మతతత్వ పార్టీలతో పొత్తు ఊసే లేదని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుకుని ఊసరవెల్లి నైజాన్ని నిరూపించుకున్నాడని ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం తన ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, సీపీఎం పట్టణ కార్యదర్శి పోలా రామాంజనేయులు, సీపీఐ పట్టణ కార్యదర్శి జింకా చలపతిలతో కలసి మాట్లాడారు.
బీజేపీతో పొత్తు చారిత్రాత్మక తప్పిదమని 2009 ఎన్నికల్లో ఓటమి అనంతరం చెప్పిన చంద్రబాబు, మీకోసం పాదయాత్రలో ఒకడుగు ముందుకు వేసి మతతత్వ పార్టీలతో పొత్తు ఊసే లేదని ప్రకటించాడన్నారు. ప్రస్తుతం మోడీ ద్వారా లబ్ధి పొందే లక్ష్యంతో అదే బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకున్నాడన్నారు. తమ పార్టీకి వామపక్షాలతో పొత్తు కుదరడంతో ధర్మవరం మునిసిపల్ ఎన్నికల్లో సీపీఎంకు 5,6 వార్డులు, సీపీఐకి 2వ వార్డు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం శంకరనారాయణ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్షం స్థాయిలో వామపక్షాలు పోరాడాయన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పూటకోమాట మాట్లాడుతూ జనాలను తప్పుదోవపట్టిస్తున్నాడని విమర్శించారు. బీజేపితో పొత్తుపెట్టుకుని ముస్లిం మైనార్టీలకు ద్రోహం చేస్తున్నాడని దుయ్యబట్టారు. సీపీఎం నాయకులు పోలా రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌తో పాటు చంద్రబాబుకూ భాగం ఉందన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఢిల్లీకి వినిపిస్తే, ప్రస్తుత అధ్యక్షుడు రాజ కీయ ప్రయోజనాల కోసం తెలుగుజాతిని విచ్ఛిన్నం చేశాడన్నారు.
సీపీఐ నాయకులు జింకా చలపతి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీతో కలిసి పనిచేయడం తమకు సంతృప్తినిస్తోందన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం పోరాడిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ అని, ఆ పార్టీని ఆదరించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకలు గుండాపురుషోత్తం, సీఐటీయూ నాయకులు ఎస్‌హెచ్ బాషాలు పాల్గొన్నారు.