ఆ పొగడ్తలు విన్న తరువాత...
ఆ పొగడ్తలు విన్న తరువాత ఇక ఆ సీటు మీద ఆశలు వదులుకోవాల్సిందేనని ఒక నిర్ధారణకు వచ్చారట తెలుగు తమ్ముళ్లు. శాసనమండలి చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత ఎ.చక్రపాణి వ్యవహరిస్తున్నారు. శాసనసభ, మండలి సమావేశాల చివరి రోజున సీఎం చంద్రబాబు నాయుడు మండలికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు పలు అంశాలపై ప్రసంగించారు. అందులో టీడీపీ నేతలు తమ అధినేతను ఆకాశానికెత్తారు. ఇదే సమయంలో నాకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి అని కోరిన చక్రపాణి సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు.
మీ అంత పరిపాలనాదక్షుడు లేడు అని మొదలుపెట్టి తాను ఏమేరకు పొగడగలరో ఆ మేరకు పొగిడారు. దీంతో సీఎం సహా టీడీపీ నేతలందరూ బ్రహ్మాండంగా పొగిడారంటూ అభినందించారు. చక్రపాణి పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఆయన పదవీ కాలం ముగిసిన వెంటనే చైర్మన్ కుర్చీలో తమలో ఎవరో ఒకరు కూర్చోవచ్చని టీడీపీ ఎమ్మెల్సీలందరూ ఆరాటపడ్డారు. సీఎం వద్ద తమకు చేతనైన రీతిలో పైరవీలు కూడా ప్రారంభించారు. చక్రపాణి పొగడ్తలు విన్న తరువాత ఇక ఆ కుర్చీ మీద ఆశలు వదులు కోవాల్సిందేనని వారు నిర్ణయించుకున్నారు.
తాము పార్టీలో ఉన్నాం కాబట్టి అధినేతను పొగడక తప్పదని, మా చైర్మన్ కరుడుకట్టిన కాంగ్రెస్ వాది అయినా పార్టీ సిద్ధాంతాలు వైగైరా పక్కన పెట్టి చంద్రబాబును పొగిడిన తీరు చూస్తుంటే ఆయన పదవీకాలం పొడిగింపు ఖాయమని తేలిపోయిందని ఓ టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. గత సభలో కూడా సభ్యుడిగా ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ మాత్రం చక్రపాణి గారు వైఎస్ రాజశేఖరరెడ్డి, కె.రోశయ్య, ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు ఏ రకంగానైతే పొగడ్తల వర్షం కురిపించారో, ఇపుడు కూడా అదే తీరుగా వ్యవహరించారు. ఆయన పదవి కాపాడుకోవటానికి పొగిడారు, వాటికి ఎవరైనా పడిపోతే మనం ఏమీ చేయలేం అని నిట్టూర్చారు.