
చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర వాయిదా
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తలపెట్టిన ఆత్మగౌరవ బస్సు యాత్ర వాయిదా పడింది. సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా జనం తిరగబడతారన్న పార్టీ నేతల హెచ్చరికలతో ఆయన యాత్రపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. విజయనగరం జిల్లా కొత్తవలస నుంచి ఈనెల 25న ఉదయం నుంచి చంద్రబాబు ‘తెలుగు ఆత్మగౌరవ యాత్ర ’ పేరుతో బస్సు యాత్రను చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. యాత్ర ఏర్పాట్లపై గురువారం ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించటమే కాకుండా భారీగా జనసమీకరణ జరపాలని సూచించారు.
అయితే చంద్రబాబు బస్సు యాత్రను సీమాంధ్రకు చెందిన మెజారిటీ నేతలు వ్యతిరేకిస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన వెంటనే కొత్త రాజధాని ఖర్చు గురించి మాట్లాడిన చంద్రబాబు సీమాంధ్రలో దేని కోసం యాత్ర చేపడుతున్నారని ప్రజలు నిలదీయడం తథ్యమని నేతలు తెలిపారు. చంద్రబాబు బస్సు యాత్రలో ప్రజల ఆగ్రహావేశాలకు గురి కావలసివస్తుందన్న అభిప్రాయాన్ని కొందరు నేతలు వ్యక్తం చేశారు.