
చంద్రబాబు.. కేఈ.. డిష్యుం డిష్యుం!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వైఖరి ఇలాగే ఉంటుందని, తాను ఎందుకు పశ్చిమగోదావరి జిల్లా గురించి మాట్లాడుతున్నానో పార్టీ నాయకులు తెలుసుకోవాలని ఆయన అన్నారు. తమ నాయకులు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారని సీఎం చెప్పారు. హైదరాబాద్లోని లేక్వ్యూ గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ ఆయనిలా అన్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన నాయకులు కూడా మంచి పనులు చేయాలని, అప్పుడే సరైన మాండేట్ వస్తుందని తాను పశ్చిమగోదావరి జిల్లాను పదేపదే ప్రస్తావిస్తున్నానని ఆయన చెప్పారు. నాయకులంతా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. పశ్చిమగోదావరి జిల్లానే ముఖ్యమంత్రి పదేపదే ప్రస్తావిస్తున్నారని, ఆయనకు ఆ జిల్లాపైనే అభిమానం ఎక్కువంటూ కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గతంలో ఉద్యోగుల బదిలీ విషయంలో మరో మంత్రి నారాయణ జోక్యం చేసుకున్నప్పుడు, మరికొన్ని ఇతర సందర్భాలలో అసంతృప్తికి గురైన కేఈ కృష్ణమూర్తి.. రాష్ట్ర రాజధాని ఎంపిక విషయంలో కూడా బాహాటంగా తన అసమ్మతిని వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి పశ్చిమగోదావరి జిల్లాను ప్రస్తావిస్తూ చంద్రబాబుపై విమర్శలు చేయడంతో సీఎం నేరుగానే ఆయన వ్యాఖ్యలను ఖండించారు.