సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఏళ్ల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న 6 లక్షల మంది నిరుద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలువునా వంచించారు. 23,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా, తీరా ఎన్నికల ముందు కేవలం 7,902 పోస్టుల భర్తీకి డీఎస్సీ–2018 నోటిఫికేషన్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ఇదేం అన్యాయం అని ప్రశ్నిస్తే ఆర్థిక శాఖ ఒప్పుకోవడం లేదంటూ కుంటిసాకులు చెబుతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరీక్షిస్తూ రూ.లక్షలు ఖర్చు చేసి, ఇన్నాళ్లూ కోచింగ్ తీసుకున్నామని, ఇప్పుడు కేవలం 7,902 పోస్టులనే భర్తీ చేస్తామంటూ ముఖ్యమంత్రి తమ నోట్లో మట్టి కొట్టారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 88,914 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని వారు గుర్తుచేస్తున్నారు. ఆర్థిక శాఖ అభ్యంతరాలను సైతం లెక్కచేయకుండా నిరుద్యోగులకు భవిష్యత్తును దృష్టి పెట్టుకుని దృఢమైన నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు.
నిరుద్యోగులకు వైఎస్సార్ అభయం
2004 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులను మభ్యపెడుతూ 2003 నవంబరు 13న 16,449 పోస్టులతో డీఎస్సీని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఆయన చిత్తుచిత్తుగా ఓడిపోయారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డీఎస్సీ–2003 ప్రక్రియను సకాలంలో పూర్తి చేశారు. ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇప్పించారు. అనంతరం 2006లో మరో డీఎస్సీని ప్రకటించారు. 20,193 పోస్టులతో 2006 మే 30న ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎంపిక ప్రక్రియను దిగ్విజయంగా పూర్తిచేశారు. అది ముగిసిన వెంటనే 2008లో మెగా డీఎస్సీకి ఆదేశాలు ఇచ్చారు. ఆర్థిక శాఖ 30,000 పోస్టులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అప్పటికే సక్సెస్ స్కూళ్లను, ప్రత్యేక స్కూళ్లను ప్రారంభించినందున, అదనంగా టీచర్ పోస్టులు అవసరమని, మరిన్ని పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారులకు సూచించారు. అయితే, బడ్జెట్ పరిమితుల దృష్ట్యా 30,000 పోస్టులనే భర్తీ చేయగలమని, అదనపు పోస్టులకు అనుమతులు కష్టమని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు.
నిధుల సంగతి తాను చూసుకుంటానని, నిరుద్యోగులకు మేలు కలిగేలా 50,000కు తగ్గకుండా టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాలని వైఎస్ రాజశేఖరరెడ్డి తేల్చిచెప్పారు. 2008 డిసెంబర్ 6న 52,272 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఈ డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చారు. డీఎస్సీలో ఎంపికై, పోస్టులు ఖాళీ లేక నియామకం కాని వారికి హామీ పత్రాలు జారీ చేశారు. అనంతరం రిటైరైన వారి పోస్టులతోపాటు కొత్త పోస్టులను మంజూరు చేయించి మరీ వారిని టీచర్ కొలువుల్లో నియమించారు. ఫలితంగా వేలాది మంది నిరుద్యోగులు లబ్ధి పొందారు. గరిష్ట వయో పరిమితి అంతకు ముందు వరకు 33 ఏళ్లు మాత్రమే ఉండగా, ముఖ్యమంత్రిగా వైఎస్సార్ దాన్ని ఓసీలకు 39 ఏళ్లకు, బీసీలకు 44 ఏళ్లకు, ఎస్సీ, ఎస్టీలకు 44 ఏళ్లకు, దివ్యాంగులకు 49 ఏళ్లకు పెంచారు. పైగా వయోపరిమితి దాటిపోతున్న వారు ఈ డీఎస్సీలో హామీ పత్రాలు పొందడం ద్వారా తరువాతి కాలంలో నిర్ణీత వయసుతో సంబంధం లేకుండానే ఉపాధ్యాయ పోస్టుల్లో నియమితులయ్యారు.
ఆర్థిక శాఖపై చంద్రబాబు ఒత్తిడి
తాము అధికారంలోకి వస్తే ప్రతిఏటా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. గద్దెనెక్కాక నాలుగున్నరేళ్లుగా ఆ మాటే మర్చిపోయారు. చివరకు ఎన్నికల ముందు కేవలం 7,902 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్రంలో 22,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గతేడాది స్వయంగా ప్రకటించారు. కానీ, కేవలం 12,370 పోస్టుల భర్తీకి డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేశారు. తరువాత 14,300 పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావడంతో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. కానీ, భర్తీ చేయాల్సిన టీచర్ పోస్టుల సంఖ్యను టీడీపీ ప్రభుత్వం అనూహ్యంగా 10,351కి కుదించింది. ఆ మేరకే ఆర్థిక శాఖ అనుమతులున్నాయని మంత్రి గంటా చెప్పారు. రెండోసారి డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి మేరకు ఆర్థిక శాఖ కొత్త కొర్రీలు వేసింది. పోస్టుల సంఖ్యను 7,729కి కుదించింది. గతంలో ప్రత్యేక డీఎస్సీలో మిగిలిపోయిన 173 ఉర్దూ పోస్టులను కూడా కలిపి మొత్తం 7,902 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది.
బాబు పాలనలో అంతేమరి
ఆర్థిక శాఖ కాదన్నా వైఎస్ రాజశేఖరరెడ్డి మెగా డీఎస్సీ సహా తన హయాంలో 88,914కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేశారు. రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ చంద్రబాబు అందులో మూడోవంతు పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. 2014లో ప్రకటించిన డీఎస్సీకి అంతకు ముందు కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. అప్పట్లో తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలతో నోటిఫికేషన్ నిలిచిపోగా 2014లో వెలువరించారు. ఆ డీఎస్సీని వేయడం ఇష్టంలేని చంద్రబాబు మూడేళ్లపాటు నాన్చి 2016 చివర్లో గానీ పూర్తి చేయించలేదని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు.
విద్యావాలంటీర్ల సృష్టికర్త చంద్రబాబే
విద్యారంగంలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయులను నియమించకుండా విద్యా వాలంటీర్లను నియమించి ఆ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ఘనత చంద్రబాబుదే. అప్పటివరకు లేని ఈ విద్యా వాలంటీర్ల వ్యవస్థను సృష్టించి నిరుద్యోగులను దగా చేశారు. 2002లో 8,954 మంది విద్యావాలంటీర్లను నియమించారు. వారికి అత్యల్పంగా రూ.1,000 నుంచి రూ.2,000 వరకు మాత్రమే వేతనం ఇచ్చారు. రాష్ట్రంలో మళ్లీ ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొంది.
నేడు మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి ముట్టడి
అవనిగడ్డ: డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులను పెంచాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని సోమవారం ముట్టడించనున్నట్లు డీఎస్సీ జేఏసీ నేతలు సీహెచ్ రాంబాబు, గోవింద్, గౌరినాయుడు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 23,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేవలం 7,902 పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని ధ్వజమెత్తారు. పోస్టుల సంఖ్య పెంచాలని ఇటీవల అవనిగడ్డ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో నిరుద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తే కనీసం సమాధానం చెప్పకుండా పోలీసులతో బలవంతంగా పలు పోలీసుస్టేషన్లకు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. సిలబస్ పెంచి, తక్కువ సమయం ఇవ్వడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారని, గడువు పెంచాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులు పెద్ద ఎత్తున హాజరై మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని, మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment