సాక్షి, హైదరాబాద్: అందరూ కష్టపడాలి... ఉద్యోగులందరూ తమ ధర్మాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి... అప్పుడే రాష్ట్రం నవ్యాంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చెందగలదని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్భోదించారు. ఆయన మంగళవారం స్థానిక ముఖ్యమంత్రి కార్యాలయం లేక్‌వ్యూ అతిథి గృహం నుంచి 13 జిల్లాల కలెక్టర్లతో పాటు ఆర్డీవోలు ఇతర ఉద్యోగులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. 13 జిల్లాల పరిధిలోని 625 మండల కార్యాలయాల్లోని సుమారు పది వేలమంది అధికారులు, ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రం రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌లో నడుస్తుందని వివరిస్తూ తిరిగి రాష్ట్రాన్ని అగ్రగామిలో నిలిపేందుకు అధికారులు సహకరించాలని చంద్రబాబు కోరారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌పై తెలంగాణ రాష్ట్రం సుప్రీంకోర్టుకు వెళ్లడంవల్ల మూడున్నర లక్షల మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేసే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కేంద్రం ముందుకు రావడంతో పోలవరం అర్డినెన్స్‌ను ఆమోదించుకోగలిగామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని సీఎం అంగీకరించారు. రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చానని.. వాటి ని అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
టీ సర్కారుపై గవర్నర్‌కు బాబు ఫిర్యాదు
ఎంసెట్ అడ్మిషన్లపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి సరిగా లేదని, ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకొని ఇరు రాష్ట్రాల్లోని లక్షలాది విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గవర్నర్ నరసింహన్‌ను కోరారు. వివిధ ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీరును తప్పుబడుతూ మంగళవారం రాత్రి ఆయన గవర్నర్‌ను కలసి ఫిర్యాదుచేశారు. ప్రవేశాలు ఆలస్యం అవ్వడం వల్ల విద్యార్థులు ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదముందని చెప్పారు. ఎంసెట్ ఫలితాలు వెలువడి చాలారోజులైనా తెలంగాణ ప్రభుత్వం అడ్మిషన్లకు ముందుకురావడం లేదన్నారు. దీనిపై తాను నేరుగా ఆ సీఎం చంద్ర శేఖర్‌రావుకు లేఖ రాసినా స్పందన కరవైందని ఆవేదన వ్యక్తపరిచారు. చంద్రబాబు చెప్పిన అంశాలను సావధానంగా విన్న గవర్నర్ నరసింహన్ దీనిపై తాను ఇదివరకే ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో మాట్లాడానని, ఇపుడు తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావుతో కూడా మాట్లాడతానని చెప్పారని సమావేశంలో పాల్గొన్న మంత్రి ఒకరు వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నియంతలా వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు ధ్వజమెత్తారు. ఆయన వైఖరి ప్రభుత్వ ఉగ్రవాదం (స్టేట్ టైజమ్)గా మారిందని విమర్శించారు.
అందరూ కష్టపడితేనే నవ్యాంధ్రప్రదేశ్
Published Wed, Jul 16 2014 2:12 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM
Advertisement
Advertisement