రుణమాఫీ కమిటీపై చంద్రబాబు తొలిసంతకం
గుంటూరు: నూతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు రుణమాఫీ కమిటీపై తొలి సంతకం చేశారు. ఈ రోజు గుంటూరు-విజయవాడ మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న 70 ఎకరాల విశాల ప్రదేశంలో ఏర్పాటు చేసిన వేదికపై ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ఐదు సంతకాలు చేశారు. దీనిలో భాగంగానే రైతుల రుణమాఫీకి సంబంధించి కమిటీ ఏర్పాటుపై ప్రధమ సంతకం చేశారు. ఈ కమిటీ ఏర్పాటుకు 10, 15 రోజల్లో శ్రీకారం చుడతామన్నారు. ఇదిలా ఉండగా వృద్ధులకు, వితంతువులు, వికలాంగులకు రూ.1,000 పింఛన్ పెంచుతూ రెండో సంతకం చేశారు. ఈ పింఛన్ పథకం అక్టోబర్ 2 వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. అన్ని గ్రామాల్లో 20 లీటర్ల మినరల్ వాటర్ ను రూ.2 అందించడంపై మూడో సంతకం చేశారు. బెల్టు షాపుల రద్దుపై నాల్గో సంతకం చేయగా, ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 60 కు పెంచుతూ ఐదో సంతకం చేశారు.
తరువాత తెలుగుజాతిని ఉద్దేశిస్తూ ప్రసంగించిన చంద్రబాబు.. పార్టీ గెలుపుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ-టీడీపీల పొత్తుకు సహకరించిన ప్రకాశ్ జవదేకర్ కు, ఐకే గుజ్రాల్ కుమారుడు నరేష్ గుజ్రాల్ కి, గోయల్ కు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరో ప్రముఖ తెలుగు నటుడు బాలకృష్ణకు, ఈ సభకు విచ్చేసిన బాలీవుడ్ నటుడు వివేక ఒబరాయ్ లకు కూడా బాబు ధన్యవాదాలు తెలిపారు. 'మీ అందర్నీ చూస్తుంటే కొండంత ధైర్యం వచ్చింది.అందరం కలిసి కట్టుగా కసిగా చేద్దాం. పది సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న తనకు ప్రపంచంలోని తెలుగు వారందరూ సహకరించారన్నారని' బాబు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఒక కూలీగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.