు, మాకు ఎలాంటి సంబంధం లేదు'
అమరావతి: పొలిటికల్ పంచ్ రవికిరణ్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆపార్టీ ఐటీ వింగ్ ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. లక్షలమంది వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుల్లో రవికిరణ్ ఒక్కరన్నారు. రవికిరణ్ కేసు విషయంలో మధుసూదన్ రెడ్డి మంగళవారం అమరావతి పోలీసుల విచారణకు హారయ్యారు. విచారణ అనంతరం చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 30న మరోసారి విచారణకు రమ్మన్నారని తెలిపారు. తాము సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టింగ్‌లు గతంలోనూ పెట్టలేదని, భవిష్యత్‌లోనూ పెట్టమని తెలిపారు. తాము ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైనే వ్యంగ్యంగా పోస్టింగ్‌లు పెడతామే తప్ప, కించపరిచే విధంగా ఉండవన్నారు. తాము ఈ తాటాకు చప్పుళ్లు, ఉడత బెదిరింపులకు భయపడేది లేదని మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. రవికిరణ్‌తో వైఎస్ఆర్ సీపీకి కానీ, 'సాక్షి' మీడియాకు కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో చెప్పామన్నారు. అయితే రవికిరణ్‌కు వైఎస్ఆర్ సీపీ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు, ఆయన కుటుంబసభ్యులపై అసభ్యంగా పెట్టిన పోస్టులపై తాను ఫిర్యాదు చేస్తే పోలీసులు తీసుకోలేదన్నారు. సాక్ష్యాలు ఉన్నప్పటికీ కనీసం తన ఫిర్యాదును తీసుకునే పరిస్థితి కూడా లేదన్నారు. పోలీసులు టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. తన ఫిర్యాదుపై దొంగ సాకులు చెబుతున్నారని ఆయన అన్నారు. అలాగే పొలిటికల్ పంచ్ వెబ్సైట్ నిర్వాహకుడు రవికిరణ్ అమరావతిలో పోలీసుల విచారణకు మరోసారి హాజరయ్యారు. తన వెబ్సైట్లో ఒక్క టీడీపీ ప్రభుత్వం మీదే కాదని, దాదాపు అన్ని రాజకీయ పార్టీలపై పోస్టులు ఉన్నాయని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. విచారణ కోసం పోలీసులు పిలవటంతోనే తాను అమరావతి వచ్చానని ఆయన పేర్కొన్నారు.