సొంత జిల్లాకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీరని అన్యాయం చేశారు. తన పాలనలో అస్మదీయులకు లబ్ధి చేకూర్చడంపైనే దృష్టి సారించారు. ప్రాజెక్టుల అంచనాలు ఎడాపెడా పెంచేసి, ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేసి జిల్లా రైతాంగం నోట్లో మట్టికొట్టారు. హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశలో భాగమైన కుప్పం ఉపకాలువ పనులు 90 శాతం పూర్తయినా కృష్ణా జలాలు తరలించలేదని గగ్గోలు పెట్టిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వల్ల చిత్తూరు, కడప జిల్లాకు తీరని అన్యాయం జరిగింది. వేల కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టు పనులు నిరుపయోగం అయ్యేందుకు ప్రత్యక్ష కారకులయ్యారు.
బి.కొత్తకోట: జిల్లాలో హంద్రీ–నీవా ప్రాజెక్టుకు సంబంధించిన ఉపకాలువలు, రిజర్వాయర్లలో ఒక్క పుంగనూరు ఉపకాలువ మినహా మిగిలిన మొత్తం ప్రాజెక్టుకు కృష్ణా జలాలను అనంతపురం జిల్లాలోని ప్రధాన కాలువ ఎన్‌పీకుంట మండలం నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యంలోకి ప్రవేశిస్తుంది. దీనికి మధ్యలో పెద్దరాంపల్లె–పుల్లకూరవాండ్లపల్లె (ఎన్‌పీ కుంట మండలం) మధ్యలోని సొరంగం కీలకం. ఈ సొరంగం మీదుగానే కృష్ణా జలాలు రావాలి. అయితే గత టీడీపీ పాలనలో సొరంగం పనులు పూర్తి చేయించకపోవడంతో జలాల తరలింపు ఆగిపోయింది. ఈ పనుల అంచనాలను పెంచుకున్నా.. పనులపై శ్రద్ధ చూపకపోవడంతో జిల్లాలో రూ.3,500 కోట్ల పనులు నిరుపయోగమయ్యాయి. తద్వారా గత టీడీపీ పాలనలో రెండు జిల్లాలకు తీరని అన్యాయం జరిగింది.
అంచనా పెంచి వదిలేసిన వైనం..
అనంతపురం జిల్లాలోని ఎన్‌పీ కుంట మండలం పెద్దరాంపల్లె–పుల్లకూరవాండ్లపల్లె మధ్యలో 5.20 మీటర్ల వ్యాసంతో సొరంగం తవ్వకం, లైనింగ్ పనులను కిలోమీటర్ 412.000 నుంచి 415.000 వరకు పూర్తి చేయాల్సి ఉంది. మొత్తం 3.5 కిలోమీటర్ల సొరంగం తవ్వకం, లైనింగ్, రెండువైపులా 150 మీటర్ల కాలువ నిర్మాణం పనులను రూ.27.12 కోట్లతో శ్రీఅవంతిక సాయి వెంకట జాయింట్ వెంచర్ సంస్థ చేపట్టింది. ఈ సంస్థ 2015 మార్చినాటికి రూ.6.34 కోట్ల పనులు చేసి చేతులు దులుపుకుంది. మరో రూ.20.78 కోట్ల పనులు నిలిచిపోగా గత ప్రభుత్వం పనుల అంచనాలను పెంచుకునే చర్యల్లో భాగంగా 2016లో రూ.6.0679 కోట్ల సొరంగం, కాలువ పనులకు అంచనాలు పెంచి టెండర్లు నిర్వహించగా మ్యాక్స్ ఇన్‌ఫ్రా(ఐ) లిమిటెడ్ సంస్థ రూ.15.08 కోట్లకు పనులు దక్కించుకుంది. ఈ సంస్థ ఐదేళ్లలో రూ.6.64 కోట్ల పనులే చేసి మిగిలిన రూ.8.43 కోట్ల పనులు వదిలేసింది. లైనింగ్ పనులను వెడ్సర్ కన్‌స్ట్రక్చర్ సంస్థకు రూ.17.75 కోట్లకు అప్పగించగా రూ.65 లక్షల పనులే పూర్తి చేసినట్టు సమాచారం. సొరంగానికి సంబంధించి గత ప్రభుత్వం చివరినాటికి 115 మీటర్ల పనులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. కదిరి వైపు నుంచి ఈ పనులు పెద్దమండ్యం వైపునకు సాగే కాలువ వైపు ఆగిపోయాయి.
పూర్తయితే కృష్ణమ్మ గలగల
అనంతపురం జిల్లా కదిరి సమీపంలో హంద్రీ–నీవా రెండు కాలువలు విడిపోతాయి. కుడివైపున పుంగనూరు ఉపకాలువ తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దతిప్పసముద్రం మండలంలోకి ప్రవేశించి పలమనేరు నియోజకవర్గం నుంచి మొదలయ్యే కుప్పం ఉపకాలువలో కలుస్తుంది. ఎడమవైపు నుంచి సాగే ప్రధాన కాలువ ఎన్‌పీ కుంట మండలం మీదుగా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యంలోకి ప్రవేశించి వైఎస్సార్ కడప జిల్లాకు వెళ్తుంది. పెద్దమండ్యం మండలం నుంచి అడవిపల్లె రిజర్వాయర్‌కు నీటిని తరలించే కాలువల నిర్మాణం జరిగింది. ఈ సొరంగం పూర్తయితే జిల్లాలోని అడవిపల్లె, కలిచర్ల, వైఎస్సార్ కడప జిల్లాలోని శ్రీనివాసపురం రిజర్వాయర్లకు, ఉపకాలువలు, డిస్ట్రిబ్యూటరీలకు కృష్ణా జలాలు అందుతాయి.
జిల్లాలో సాగే 30 కిలోమీటర్ల ప్రధానకాలువ, 30.750 కిలోమీటర్ల తంబళ్లపల్లె ఉపకాలువ, 44.200 కిలోమీటర్ల చింతపర్తి ఉపకాలువ, 25.170 కిలోమీటర్ల ఎల్లుట్ల ఉపకాలువ, 23.500 కిలోమీటర్ల వాయల్పాడు ఉపకాలువ, 142.200 కిలోమీటర్ల నీవా ఉపకాలువ, 0.125 టీఎంసీ సామర్థ్యం కలిగిన కలిచర్ల రిజర్వాయర్, 1.418 టీఎంసీ సామర్థ్యం కలిగిన అడవిపల్లె రిజర్వాయర్లకు కృష్ణాజలాల తరలింపు సాధ్యమవుతుంది. అడవిపల్లె నుంచి హంద్రీ–నీవా కాలువ ద్వారా చిత్తూరు సమీపంలోని ఎనీ్టఆర్ జలాశయానికి చిత్తూరు నగర ప్రజల తాగునీటికి నీరు తరలిస్తారు. ఈ పనులు పూర్తి చేసేందుకు రూ.3,500 కోట్లు ఖర్చు చేశారు.
3 మాసాల్లో పూర్తికి లక్ష్యం
ఎన్‌పీ కుంట మండలంలో ఆగిన సొరంగం పనులకు సంబంధించిన కాంట్రాక్టర్‌కు గత ప్రభుత్వంలో రూ.1.20 కోట్లు, ఏడాదిగా జరిగిన పనుల బిల్లు రూ.50 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు చెల్లించాలి. మిగిలిపోయిన సొరంగం పనులను మూడు మాసాల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం.
– ఎం.వెంకటరమణ, హెచ్‌ఎన్‌ఎన్‌ఎస్ ఎస్‌ఈ, అనంతపురం
35 మీటర్లు తవ్వించాం..
ఈ ఏడాది కాలంలో 35 మీటర్ల సొరంగం పనులు చేయించాం. రెండు లేక మూడు నెలల్లో పనులు పూర్తి చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నాం. గతంలో కాంట్రాక్టర్ పనులు సత్వరమే పూర్తి చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సొరంగం పని పూర్తయ్యాక లైనింగ్ పనులు చేపడతాం.
– రాజగోపాల్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఈఈ, ధర్మవరం
Comments
Please login to add a commentAdd a comment