జూబ్లీ హిల్స్ లో ఇంటి విలువ రూ.23.2 లక్షలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాల్గో ఏడాది కూడా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే తన బ్యాంక్ బ్యాలెన్స్ కొద్దిగా పెరిగిందని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. తన ఆస్తులు రూ70.69 లక్షలు ఉండగా, భార్య భువనేశ్వరి ఆస్తులు రూ.46 కోట్ల 88 లక్షలు ఉన్నట్లు ప్రకటించారు. అయితే భువనేశ్వరి పేరిట ఉన్న పీఎఫ్ తో పాటు బంగారం కూడా పెరిగిందని స్పష్టం చేశారు. తనకు జూబ్లీహిల్స్ లో ఉన్న ఇంటి విలువ రూ.23.2 లక్షలు మాత్రమేనని చంద్రబాబు పేర్కొన్నారు. తనకున్న అంబాసిడర్ కారు విలువ లక్షా యాభై రెండు వేలని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా లోకేష్ ఆస్తులు యథావిధిగా రూ.11కోట్ల నాలుగు లక్షలు మాత్రమేనని, కోడలు బ్రహ్మిణి ఆస్తులు రూ.5 కోట్ల రెండు లక్షలున్నాయన్నారు. తాజాగా తమ ఖాతాలో ఒక వాహనం పెరిగిందన్నారు. ఈ ఆస్తుల వివరాలను ఎథిక్స్ కమిటీకి సమర్పిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.