వినేవాడు లోకువ అయితే..! | chandra babu | Sakshi
Sakshi News home page

వినేవాడు లోకువ అయితే..!

Published Sun, Mar 1 2015 2:26 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

వినేవాడు లోకువ అయితే..! - Sakshi

వినేవాడు లోకువ అయితే..!

సాక్షి ప్రతినిధి, కడప: ‘వినేవాడు లోకువైతే చెప్పేవాడు చంద్రబాబు’ అన్న సూక్తి మరోమారు రుజువు అయింది. గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన మినహా ఆ ప్రాజెక్టు సాధనలో గతంలో ఏమాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. ఇప్పుడేమో తానే నీళ్లు తెస్తున్నానని ప్రకటిస్తున్నారు. తొమ్మిది సంవత్సరాల చంద్రబాబు హయాంలో కేవలం రూ.19 కోట్లు మాత్రమే ఖర్చు చేశారంటే దీనిపై ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం అవుతుంది. పైగా జిఎన్‌ఎస్‌ఎస్ సాధ్యం కాదని కృష్ణస్వామి కమిటీ ఏర్పాటు చేసి రద్దు చేయాలని చూశారు. 3 టీఎంసీల సామర్థ్యంతో పెన్నా వరదను ఆధారంగా చేసుకుని నిర్మిస్తే సరిపోతుందని అప్పట్లో ప్రాజెక్టుకు గండికొట్టబోయారని సాగునీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు.
 
 గాలేరి-నగరి సుజల స్రవంతి రూపకర్త దివంగత ఎన్టీరామారావు అని, గండికోట ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని, కాలువు గట్టుపై నిద్రించైనా గండికోటకు నీరు తెస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ప్రకటించారు. మెట్ట ప్రాంతానికి నీరు తీసుకరావడం హర్షించదగ్గ పరిణామం. అయితే ఆచరణ సాధ్యంకానీ హామీలు గుప్పించడంలో చంద్రబాబుకు మరెవ్వరూ సాటిరారనేది గతం చెబుతున్న సత్యం. జిఎన్‌ఎస్‌ఎస్ రూపకర్త ఎన్టీరామారావు అయినప్పటికీ చిత్తశుద్ధితో ఆ ప్రాజెక్టును పూర్తికి భారీగా నిధులు మంజూరు చేసింది మాత్రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నది వాస్తవం. 2004-09 మధ్య దివంగతనేత హయాంలోనే రూ.3800 కోట్లు జిఎన్‌ఎస్‌ఎస్ కోసం ఖర్చు చేశారని లెక్కలు చెబుతున్నాయి.  
 
 నాడు జిఎన్‌ఎస్‌ఎస్‌కు మంగళం పలికే ఎత్తుగడ....
 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 1998లో జిఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టు సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారు. ప్రాజెక్టుపై వాస్తవ విషయాలను తెలుసుకునే పేరుతో కృష్ణస్వామి నేతృత్వంలో కమిటీ నియమించారు. ఆమేరకు కృష్ణస్వామి కమిటీ జిఎన్‌ఎస్‌ఎస్ సాధ్యం కాదని, ఎక్కడికక్కడ స్థానికంగా రిజర్వాయర్లు నిర్మించుకోవాలని నివేదిక అందించింది.
 
 అందులో భాగంగా పెన్నానదిలో ప్రవహించే వరద నీటితో 3 టీఎంసీల సామర్థ్యంతో గండికోట నిర్ణయించాలని నివేదించారు. అలాంటి తరుణంలో రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయింది. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు ఎంవి మైసూరారెడ్డి గండికోట నుంచి నగరి వరకూ పాదయాత్ర చేపట్టారు. ప్రజాసంఘాలతో కలుపుకుని 420 కిలోమీటర్లు 21 రోజలకు పైగా పాదయాత్ర చేపట్టారు. అందువల్లే జిఎన్‌ఎస్‌ఎస్ రద్దు యోచన చంద్రబాబు విరమించుకున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే తనవల్లే గండికోట సాధ్యమైందని చంద్రబాబు చెప్పుకోవడం అంటే బాకా ఊదుకోవడమే అవుతుంది.
 
 రాయలసీమ పట్ల కంటితుడుపు మాటలే....
 ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాయలసీమ పట్ల ప్రేమలేదని, కేవలం కంటితుడుపు మాటలేనని ఈమారు శ్రీశైలం ప్రాజెక్టు నీటి వాటాలను పరిశీలిస్తే అర్థం అవుతుంది. మొన్నటి వర్షాకాలంలో కృష్ణ, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కాయి. ఆ నదుల ద్వారా 2014 జూలై 30 నుంచే శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదనీరు చేరిక మొదలైంది. కృష్ణా జలాలు 182 టిఎంసీలు శ్రీశైలం లోకి వచ్చాయి. తుంగభద్ర నుంచి 302 టీఎంసీలు వచ్చిచేరాయి.
 
 అందులో కేవలం 82 టీఎంసీలు మాత్రమే ఎస్సార్బీసీ, తెలుగుగంగ, చెన్నై తాగునీటి అవసరాలతో పాటు రాయలసీమకు ఇచ్చినట్లు అధికారికవర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. 2008లోనే బ్రహ్మంసాగర్‌కు 12టిఎంసీలు నీరు చేరితే, పుష్కలంగా నీరున్నప్పుడు 1టిఎంసీ కూడా చేరలేదన్నది యధార్థం. రాయలసీమ ప్రాంతవాసే ముఖ్యమంత్రిగా ఉండి కూడా సాగు, తాగునీరు అందించడంలో తీవ్ర అన్యాయం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిధులు కేటాయించి, సత్వరమే పెండింగ్ పనులు పూర్తి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
 
 సాగునీటి సంకల్పంతో నిరవదిక దీక్ష...
 వెనుకబడ్డ ప్రాంతంలో సాగు, తాగునీటి ఆవశ్యకతను గుర్తించిన దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఆయన వారసత్వంతో వెలిసిన వైఎస్సార్‌సీపీ కంకణం కట్టుకుంది. అందులో భాగంగా రాజకీయపార్టీలను ప్రజా సంఘాలను కలుపుకుని అఖిలపక్షంగా ఏర్పడి ప్రాజెక్టుల సాధన కోసం ఉద్యమిస్తోంది. రెండురోజలుగా పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకూ క్షేత్రస్థాయిలో పర్యటన చేపట్టారు. అనంతరం సర్వరాయసాగర్‌ను సత్వరమే పూర్తి చేయాలని, కమలాపురం నియోజకవర్గానికి తాగునీరు, సాగునీరు అందించాలనే సంకల్పంతో ఆదివారం నుంచి వీరపునాయునిపల్లెలో కమలాపురం ఎమ్మెల్యే పి రవీంద్రనాథరెడ్డి నిరవదిక నిరహార దీక్ష చేపట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement