
బాబూ! రాజీనామాలు చేసి ముందుకు రండి: కొణతాల
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందినవారు రాజీనామాలు చేసి ముందుకు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ పిలుపు ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మగౌరవ యాత్రలో చంద్రబాబు సమస్యకు పరిష్కార మార్గం చూసిస్తారని అందరూ ఎదురు చూస్తుంటే ఆయన దివంగ మహానేత డాక్టర్ వైఎస్ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారన్నారు. ఊకదంపుడు ఉపన్యాసం చేసినట్లు తెలిపారు. ఓట్ల రాజకీయాలు చేస్తున్నరని విమర్శించారు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నేతగా రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించాలని చంద్రబాబుకు సలహా ఇచ్చారు.
ఓట్లు, సీట్లు కోసం రాష్ట్ర విభజనపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఏ ప్రాంతానికి కూడా న్యాయం చేసే ఆలోచన వారికి లేదని పేర్కొన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పట్టించుకోలేదన్నారు. అందరితో సంప్రదించి, అన్ని ప్రాంతాల అభిప్రాయాలు తెలుసుకొని ఏకాభిప్రాయంతో రాష్ట్రాన్ని విభజించాలన్నారు. ప్రజల సమస్యలను వదిలిపెట్టి రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించడం మంచిదికాదన్నారు. సమస్యలను పరిష్కరించలేనప్పుడు, రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచమని తాము ముందు నుంచి చెబుతున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచవలసిన అవసరం ఉందన్నారు.
తెలంగాణలో సమస్యలు కూడా తమకు ముఖ్యమే అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవించినట్టే సీమాంధ్ర సెంటిమెంట్‌ను కూడా గౌరవిస్తున్నట్లు కొణతాల రామకృష్ణ తెలిపారు.