పీఆర్సీ సాధ్యం కాదు: బాబు
సాక్షి, హైదరాబాద్: అనుమానమే నిజమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఉద్యోగులకు వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) సిఫాసరసుల అమలు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన పంథాలోనే స్పందించారు. జీతాలకే డబ్బుల్లేవంటూ పాత బీద పాటే మళ్లీ పాడారు. పీఆర్‌సీ అమలులో జరుగుతున్న జాప్యం, నిరుపయోగంగా ఉన్న హెల్త్ కార్డులు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ప్రతినిధి బృందం మంగళవారం ముఖ్యమంత్రితో సమావేశమైంది.
జేఏసీ నాయకత్వం మెతక వైఖరి వల్లే పీఆర్‌సీ అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఉద్యోగుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. నేరుగా సీఎంనే కలసి సాధించుకోవాలనే ఉద్దేశంతో జేఏసీ బృందం సీఎంతో భేటీ అయింది. అయితే.. రోజువారీ ఖర్చులకే కటకటగా ఉందందని, జీతాలు చెల్లించడానికే డబ్బుల్లేని పరిస్థితుల్లో పీఆర్సీ అమలు సాధ్యం కాదని సీఎం తెగేసి చెప్పడంతో ఉద్యోగ సంఘాల నేతలు నిర్ఘాంతపోయారు.
గతంలో 9 పీఆర్‌సీలు అమలు చేసినప్పుడు ఏ సీఎం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని, వెంటనే పీఆర్‌సీ అమలు చేస్తామని చెప్పలేదని చంద్రబాబుకు గుర్తుచేశారు. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటే ఉద్యోగులకు ఎక్కువ జీతాలు చెల్లిస్తారా? అని ప్రశ్నించారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటై రెండు నెలలు దాటినా ఇప్పటికీ ఉద్యోగులతో చర్చించలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ‘మీతో మాట్లాడాలమని ఉపసంఘానికి చెబుతా’ అని సీఎం హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలు ఇంకా పీఆర్‌సీ గురించే అడుగుతుంటే.. ‘ఉపసంఘం నివేదిక వచ్చిన తర్వాత అమలు సంగతి చూస్తా’ అని సీఎం సమాధానం ఇచ్చి.. పీఆర్‌సీ మీద చర్చను ముగించారు.
హెల్త్‌కార్డుల పథకంలో లోపాలు సవరించకుంటే, మార్చి నుంచి ప్రీమియం చెల్లించబోమని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. గత రెండు నెలల్లో ఉద్యోగులు రూ. 12 కోట్ల ప్రీమియం చెల్లించిన విషయాన్ని గుర్తుచేశాయి. లోపాలను వారంలోగా సవరించి తాజా ఉత్తర్వులు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. జేఏసీ ప్రతినిధి బృందంలో చైర్మన్ అశోక్‌బాబు, సెక్రటరీ జనరల్ ఐ.వెంకటేశ్వరావు, కోచైర్మన్లు కత్తి నరసింహారెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, నేతలు చంద్రశేఖరరెడ్డి, కమలాకరరావు, రఘురామిరెడ్డి, రవికుమార్, భాస్కర్, కుళ్లాయప్ప తదితరులు ఉన్నారు. అధికారులు సాయిప్రసాద్, లవ్ అగర్వాల్, ధనుంజయరెడ్డి తదితరులు భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీలో సీఎం ఏమన్నారంటే.. హా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు సాధ్యం కాదు. కొన్ని సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. లాభాలు సంపాదించుకొని ఉద్యోగుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచుకున్నా అభ్యంతరం లేదు.
హా ఉద్యోగులు కొత్త రాజధానికి పోవాల్సిందే. ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో లేదనే భావన నాలో ఉంది. హైదరాబాద్‌లో ఉండి పాలించినా, అమెరికాలో కూర్చొని పాలించినా.. తేడా ఏమీ లేదు. క్రమంగా పాలన మొత్తం కొత్త రాజధానికి మారాల్సిందే. (‘కొత్త రాజధాని ప్రాంతంలో ఇంటి అద్దెలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ చెల్లించడానికి సిద్ధపడ్డా.. ఇళ్లు దొరికే పరిస్థితి లేదు. పిల్లల చదువులకు ఇబ్బంది వస్తుంది. మౌలిక వసతుల్లేవు. అన్నీ కల్పించిన తర్వాత వెళ్లడానికి మేం సిద్ధం. అత్యవసరంగా తరలించాల్సిన విభాగాలకే తొలుత ప్రాధాన్యత ఇవ్వాలి’ అని ఉద్యోగులన్నారు.) అక్కడ అన్ని వసతులు కల్పిస్తాం. ఏ శాఖలను మొదట తరలించాలనే విషయాన్ని నిర్ణయించడానికి సీఎస్ ఆధ్వర్యంలో భేటీ పెడతాం.
హా కారుణ్య నియామకాలకు కనీస విద్యార్హత డిగ్రీ ఉండాల ంటూ ఇచ్చిన జీవోను సవరిస్తాం. జీవో ఇచ్చిన తేదీ వరకు పెండింగ్‌లో ఉన్న కేసుల్లో కనీస విద్యార్హతను ఇంటర్‌గా పరిగణించి ఉద్యోగాలిస్తాం. 80 రోజుల సమైక్య సమ్మె కాలాన్ని క్రమబద్ధీకరించడానికి ఉత్తర్వులు ఇస్తాం. విజయవాడ, విశాఖ కార్పొరేషన్లలో 010 పద్దు నుంచి జీతాలు తీసుకోని సిబ్బందికీ పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచుతాం.
కఠిన వైఖరే: సీఎంతో భేటీకి ముందు ఏపీఎన్జీవో కార్యాలయంలో జరిగిన జేఏసీ కార్యవర్గ భేటీలో పీఆర్‌సీ అమలుపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ఉద్యోగులు నిర్ణయించారు. పీఆర్‌సీ అమలుపై నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి 15 రోజుల గడువు ఇవ్వాలని తీర్మానం చేశారు. మంత్రివర్గ ఉపసంఘంతో ప్రయోజనం ఉండదని, సీఎంకే విన్నవించాలని నిర్ణయం తీసుకున్నారు.
సీఎంతో ఉద్యోగుల జేఏసీ ఏమంది?
పీఆర్‌సీ అమలులో విపరీతమైన జాప్యం జరుగుతోంది
గతంలో 9 పీఆర్‌సీలు అమలు చేసినప్పుడు ఏ సీఎం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని, అమలు చేస్తామని చెప్పలేదు
ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటే ఎక్కువ జీతాలు ఇస్తారా?
ఉపసంఘం ఏర్పాటై 2 నెలలైనా ఉద్యోగులతో చర్చించలేదు
‘హెల్త్ కార్డు’ సవరించకుంటే మార్చి నుంచి ప్రీమియం చెల్లించం
‘కొత్త రాజధాని’లో వసతులన్నీ కల్పించాక వెళ్లేందుకు మేం సిద్ధం
జేఏసీతో చంద్రబాబు ఏమన్నారు?
జీతాలకే డబ్బుల్లేని పరిస్థితి.. పీఆర్‌సీ అమలు సాధ్యం కాదు
ఉద్యోగ సంఘాల జేఏసీతో చర్చించాలని ఉపసంఘానికి చెప్తా
హెల్త్ కార్డుల పథకంలో లోపాలను వారంలో సవరిస్తాం
80 రోజుల సమైక్య సమ్మె కాలం క్రమబద్ధీకరణకు చర్యలు
పీఎస్‌యూల సిబ్బంది పదవీ విరమణ వయసు పెంచలేం
ఉద్యోగులు కొత్త రాజధానికి వెళ్లాల్సిందే.. వసతులు కల్పిస్తాం
నివేదిక వచ్చాక ‘కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పరిశీలిస్తా
పొరుగు రాష్ట్రం సీఎంనా అనిపించింది
ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల సందర్భంగా సీఎం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన ట్లు సమాచారం. ‘‘హైదరాబాద్‌లో ఉండి పరిపాలన చేస్తుంటే ఇతర దేశాల్లో ఉండి పరిపాలన చేసినట్లుంది. సోమవారం విజయవాడకు వెళితే ఏపీ సీఎంకు స్వాగతం అని బ్యానర్లు దర్శనమిచ్చాయి. సొంత రాష్ట్రానికి సీఎం హోదాలో నేను వెళితే పొరుగు రాష్ట్రం సీఎం వచ్చిన పుడు స్వాగతం పలుకుతూ బ్యానర్లు ఏర్పాటు చేశారన్న భావన కలిగింది. ఏపీలో త్వరలో చిన్న అసెంబ్లీని కట్టుకొని శాసనసభ నిర్వహించుకుందాం’’ అని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.