Atma Gaurava yatra
-
బాబుది తెలంగాణ యాత్రే
వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి ధ్వజం ఢిల్లీ యాత్ర దేనికోసమంటూ బాబుకు ప్రశ్న వైఎస్ జగన్ బెయిల్‌ను అడ్డుకునేందుకా? చితి మంటలపై చలి కాల్చుకుంటున్నారని ధ్వజం సాక్షి, హైదరాబాద్: ‘తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర’ పేరిట గుంటూరు, కృష్ణా జిల్లాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవల చేసిన యాత్ర నిజానికి తెలంగాణ యాత్రే తప్ప సీమాంధ్ర అనుకూల యాత్ర కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత భూమా శోభానాగిరెడ్డి అన్నారు. టీడీపీకే చెందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ‘‘తెలంగాణపై టీడీపీ వైఖరిని బాబు చాలా ధైర్యంగా సీమాంధ్ర ప్రజలకు వివరించారని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికతో యరపతినేని అన్నారు. బాబు వివరణతో ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందారని చెప్పుకొచ్చారు. తెలంగాణకు అనుకూలంగా టీడీపీ నిర్ణయం తీసుకున్నా ఆత్మగౌరవ యాత్రలో ఎక్కడా ప్రజలు తమ పార్టీపై గానీ, బాబుపై గానీ ఎలాంటి వ్యతిరేకతా వ్యక్తం చేయలేదని, యాత్ర విజయవంతమయ్యిందనడానికి అదే నిదర్శనమని కూడా అన్నారు’’ అని ఆమె గుర్తు చేశారు. టీడీపీ అవకాశవాదానికి, ద్వంద్వ వైఖరికి ఈ వ్యాఖ్యలే నిలువెత్తు నిదర్శనమన్నారు. బాబు ధోరణి చితి మంటలపై చలి కాల్చుకున్న చందమంటూ మండిపడ్డారు. శోభా నాగిరెడ్డి శనివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విభజనతో నష్టం జరుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నా కేంద్రానికిచ్చిన లేఖను వెనక్కు తీసుకుంటానని మాటవరసకైనా బాబు చెప్పగలిగారా అంటూ దుయ్యబట్టారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘మీకు జగన్‌పై అక్రోశముంటే ఎన్ని తిట్లు తిట్టినా భరిస్తాం. కానీ మాపై కోపాన్ని రాష్ట్రాన్ని విభజించే స్థాయికి తీసుకెళ్తామనడం సరికాదు. తెలంగాణకు అనుకూలంగా మీరిచ్చిన లేఖ ను ఇప్పటికైనా వెనక్కు తీసుకోండి’ అని బాబుకు హితవు పలికారు. బాబు తలపెట్టిన ఢిల్లీ యాత్ర దేనికోసమో రాష్ట్ర ప్రజలకు వివరించాలని శోభ డిమాండ్ చేశారు. ‘‘వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్‌ను అడ్డుకోవడానికా? లేక తెలంగాణకు అనుకూలంగా టీడీపీ ఇచ్చిన లేఖ సరైనదేనని చెప్పుకోవడానికా?’’ అంటూ సూటిగా ప్రశ్నించారు ఆరు నెలలు అధికారమిస్తే పరిస్థితి చక్కదిద్దుతానంటూ చంద్రబాబు పదేపదే చేస్తున్న వ్యాఖ్యల మర్మమేమిటో చెప్పాలన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నందుకు, మిగిలి ఉన్న ఆరు నెలల అధికారాన్ని తనకు అప్పగించాలని సోనియాగాంధీని కోరడానికి ఢిల్లీ వెళ్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు. డీల్ కుదిరిందెవరికి? టీడీపీ నేతల మాటలు చూస్తే అసహ్యమేస్తోందని శోభ అన్నారు. బాబు ఓ వీధి స్థాయి నేతలా దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. జగన్ బెయిల్ డీల్ కుదర్చుకున్నారనడానికి సిగ్గుందా అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయితే 16 నెలలుగా ఆయన జైల్లో ఎందుకు ఉండాల్సి వస్తుందని ప్రశ్నించారు. మతిభ్రమించి మాట్లాడుతున్నారా! సెప్టెంబర్ 9లోగా సీబీఐ తుది చార్జిషీట్ వేయాలని, ఆ తర్వాత జగన్ బెయిల్‌కు అపీల్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా బెయిల్ పిటిషన్ వేస్తే దానిపైనా టీడీపీ నేతలు, బాబు ప్రేలాపనలు చేస్తున్నారని శోభ తూర్పారబట్టారు. జగన్ బయటికొస్తే తన ఉనికే ప్రశ్నార్థకమవుతుందనే భయంతోనే బాబు ఇలా పిచ్చికూతలు కూస్తున్నారని దుయ్యబట్టారు. ‘జగన్ బెయిల్ డీల్’ అంటూ సుప్రీంకోర్టునే తప్పుబట్టేలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. జగన్ జైలు నుంచి ఎప్పటికీ బయటకు రాకూడదని, ఆయన్ను లోపలుంచి తామిలాగే కుట్ర రాజకీయాలు కొనసాగిస్తామనే తరహాలో టీడీపీ నేతలు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. కిరణ్‌కు, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు ముందే చెప్పే కాంగ్రెస్ అధిష్టానం విభజన నిర్ణయం తీసుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆటలో భాగంగానే వారిద్దరూ నటిస్తున్నారన్నారు. -
రేపే తొలివిడత ఆత్మగౌవర యాత్ర ముగింపు
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మొదలు పెట్టిన ఆత్మగౌరవ యాత్ర తొలివిడత రేపటితో ముగియనుంది. 11 రోజుల నుంచి చంద్రబాబు 9 శాసనసభ నియోజకవర్గాలలో పర్యటించారు. రాష్ట్ర విభజనపై ఒక స్పష్టమైన వైఖరి వ్యక్తం చేయకపోవడంతో అడుగడుగునా ఆయనకు వ్యతిరేక వ్యక్తమయింది. గత రాత్రి చంద్రబాబు బసచేసిన కృష్ణా జిల్లా కంభంపాడు వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజనపై వైఖరేంటో స్పష్టంచేయాలన్న గ్రామస్థులు ఆయనను నిలదీశారు. గ్రామస్థులపై చంద్రబాబు మండిపడ్డారు. రౌడీలు, గూండాలంటూ దుర్భాషలాడారు. తోకలు కత్తిరిస్తానంటూ బెదిరించారు. చంద్రబాబును నిలదీసిన గ్రామస్థులపై స్థానిక టీడీపీనేత ఒకరు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. చంద్రబాబు ఆదేశాలతోనే కేసు పెట్టారని బాధితులు ఆరోపించారు. -
చంద్రబాబు వాహనంలో పొగలు
విజయవాడ: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న వాహనంలో నుంచి పొగలు వచ్చాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగలు వచ్చాయని టిడిపి నేతలు తెలిపారు. చంద్రబాబు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. తెలుగు జాతి ఆత్మగౌరవయాత్రలో భాగంగా ఆయన కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా గన్నవరం, ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో పర్యటించారు. -
ఎన్డీయే హయాంలో అడ్డుకున్నా... ఇప్పుడు విభజనకు అంగీకరించా: చంద్రబాబు నాయుడు
వైఎస్ఆర్ చనిపోయాక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిందని వ్యాఖ్య సాక్షి, గుంటూరు : తాను రెండు ప్రాంతాల ప్రజల అభిప్రాయాల మేరకే నడుచుకుంటానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఇరుప్రాంతాల ఉద్యమ జేఏసీలను పిలిపించి మాట్లాడితే సమస్యలు పరిష్కారమౌతాయని సూచించారు. టీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదని, వసూళ్ల పార్టీ అని ఆరోపించారు. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామంటే రాష్ట్రాన్ని విడదీస్తారా? అని ప్రశ్నించారు. తెలుగుజాతి అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిన యూపీఏ అధినేత్రి సోనియాగాంధీకి, ఆమె కొడుకు రాహుల్‌కు పుట్టగతులుండవని శాపనార్థాలు పెట్టారు. ఎన్డీయే హయాంలో రాష్ట్ర విభజనను అడ్డుకున్నాన ని.. అయితే 2009లో ప్రణబ్ కమిటీ ముందు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం మార్చుకున్నట్లు అంగీకరించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రారంభమైన చంద్రబాబు ‘ఆత్మగౌరవ యాత్ర’ మంగళగిరి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల మీదుగా ప్రకాశం బ్యారేజీ దాటి కృష్ణాజిల్లా విజయవాడలోకి ప్రవేశించింది. శుక్రవారం కూడా చంద్రబాబుకు సమైక్యవాదుల నిరసనలు ఎదురయ్యాయి. నిడమర్రు, నీరుకొండ శిబిరం, మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో ఏపీఎన్జీవో సమైక్య జేఏసీ నేతలు బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని ఆయన యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అంతకుముందు ఉదయం కంతేరు బస వద్దకు వచ్చిన సమైక్యాంధ్ర జేఏసీ గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ నరసింహారావు, అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎన్.శామ్యూల్, ఏఎన్‌యూ విద్యార్థి జేఏసీ నేత కిషోర్, విద్యుత్ జేఏసీ కన్వీనర్ రవిశేఖర్ తదితరులు బాబును కలిశారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు పోరాడాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు మాత్రం తాను రెండుప్రాంతాల ప్రజల అభిప్రాయాల మేరకే నడుచుకుంటానని స్పష్టంచేశారు. యాత్ర సందర్భంగా చేసిన ప్రసంగాల్లో కూడా ఎక్కడా సమైక్యమనే పదం నోటినుంచి రాకుండా జాగ్రత్త పడుతూ పరనింద, ఆత్మస్తుతితోనే ముందుకుసాగారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అబద్ధాల పుట్ట అని విమర్శించారు. ఆయన బెదిరింపులతో రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ.. దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘తెలంగాణలో ఒకరు సీమాంధ్ర ప్రజల్ని నాలుక చీరేస్తామంటున్నారు.. మరొకరు తాము కడుపులో పెట్టి చూసుకుంటామంటున్నారు. ఒక పెద్దమనిషి తిరుమల కొండకు వచ్చి కూడా బెదిరింపులకు దిగారు..’ అని అన్నారు. చట్టమే ప్రజల్ని రక్షిస్తుందని, అమెరికాలో జీవిస్తున్న తెలుగువారికి రక్షణగా ఎవరున్నారో ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోందని చెప్పారు. వైఎస్ఆర్ చనిపోయాక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారిందన్నారు. ఇక్కడ ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే, ఢిల్లీ పెద్దలు గాడిదల్లాగా చిత్రం చూస్తున్నారని ధ్వజమెత్తారు. సోనియా ఆదేశాలతోనే బొగ్గు కుంభకోణం ఫైళ్లను కాల్చేసి ఉంటారని చంద్రబాబు అనుమానం వ్యక్తంచేశారు. ప్రపంచ దేశాల్లోనే అగ్రదేశంగా భారతదేశం నిలవడంలో టీడీపీ పాత్ర ఎక్కువని చె ప్పుకొచ్చారు. నిర్భయ కేసులో ముద్దాయికి కేవలం మూడేళ్లు మాత్రమే జైలు శిక్ష వేశారని, తాను అధికారంలో ఉంటే ఐదారుగురికి మరణశిక్ష పడేట్లు చేసేవాడిన ని వ్యాఖ్యానించారు. -
'బాబు యాత్రపై ఆయనకే స్పష్టత లేదు'
-
'బాబు యాత్రపై ఆయనకే స్పష్టత లేదు'
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన ఆత్మగౌరవ యాత్రపై ఆయనకే స్పష్టత లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రు విమర్శించారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ బాబు వైఖరితో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని మండిపడ్డారు. అధికార దాహం తప్ప.... ప్రజల సమస్యలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని జ్యోతుల నెహ్రు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ సూర్ఫితోనే సమైక్యవాదం వినిపిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ విభజన నిర్ణయంతో సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. ‘తెలుగు ఆత్మగౌరవ యాత్ర’ అంటూ ఆదివారం గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి చంద్రబాబు బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. -
బాబూ! రాజీనామాలు చేసి ముందుకు రండి: కొణతాల
-
బాబూ! రాజీనామాలు చేసి ముందుకు రండి: కొణతాల
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందినవారు రాజీనామాలు చేసి ముందుకు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ పిలుపు ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మగౌరవ యాత్రలో చంద్రబాబు సమస్యకు పరిష్కార మార్గం చూసిస్తారని అందరూ ఎదురు చూస్తుంటే ఆయన దివంగ మహానేత డాక్టర్ వైఎస్‌ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారన్నారు. ఊకదంపుడు ఉపన్యాసం చేసినట్లు తెలిపారు. ఓట్ల రాజకీయాలు చేస్తున్నరని విమర్శించారు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నేతగా రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించాలని చంద్రబాబుకు సలహా ఇచ్చారు. ఓట్లు, సీట్లు కోసం రాష్ట్ర విభజనపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఏ ప్రాంతానికి కూడా న్యాయం చేసే ఆలోచన వారికి లేదని పేర్కొన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పట్టించుకోలేదన్నారు. అందరితో సంప్రదించి, అన్ని ప్రాంతాల అభిప్రాయాలు తెలుసుకొని ఏకాభిప్రాయంతో రాష్ట్రాన్ని విభజించాలన్నారు. ప్రజల సమస్యలను వదిలిపెట్టి రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించడం మంచిదికాదన్నారు. సమస్యలను పరిష్కరించలేనప్పుడు, రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచమని తాము ముందు నుంచి చెబుతున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచవలసిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో సమస్యలు కూడా తమకు ముఖ్యమే అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవించినట్టే సీమాంధ్ర సెంటిమెంట్‌ను కూడా గౌరవిస్తున్నట్లు కొణతాల రామకృష్ణ తెలిపారు. -
చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర వాయిదా
-
చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర వాయిదా
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తలపెట్టిన ఆత్మగౌరవ బస్సు యాత్ర వాయిదా పడింది. సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా జనం తిరగబడతారన్న పార్టీ నేతల హెచ్చరికలతో ఆయన యాత్రపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. విజయనగరం జిల్లా కొత్తవలస నుంచి ఈనెల 25న ఉదయం నుంచి చంద్రబాబు ‘తెలుగు ఆత్మగౌరవ యాత్ర ’ పేరుతో బస్సు యాత్రను చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. యాత్ర ఏర్పాట్లపై గురువారం ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించటమే కాకుండా భారీగా జనసమీకరణ జరపాలని సూచించారు. అయితే చంద్రబాబు బస్సు యాత్రను సీమాంధ్రకు చెందిన మెజారిటీ నేతలు వ్యతిరేకిస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన వెంటనే కొత్త రాజధాని ఖర్చు గురించి మాట్లాడిన చంద్రబాబు సీమాంధ్రలో దేని కోసం యాత్ర చేపడుతున్నారని ప్రజలు నిలదీయడం తథ్యమని నేతలు తెలిపారు. చంద్రబాబు బస్సు యాత్రలో ప్రజల ఆగ్రహావేశాలకు గురి కావలసివస్తుందన్న అభిప్రాయాన్ని కొందరు నేతలు వ్యక్తం చేశారు.