ఎన్డీయే హయాంలో అడ్డుకున్నా... ఇప్పుడు విభజనకు అంగీకరించా: చంద్రబాబు నాయుడు
వైఎస్‌ఆర్ చనిపోయాక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిందని వ్యాఖ్య
సాక్షి, గుంటూరు : తాను రెండు ప్రాంతాల ప్రజల అభిప్రాయాల మేరకే నడుచుకుంటానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఇరుప్రాంతాల ఉద్యమ జేఏసీలను పిలిపించి మాట్లాడితే సమస్యలు పరిష్కారమౌతాయని సూచించారు. టీఆర్‌ఎస్ రాజకీయ పార్టీ కాదని, వసూళ్ల పార్టీ అని ఆరోపించారు. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామంటే రాష్ట్రాన్ని విడదీస్తారా? అని ప్రశ్నించారు. తెలుగుజాతి అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిన యూపీఏ అధినేత్రి సోనియాగాంధీకి, ఆమె కొడుకు రాహుల్‌కు పుట్టగతులుండవని శాపనార్థాలు పెట్టారు. ఎన్డీయే హయాంలో రాష్ట్ర విభజనను అడ్డుకున్నాన ని.. అయితే 2009లో ప్రణబ్ కమిటీ ముందు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం మార్చుకున్నట్లు అంగీకరించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రారంభమైన చంద్రబాబు ‘ఆత్మగౌరవ యాత్ర’ మంగళగిరి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల మీదుగా ప్రకాశం బ్యారేజీ దాటి కృష్ణాజిల్లా విజయవాడలోకి ప్రవేశించింది.
శుక్రవారం కూడా చంద్రబాబుకు సమైక్యవాదుల నిరసనలు ఎదురయ్యాయి. నిడమర్రు, నీరుకొండ శిబిరం, మంగళగిరి అంబేద్కర్ సెంటర్‌లో ఏపీఎన్‌జీవో సమైక్య జేఏసీ నేతలు బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని ఆయన యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అంతకుముందు ఉదయం కంతేరు బస వద్దకు వచ్చిన సమైక్యాంధ్ర జేఏసీ గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ నరసింహారావు, అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎన్.శామ్యూల్, ఏఎన్‌యూ విద్యార్థి జేఏసీ నేత కిషోర్, విద్యుత్ జేఏసీ కన్వీనర్ రవిశేఖర్ తదితరులు బాబును కలిశారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు పోరాడాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు మాత్రం తాను రెండుప్రాంతాల ప్రజల అభిప్రాయాల మేరకే నడుచుకుంటానని స్పష్టంచేశారు. యాత్ర సందర్భంగా చేసిన ప్రసంగాల్లో కూడా ఎక్కడా సమైక్యమనే పదం నోటినుంచి రాకుండా జాగ్రత్త పడుతూ పరనింద, ఆత్మస్తుతితోనే ముందుకుసాగారు.
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అబద్ధాల పుట్ట అని విమర్శించారు. ఆయన బెదిరింపులతో రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ.. దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘తెలంగాణలో ఒకరు సీమాంధ్ర ప్రజల్ని నాలుక చీరేస్తామంటున్నారు.. మరొకరు తాము కడుపులో పెట్టి చూసుకుంటామంటున్నారు. ఒక పెద్దమనిషి తిరుమల కొండకు వచ్చి కూడా బెదిరింపులకు దిగారు..’ అని అన్నారు. చట్టమే ప్రజల్ని రక్షిస్తుందని, అమెరికాలో జీవిస్తున్న తెలుగువారికి రక్షణగా ఎవరున్నారో ప్రజలు తెలుసుకోవాలని సూచించారు.
కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోందని చెప్పారు. వైఎస్‌ఆర్ చనిపోయాక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారిందన్నారు. ఇక్కడ ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే, ఢిల్లీ పెద్దలు గాడిదల్లాగా చిత్రం చూస్తున్నారని ధ్వజమెత్తారు. సోనియా ఆదేశాలతోనే బొగ్గు కుంభకోణం ఫైళ్లను కాల్చేసి ఉంటారని చంద్రబాబు అనుమానం వ్యక్తంచేశారు. ప్రపంచ దేశాల్లోనే అగ్రదేశంగా భారతదేశం నిలవడంలో టీడీపీ పాత్ర ఎక్కువని చె ప్పుకొచ్చారు. నిర్భయ కేసులో ముద్దాయికి కేవలం మూడేళ్లు మాత్రమే జైలు శిక్ష వేశారని, తాను అధికారంలో ఉంటే ఐదారుగురికి మరణశిక్ష పడేట్లు చేసేవాడిన ని వ్యాఖ్యానించారు.