బాబుది తెలంగాణ యాత్రే | Chandra babu is going to delhi for telangana, criticises Shobha nagireddy | Sakshi
Sakshi News home page

బాబుది తెలంగాణ యాత్రే

Published Sun, Sep 15 2013 1:34 AM | Last Updated on Mon, Aug 20 2018 8:52 PM

బాబుది తెలంగాణ యాత్రే - Sakshi

బాబుది తెలంగాణ యాత్రే

  • వైఎస్సార్‌సీపీ నేత శోభానాగిరెడ్డి ధ్వజం 
  •   ఢిల్లీ యాత్ర దేనికోసమంటూ బాబుకు ప్రశ్న
  •   వైఎస్ జగన్ బెయిల్‌ను అడ్డుకునేందుకా?
  •   చితి మంటలపై చలి కాల్చుకుంటున్నారని ధ్వజం
  • సాక్షి, హైదరాబాద్: ‘తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర’ పేరిట గుంటూరు, కృష్ణా జిల్లాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవల చేసిన యాత్ర నిజానికి తెలంగాణ యాత్రే తప్ప సీమాంధ్ర అనుకూల యాత్ర కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత భూమా శోభానాగిరెడ్డి అన్నారు. టీడీపీకే చెందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ‘‘తెలంగాణపై టీడీపీ వైఖరిని బాబు చాలా ధైర్యంగా సీమాంధ్ర ప్రజలకు వివరించారని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికతో యరపతినేని అన్నారు. బాబు వివరణతో ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందారని చెప్పుకొచ్చారు.
     
     తెలంగాణకు అనుకూలంగా టీడీపీ నిర్ణయం తీసుకున్నా ఆత్మగౌరవ యాత్రలో ఎక్కడా ప్రజలు తమ పార్టీపై గానీ, బాబుపై గానీ ఎలాంటి వ్యతిరేకతా వ్యక్తం చేయలేదని, యాత్ర విజయవంతమయ్యిందనడానికి అదే నిదర్శనమని కూడా అన్నారు’’ అని ఆమె గుర్తు చేశారు. టీడీపీ అవకాశవాదానికి, ద్వంద్వ వైఖరికి ఈ వ్యాఖ్యలే నిలువెత్తు నిదర్శనమన్నారు. బాబు ధోరణి చితి మంటలపై చలి కాల్చుకున్న చందమంటూ మండిపడ్డారు. శోభా నాగిరెడ్డి శనివారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విభజనతో నష్టం జరుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నా కేంద్రానికిచ్చిన లేఖను వెనక్కు తీసుకుంటానని మాటవరసకైనా బాబు చెప్పగలిగారా అంటూ దుయ్యబట్టారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘మీకు జగన్‌పై అక్రోశముంటే ఎన్ని తిట్లు తిట్టినా భరిస్తాం. కానీ మాపై కోపాన్ని రాష్ట్రాన్ని విభజించే స్థాయికి తీసుకెళ్తామనడం సరికాదు. తెలంగాణకు అనుకూలంగా మీరిచ్చిన లేఖ ను ఇప్పటికైనా వెనక్కు తీసుకోండి’ అని బాబుకు హితవు పలికారు. బాబు తలపెట్టిన ఢిల్లీ యాత్ర దేనికోసమో రాష్ట్ర ప్రజలకు వివరించాలని శోభ డిమాండ్ చేశారు. ‘‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ను అడ్డుకోవడానికా? లేక తెలంగాణకు అనుకూలంగా టీడీపీ ఇచ్చిన లేఖ సరైనదేనని చెప్పుకోవడానికా?’’ అంటూ సూటిగా ప్రశ్నించారు ఆరు నెలలు అధికారమిస్తే పరిస్థితి చక్కదిద్దుతానంటూ చంద్రబాబు పదేపదే చేస్తున్న వ్యాఖ్యల మర్మమేమిటో చెప్పాలన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నందుకు, మిగిలి ఉన్న ఆరు నెలల అధికారాన్ని తనకు అప్పగించాలని సోనియాగాంధీని కోరడానికి ఢిల్లీ వెళ్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు.
     
     డీల్ కుదిరిందెవరికి?
     టీడీపీ నేతల మాటలు చూస్తే అసహ్యమేస్తోందని శోభ అన్నారు. బాబు ఓ వీధి స్థాయి నేతలా దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. జగన్ బెయిల్ డీల్ కుదర్చుకున్నారనడానికి సిగ్గుందా అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయితే 16 నెలలుగా ఆయన జైల్లో ఎందుకు ఉండాల్సి వస్తుందని ప్రశ్నించారు.
     
     మతిభ్రమించి మాట్లాడుతున్నారా!
     సెప్టెంబర్ 9లోగా సీబీఐ తుది చార్జిషీట్ వేయాలని, ఆ తర్వాత జగన్ బెయిల్‌కు అపీల్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా బెయిల్ పిటిషన్ వేస్తే దానిపైనా టీడీపీ నేతలు, బాబు ప్రేలాపనలు చేస్తున్నారని శోభ తూర్పారబట్టారు. జగన్ బయటికొస్తే తన ఉనికే ప్రశ్నార్థకమవుతుందనే భయంతోనే బాబు ఇలా పిచ్చికూతలు కూస్తున్నారని దుయ్యబట్టారు. ‘జగన్ బెయిల్ డీల్’ అంటూ సుప్రీంకోర్టునే తప్పుబట్టేలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. జగన్ జైలు నుంచి ఎప్పటికీ బయటకు రాకూడదని, ఆయన్ను లోపలుంచి తామిలాగే కుట్ర రాజకీయాలు కొనసాగిస్తామనే తరహాలో టీడీపీ నేతలు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. కిరణ్‌కు, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు ముందే చెప్పే కాంగ్రెస్ అధిష్టానం విభజన నిర్ణయం తీసుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆటలో భాగంగానే వారిద్దరూ నటిస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement