బీజేపీ మోసం చేసింది: బాబు | Chandra babu Naidu takes on BJP | Sakshi
Sakshi News home page

బీజేపీ మోసం చేసింది: బాబు

Published Thu, Feb 20 2014 2:16 AM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM

బీజేపీ మోసం చేసింది: బాబు - Sakshi

బీజేపీ మోసం చేసింది: బాబు

రాష్ట్ర విభజనపై బీజేపీ, కాంగ్రెస్ కలసి పనిచేశాయి
నంబర్‌గేమ్ ముందు ఓడిపోయా
తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును స్వాగతించటం లేదు

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో బీజేపీ మోసం చేసిందని ప్రజలకు అర్థమైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, అధికార కాంగ్రెస్ పార్టీలు కలసి పనిచేశాయని మండిపడ్డారు. లోక్‌సభలో విభజన బిల్లుపై చర్చ జరిగే సమయంలో తాను, బీజేపీ సీనియర్ నేత అద్వానీ వద్ద కూర్చొని ఉన్నానని చెప్పారు. అపుడే టీవీ ప్రసారాల్లో అంతరాయం విషయం తమ దృష్టికి వస్తే అభ్యంతరం వ్యక్తం చేశామన్నారు. గతంలో ఎన్‌డీఏ, యునెటైడ్ ఫ్రంట్‌లలో తాను కీలక పాత్ర పోషించినపుడు సమావేశం ఏర్పాటు చేసి రమ్మంటే వచ్చిన నేతలు ఇపుడు ప్రత్యేకంగా వెళ్లి కలిసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 చంద్రబాబు బుధవారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... విభజన విషయంలో తన వాదనను జాతీయ పార్టీలు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ గేమ్‌ప్లాన్, లోక్‌సభలో నంబర్‌గేమ్‌ముందు తన వాదన  ఓడిపోయిందని చెప్పారు. తెలుగుజాతిని కలిపి ఉంచేందుకు తాను ప్రయత్నం చేసి ఓడిపోయానన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ప్రజలందరూ విభజనవల్ల ఆనందంగా ఉండి ఉంటే తాను ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటును స్వాగతించేవాడినని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును స్వాగతించటం లేదని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు జాతీయ చానళ్లు ఎక్కువసేపు కవరేజ్ ఇవ్వటాన్ని తప్పుపట్టారు. టీడీపీ నుంచి కొందరు నేతలు బైటకు వెళ్లిపోయేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి ప్రశ్నించగా అవకాశవాదులు వెళుతుంటారని సమాధానమిచ్చారు. బీజేపీతో పొత్తుల గురించి మాట్లాడేందుకు ఇది తగిన సమయం కాదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. బాబు విలేకరుల సమావేశానికి ‘సాక్షి’ని అనుమతించలేదు. వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు వార్త ఇస్తున్నాం. సాక్షిని అనుమతించి ఉంటే ఈ ప్రశ్నలు వేసి సమాధానాలు కోరేది.
 
  తెలంగాణ ఏర్పాటుకు రాజకీయపరంగా సహకరిస్తామని చెబుతూ 2008లో మీరు కేంద్రానికి లేఖ ఇవ్వడమే కాకుండా నిన్నమొన్నటి వరకు కూడా ఆ లేఖకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఆ లేఖను ఉపసంహరించుకోకుండానే ఇరు ప్రాంతాలవారు సంతోషంగా ఉండిఉంటే విభజనకు అంగీకరించి ఉండేవాడినని ఇప్పుడెలా చెప్పగలుగుతున్నారు?  నంబర్ గేమ్‌లో ఓడిపోయానని ఇప్పుడు చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన రోజు ఆ విషయం గుర్తులేదా?  జాతీయ పార్టీలు మిమ్మల్ని పట్టించుకోలేదని చెబుతున్నారు. అసెంబ్లీలో అన్ని రోజులు చర్చ జరిగినా ఒక్క మాట కూడా మాట్లాడని మిమ్మల్ని ఎలా విశ్వసిస్తారని భావించారు?  బీజేపీ మోసం చేసిందని ఒకవైపు చెబుతున్నారు. మరోవైపు బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు అద్వానీ పక్కనే కూర్చున్నానని చెబుతున్నారు. బీజేపీ మోసం చేసిందన్న మాట అద్వానీతో ఎందుకు చెప్పలేకపోయారు?
 
 22న టీ నేతలతో బాబు భేటీ: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో పార్టీ కొనసాగించడంపై చర్చించేందుకు 22న ఆ ప్రాంత పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. బుధవారం పార్టీ తెలంగాణ నేతలు ఎర్రబెల్లి, మండవ, అర్కల నర్సారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, పెద్దిరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి తదితరులు బాబుతో సమావేశమయ్యారు. 22న పార్టీకి 2 కమిటీలు ఏర్పాటు చేసే విషయాన్ని వెల్లడిస్తామన్నారు. మోత్కుపల్లి నర్సింహులు ఈ భేటీకి హాజరు కాకపోవడం గమనార్హం.
 
 బాబును కలవని సీమాంధ్ర నేతలు: చంద్రబాబుకు ఆ పార్టీ సీమాంధ్ర నేతలు ముఖం చాటేశారు. మంగళవారం  రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత సీమాంధ్ర ఎమ్మెల్యేలు, పార్టీ నేతలెవరూ ఆయనను కలుసుకోవడానికి ఆసక్తి చూపలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement