Unemployed youths
-
Rahul Gandhi: వీరి బాధలు ఎవరికీ పట్టట్లేవు
జైపూర్: తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు ఎంత మొత్తుకున్నా బాధలను మోదీ సర్కార్ పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గురువారం రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అనూప్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ తమ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్చేస్తున్నారు. ఉపాధి కల్పించాలని నిరుద్యోగ యువత విన్నపాలు చేస్తోంది. నిత్యా వసరాల ధరల నుంచి ఉపశ మనం కల్పించాలని మహి ళలు వేడుకుంటున్నా వీళ్ల గోడు ఎవరికీ పట్టదు’’ అని రాహుల్ అన్నారు. ‘‘ వెనుకబడిన వర్గా లు, దళితులు, గిరిజనులు, జనరల్ కేటగిరీలో ఉన్న పేదల అభ్యున్నతి కోసమే ఈ ఎన్నికలు. నిరుద్యోగమే దేశంలో అతిపెద్ద సమస్య. ద్రవ్యోల్బణం రెండో సమస్య. దేశంలో 90 శాతం మంది ఇవే చెబుతారు. కానీ ఒకవేళ కేంద్రంలో బీజేపీ చెప్పుచేతల్లో ఉన్న జాతీయమీడియాను ఫాలో అయితే మాత్రం మనకు అంబానీ కుమారుల పెళ్లివేడుకే దేశంలో అతిపెద్ద చర్చనీయాంశంగా కనిపిస్తుంది. మోదీ ఓసారి సాగరగర్భంలోకి వెళ్తారు, మరోసారి గస్తీవిమానంలో చక్కర్లు కొడతారు, మరోసారి డప్పు వాయిస్తూ కనిపిస్తారు, ఇంకోసారి సభలో మొబైల్ ఫ్లాష్లైట్లు వెలిగించాలని పిలుపునిస్తూ కనిపిస్తారు. జాతీయ మీడియాలో 24 గంటలూ మోదీ ముఖమే దర్శనమిస్తుంది’’ అని ఎద్దేవాచేశారు. -
పరిశ్రమల ప్రకాశం
పారిశ్రామిక ప్రగతితో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాయితీలు ఇస్తోంది. ఫలితంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలోనే జిల్లాలో రూ.152 కోట్లతో 201 పరిశ్రమలు కొత్తగా ఏర్పడ్డాయి. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుతో పాటు సీడీపీల ద్వారా పరిశ్రమలకు తోడ్పాటునిస్తోంది. అదే సమయంలో ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్‌హబ్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తోంది. ఒంగోలు అర్బన్: జిల్లాలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుతో పాటు సీడీపీ (క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్)లతో జిల్లా ప్రకాశించనుంది. ఆ మేరకు కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టి క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కలి్పంచేలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లాలో యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం కల్పించేలా ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన యువతకు ఉపాధి కలి్పంచేలా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా జిల్లాలో 2022–23 సంవత్సరంలో రూ.152 కోట్లతో 201 పరిశ్రమలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటిలో సుమారు 1600 మందికి ఉపాధి లభించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కోట్లాది రూపాయల రాయితీలు ఇచ్చింది. అంతేకాకుండా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. అంతేకాకుండా సీడీపీల ద్వారా పరిశ్రమలకు తోడ్పాటునిస్తోంది. పరిశ్రమలకు చేయూత: జిల్లాలో ఇప్పటికే 25 భారీ పరిశ్రమలు, 2899 ఎంఎస్ఎంఈ (చిన్న, మధ్య తరహా) పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో భారీ పరిశ్రమల్లో సుమారు 8 వేల మంది, ఎంఎస్ఎంఈల్లో 35 వేల మంది ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ పరిశ్రమలు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు చేయూతనిస్తూ ప్రోత్సహిస్తోంది. 2019 నుంచి జిల్లాలో 1406 పరిశ్రమలకు రాయితీ కింద రూ.171.07 కోట్లు అందజేసింది. 2019–20లో 242 పరిశ్రమలకు రూ.23.76 కోట్లు, 2020–21లో 220 పరిశ్రమలకు రూ.48.26 కోట్లు, 2021–22లో 375 పరిశ్రమలకు రూ.33.6 కోట్లు, 2022–23లో ఇప్పటి వరకు 569 పరిశ్రమలకు రూ.65.98 కోట్లు రాయితీ ఇచ్చింది. ఎంఎస్ఎంఈ పార్కులతో కొత్త పరిశ్రమలు: జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ వేగవంతంగా చర్యలు ప్రారంభించారు. 99.27 ఎకరాల్లో రూ.201.22 కోట్ల వ్యయంతో ఎంఎస్ఎంఈ పార్కులు సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దొనకొండ మండలం రాగముక్కలపల్లి, పామూరు మండలం మాలకొండాపురం వద్ద ఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే భూ సేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ పార్కులు సిద్ధమైతే వీటిలో సుమారు 20 వేల మందికి ప్రత్యక్షంగా, మరో పదివేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. సీడీపీలతో పరిశ్రమలకు అండగా... క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (సీడీపీ)లతో పరిశ్రమలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేలా ఏర్పాటు చేయనున్నారు. రూ.30 కోట్ల వ్యయంతో చీమకుర్తి, గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్ వద్ద రెండు సీడీపీలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేశారు. చీమకుర్తిలో ఏర్పాటు చేసే సీడీపీ గ్రానైట్ పరిశ్రమలకు, గ్రోత్‌సెంటర్‌లో ఏర్పాటు చేసే సీడీపీ నిర్మాణ రంగానికి సంబంధించిన పరిశ్రమలకు వెన్నుదన్నుగా ఉండనున్నాయి. 15 ఏళ్లకు ప్రణాళికలు జిల్లాలో ఉన్న వనరుల మేరకు భారీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు కొత్తగా నెలకొల్పేందుకు యువతను ప్రోత్సహించడం అవసరమైన నైపుణ్య శిక్షణలు ఇవ్వడం, ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి అండగా ఉండటం వంటి చర్యలపై రాబోయే 15 సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలను కలెక్టర్ సిద్ధం చేస్తున్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో కొత్తగా పరిÔశ్రమలు నెలకొల్పేలా పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంతో యువత ముందుకు రావాలి పరిశ్రమలు స్థాపించేందుకు యువత వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు రావాలి. అలా వచ్చిన యువతకు పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తాం. తద్వారా వాళ్లు ఎదగడంతో పాటు ఎంతోమందికి ఉపాధి కలి్పంచవచ్చు. అదేవిధంగా జిల్లా, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన అన్నీ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా పరిశ్రమల స్థాపనకు చేయూతనిస్తోంది. రాయితీలు అందిస్తోంది. జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా పరిశ్రమలకు అవసరమైన వాటిలో నైపుణ్య శిక్షణ ఇస్తూ జిల్లాలోనే యువతకు ఉపాధి కలి్పంచడంతో పాటు పరిశ్రమలకు మ్యాన్‌పవర్ ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకున్నాం. – ఏఎస్ దినే‹Ùకుమార్, కలెక్టర్ -
అమరుల ఆశయాలకు మరో ఉద్యమం
సుందరయ్య విజ్ఞానకేంద్రం/కాచిగూడ (హైదరాబాద్): తెలంగాణ ఉద్యమంలో ప్రజలు దేనికోసం అమరులయ్యారో ఆ అమరుల ఆశయాల సాధనకోసం మరోసారి ఉద్యమాలు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ నేడు నిరుద్యోగుల ఆకాంక్షలు కూడా నెరవేరలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వటం లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారుల గురించి పార్లమెంట్లో చర్చిస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ కోసం చైతన్యవంతంగా పని చేసిన సంఘాలు తెలంగాణ వచ్చాక రద్దయ్యాయని విమర్శించారు. ఉద్యమకారుల కుటుంబాలకు గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ అనేక మంది ఉద్యమకారుల బలిదానం వల్లనే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ ఉద్యమకారులను అనాథలను చేయటంలో అన్ని పార్టీలు ముందున్నాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కాచం సత్యనారాయణ డిమాండ్ చేశారు. అనంతరం పలువురు ఉద్యమకారులను సత్కరించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు దిలీప్‌కుమార్, రాములు నాయక్, వేముల మారయ్య, సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్, ప్రొఫెసర్ అన్వర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. 50 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీసీ సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. దీర్ఘకాలికంగా, అపరిష్కృతంగా ఉన్న బీసీల డిమాండ్లను సాధించే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న సమయంలో దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పదిరోజులుగా వేలాది మందితో ఢిల్లీలో పార్లమెంట్ వద్ద ధర్నాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో జనాభా ప్రకారం సమాన వాటా ఇవ్వాలని కోరారు. త్వరలో జరిగే జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌ను తొలగించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
నిరుద్యోగుల ఉసురు తీస్తున్న సీఎం
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన నిరుద్యోగులు ఏడేళ్లుగా నిరా శ, నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. సీఎం కేసీఆర్‌లో చలనం రావడం లేదని, ఇంకా ఎం తమంది నిరుద్యోగుల ఉసురు పోసుకుంటారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మం డిపడ్డారు. ఉద్యోగ ప్రకటన వేయలేదని ఈనెల 25న ఆత్మహత్య చేసుకున్న ముత్యాల సాగర్ స్వగ్రామం బయ్యారం గ్రామంలో తల్లి దండ్రులు భద్రయ్య, కళమ్మ లను శుక్రవారం ఈటల పరా మర్శించారు. సాగర్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రేపు తాడిపత్రిలో వైఎస్ షర్మిల దీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం చేస్తున్న నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా, వైఎస్ షర్మిల ఈ నెల 13వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలోని తాడిపత్రి గ్రామంలో ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’ చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్య కర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ దీక్షకు హాజరై మద్దతు పలకాలని ఆ పార్టీ అడహాక్ కమిటీ సభ్యులు కొండా రాఘవరెడ్డి కోరారు. -
నిరుద్యోగుల పాలిట ‘సిరి’ సిటీ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రజల సంక్షేమం కోసం పరితపించిన వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన అది. రాళ్లు, రప్పలతో కూడిన భూముల్లో.. వర్షాధారిత వ్యవసాయంతో ప్రజలు అత్యంత దుర్భర జీవనం సాగించిన ప్రాంతమది. వారి జీవితాలను, ఆ ప్రాంతాన్ని మెరుగుపర్చాలనే సంకల్పం ఆ మహా నాయకుడిలో మొగ్గ తొడిగింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ప్రజల జీవన ప్రమాణాలు బాగుపడతాయని భావించిన ఆయన ‘సెజ్’ (స్పెషల్ ఎకనమిక్ జోన్) ఏర్పాటు చేశారు. ఇప్పుడది ఇంతింతై.. ఒటుడింతై అన్నట్టుగా దినదినాభివృద్ధి చెందుతూ.. అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు పొందుతోంది. చిత్తూరు జిల్లాకు మణిహారంగా నిలుస్తోంది. పారిశ్రామక వాడగా మొదలై.. పారిశ్రామిక నగరంగా వరదయ్యపాలెం, సత్యవేడు మండలాల పరిధిలో 14 గ్రామాల మధ్య శ్రీసిటీని ఆగస్టు 8, 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. దీనిద్వారా ప్రస్తుతం 5 0వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరో ఐదేళ్లలో 1.50 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళుతోంది. పారిశ్రామిక వాడగా మొదలైన శ్రీసిటీ పారిశ్రామిక నగరంగా రూపుదిద్దుకుంది. సామాజిక బాధ్యతను దృష్టిలో ఉంచుకుని వర్క్, లైవ్, లెర్న్, ప్లే అనే విధానంలో ప్రణాళికాబద్ధంగా వృద్ధి చెందుతోంది. ఇందులో ట్రిపుల్ ఐటీ, డిగ్రీ కళాశాలలు ఏర్పాటయ్యాయి. నాలుగు లేన్ల రహదారులు వచ్చి చేరాయి. 3 లక్షల మంది నివసించేందుకు వీలుగా భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. కన్జర్వేషన్ పద్ధతిలో భూగర్భ జలాలను పెంపొందించారు. వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా చెరువులు నిర్మించారు. కాలువల ద్వారా ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు చేరేలా లింక్ చానల్స్ నిర్మించారు. తద్వారా భూగర్భ జలాలు 4 మీటర్లు పెరిగాయి. శ్రీసిటీలో అన్ని పరిశ్రమలకు శుద్ధి చేసిన నాణ్యమైన నీరు సరఫరా చేస్తూనే.. పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత, వ్యర్ధ జలాలను శుద్ధి చేసి ఉద్యాన వనాలను పెంచుతున్నారు. 50 ఎకరాల్లో ప్రత్యేకంగా నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. సెజ్ వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటారు. ఫలితంగా కాలుష్య రహిత ప్రాంతం ఇక్కడ ఆవిష్కృతమైంది. సెకనుకు 3 సెల్ఫోన్ల తయారీ శ్రీసిటీ మొబైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లల్లో ప్రతి సెకనుకు 3 సెల్ఫోన్ల చొప్పున నిమిషానికి 180 తయారవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, సిమెన్స్ సంస్థ సంయుక్తంగా శ్రీసిటీలో టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పి నిరుద్యోగులను నిష్ణాతుల్ని చేస్తున్నారు. ఇలా రెండేళ్లలో 5వేల మందిని తీర్చిదిద్దారు. శిక్షణ తర్వాత ఉద్యోగం చూపించే లక్ష్యంతో ట్రైనింగ్ ఇస్తుండటం విశేషం. ఇక్కడ 27 దేశాలకు చెందిన 185 కంపెనీలకు వివిధ ఉత్పత్తులను విదేశీ సామర్థ్యంతో చేపడుతున్నారు. ఇస్రో, నాసా పరిశోధన సంస్థల రాకెట్ ప్రయోగంలో వినియోగించే లిక్విడ్ హైడ్రోజన్ ట్యాంక్స్, ఇసుజి వాహనాలు, సిద్ధార్థ లాజిస్టిక్స్, రఫేల్ యుద్ధ విమానాల ల్యాండింగ్ సీలింగ్ నిర్మాణం ఇక్కడే తయారవుతున్నాయి. డ్రగ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, ఎలక్ట్రికల్ కేబుల్స్ ఇలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులు సైతం ఇక్కడే చేస్తున్నారు. మహిళలకూ ఆర్థిక స్వావలంబన శ్రీసిటీ సెజ్ కారణంగా ఎందరో మహిళలు ఆర్థికంగా లాభపడ్డారు. దశాబ్ద కాలంలో అక్షరాస్యత అత్యంత వేగంగా పుంజుకుంది. పుష్కర కాలంలోనే ఇక్కడి పౌరుల సగటు ఆదాయం 200 శాతం పెరిగింది. ప్రతి కుటుంబంలో ఉద్యోగులు ఉన్నారు. పూరి గుడిసెల స్థానంలో అందమైన ఇళ్లు వెలిశాయి. శ్రీసిటీ పరిధిలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ వేలాది మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఇందులో ఉద్యోగాలు చేస్తున్న వారిలో 50 శాతం మంది మహిళలే ఉండటం మరో విజయం. ఫాక్స్గాన్ సెల్ఫోన్ల తయారీ కంపెనీలో దాదాపు 15 వేల మంది మహిళలు ఉద్యోగులున్నారు. పదో తరగతి పాస్, ఫెయిల్ అయిన మహిళలకు కూడా స్కిల్ డెవలప్మెంట్, డీఆర్డీఏ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి సెల్‌ఫోన్ ఉత్పత్తి ఉద్యోగాల్లో నియమించారు. ఎంఐ, ఆపిల్, నోకియా, ఒన్ ప్లస్ ఫోన్లు ఇక్కడ తయారై ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. తాజాగా శుక్రవారం కోవిడ్ బాధితులకు రూ.20 లక్షల విలువ చేసే 10 వేల లీటర్ల ఆక్సిజన్‌ను శ్రీసిటీ విరాళంగా అందించింది. -
ప్రక్షాళన దిశగా ఏపీపీఎస్సీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో అభిప్రాయాల సేకరణకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవడానికి సోమవారం విజయవాడలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. వివాదాలను పరిష్కరించి, నిరుద్యోగులలో విశ్వాసం నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. టీడీపీ హయాంలో ఏపీపీఎస్సీ చుట్టూ వివాదాలు ముసురుకున్న విషయం తెలిసిందే. కమిషన్ నిర్ణయాలపై గతంలో నిరుద్యోగులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. పలు అడ్డగోలు నిబంధనలు, పరీక్షల నిర్వహణలో, ప్రశ్నపత్రాల తయారీలో తప్పిదాలు నిరుద్యోగులకు నష్టం కలిగించాయి. వీటిపై ఎన్నిసార్లు మొత్తుకున్నా కమిషన్ పాలకవర్గం పట్టించుకోలేదు. పైగా తమను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టించడంతో పాటు ఇంటర్వ్యూల్లో వారిని బ్లాక్‌లిస్టుల్లో పెట్టి భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో నిరుద్యోగులు తమ సమస్యలను ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ వ్యవహారాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించి, నియామకాలన్నీ పారదర్శకంగా నిర్వహించేలా పలు సూచనలు చేశారు. గ్రూప్1 పోస్టులు, మరికొన్ని ప్రత్యేక కేటగిరీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మినహాయించి తక్కిన అన్ని కేటగిరీల పోస్టులకు ఇంటర్వ్యూలను రద్దుచేశారు. క్యాలెండర్ ప్రకారం నియామకాలకు ఏటా జనవరిలో కమిషన్ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీలో నిరుద్యోగులకు ఇబ్బందికరంగా ఉన్న పలు అంశాలను సరిచేసేలా ఇటీవల కమిషన్ కార్యదర్శి పి.సీతారామాంజనేయులు ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు అందించారు. ఇంటర్వ్యూలకు చైర్మన్ ఆధ్వర్యంలో ఒకేఒక్క బోర్డు ఉండగా దాన్ని మూడు బోర్డులుగా మార్పు చేశారు. గత ప్రభుత్వం తప్పుల మీద తప్పులు.. – టీడీపీ ప్రభుత్వ హయాంలో కమిషన్ అస్తవ్యస్త నిర్ణయాలతో పలు నోటిఫికేషన్లు న్యాయవివాదాల్లో చిక్కుకున్నాయి. – గ్రూప్1 మినహా ఇతర పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్ష లేదు. కానీ ప్రిలిమ్స్‌ను కమిషన్ అన్నిటికీ అమలు చేస్తోంది. – ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో ఎంపిక విధానాన్ని రద్దుచేసి 1:15కు కుదించడంతో నిరుద్యోగులు నష్టపోయారు. కొత్త ప్రభుత్వం దీన్ని మార్పు చేసి 1:50కి మార్పు చేసింది. – గ్రూప్1, గ్రూప్2 సిలబస్‌ను 2016–17లో మార్చారు. ఏడాది తిరగకుండానే మళ్లీ మార్పు చేశారు. దీంతో అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. – ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలలో 75 మార్కులుండగా అస్మదీయులకు ఎక్కువ మార్కులు వేసి పోస్టులు కట్టబెట్టారనే విమర్శలున్నాయి. – పలు పరీక్షల్లో ప్రశ్నలు వాటి సమాధానాల ఆప్షన్లు తప్పుల తడకగా ఇచ్చారు. ఆంగ్లం నుంచి తెలుగు అనువాదం తప్పులు అభ్యర్థులను తికమకకు గురిచేశాయి. – గతంలో ఏకంగా 42 ప్రశ్నల్లో తప్పులు రావడంతో ఏపీపీఎస్సీ వాటిని తొలగించాల్సి వచ్చింది. పారదర్శక విధానాలకు పెద్దపీట – కమిషన్ కార్యదర్శి పి.సీతారామాంజనేయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలతో ఏపీపీఎస్సీ నియామకాల్లో పూర్తి పారదర్శకత పాటిస్తాం. ఏకపక్ష నిర్ణయాలకు తావుండదు. కమిషన్‌లో గతంలోని తప్పిదాల వల్ల నిరుద్యోగులు చాలా నష్టపోయారు. వీటికి బాధ్యులైన వారు తప్పించుకునే పద్ధతి సరికాదు. దీనికి కమిషన్‌లోని వారిదే బాధ్యత అవుతుంది. అందుకే కమిషన్‌లో ఎలాంటి లోపాలున్నాయో విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు, ప్రజాప్రతినిధులనుంచే తెలుసుకోవాలని సోమవారం (నేడు) సదస్సు నిర్వహిస్తున్నాం. అందరి నుంచి సూచనలు తీసుకొని తప్పులు సరిదిద్దుతాం. -
‘ట్రిమ్‌విజన్’ పేరిట 230 మందికి టోకరా
సాక్షి, వరంగల్: నిరుద్యోగుల ఆశలను సొమ్ము చేసుక్ను మరో సంస్థ బోర్డు తిప్పేసింది. వరంగల్ దేశాయిపేటలోని ట్రిమ్‌విజన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటేడ్ ముందు వందల మంది బాధితులు బుధవారం సాయంత్రం ఆందోళనకు దిగే వరకు కూడా నిర్వాహకులు చేసిన మోసం బయటపడలేదు. ‘విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తాం.. నూరు శాతం ఉద్యోగం గ్యారంటీ.. దుబాయ్, అమెరికా ఏ దేశమైనా సరే ఉద్యోగానికి మాది భరోసా’ అని ట్రీమ్ విజన్ సంస్థ చేసిన ప్రకటనలకు మోసపోయిన నిరుద్యోగులు ఇప్పుడు లబోదిబో అంటున్నారు. వందలాది మంది నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి విదేశాలకు చెక్కేసిన నిర్వాహకుల తీరు నిరుద్యోగులను కంట తడి పెట్టిస్తోంది. రూ.20వేల నుంచి రూ.60వేల వరకు వరంగల్ దేశాయిపేటలో ట్రిమ్‌విజన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటేడ్ పేరిట మట్టెవాడకు చెందిన సీ.హెచ్.స్నేహలత కార్యాలయాన్ని తెరిచారు. దుబాయిలో ఉద్యోగం... రూ.వేలు, రూ.లక్షల్లో వేతనాలు అంటూ ఊరించి సుమారు 230 మంది నుంచి రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు అందినంత వసూలు చేశారు. స్థానికురాలే కావడంతో నగరానికి చెందిన పలువురు నమ్మి డబ్బు అప్పగించారు. గత ఎనిమిది నెలలుగా నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపి డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. డబ్బుతో పాటు అభ్యర్థుల అర్హత సర్టిఫికెట్లు, పాస్‌పోర్టులు, కూడా తీసుకున్నారు. ఇదిగో వీసా.. అదిగో వీసా అంటూ సుమారు ఆరు నెలలుగా నమ్మించి కాలయాపన చేశారు. ట్రీమ్ విజన్ సంస్థ కార్యాలయం చుట్టూ నిరుద్యోగులు చెప్పులరిగేలా తిరుగుతుండగా.. నిర్వాహకులు రూ.60 లక్షలతో దుబాయికి ఉడాయించినట్లు అందిన సమాచారంతో కార్యాలయం ఎదుట బుధవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. ఉన్న ఉద్యోగం వదిలి.. దుబాయిలో ఉద్యోగం వస్తుంది.. రేపో.. మాపో వీసా రానుందనే నమ్మకంతో పలువురు ఇక్కడ చేస్తున్న ఉద్యోగాలను కూడా వదిలేశారు. ఇప్పుడు నిర్వాహకులు బోర్డు తిప్పేసినట్లు తెలియడంతో బాధితులు కుటుంబ సభ్యులతో వచ్చి ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఇంతేజార్గంజ్ పోలీసులు రంగంలో దిగి బాధితులను శాంతింపచేశారు. అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. బాధితులు ఫిర్యాదు చేస్తే సంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశాం... ట్రీమ్ విజన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకులు సుమారు 230 మంది నుంచి రూ.60 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ఇందులో సుమారు 30 మందికి డబ్బు తిరిగి ఇచ్చినట్లు సమాచారం. మిగిలిన బాధితులు ఆందోళనకు దిగగా వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిర్వాహకురాలు సీహెచ్.స్నేహలతపై కేసు నమోదు చేశాం. దర్యాప్తు చేస్తున్నాం. – అశోక్‌కుమార్, ఇంతేజార్గంజ్ ఎస్సై -
ఉద్యోగాల వెల్లువ
ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను చేరువచేస్తామని, ఇందు కోసం గ్రామ సచివాలయాలను తీసుకొస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజున ప్రకటించారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున నియమిస్తామని, ప్రతి గ్రామ సచివాలయంలో పది మందికి ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. సీఎం ప్రకటనతో ఉద్యోగాలు వస్తాయని యువత, సంక్షేమ పథకాలు ఇంటివద్దకే వస్తాయని ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో: అవినీతికి తావులేకుండా, సిఫార్సులతో సంబంధం లేకుండా అర్హుల ఇంటికే సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరును నియమిస్తామని ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రకటించారు. అక్టోబర్ రెండో తేదీన గ్రామ సచివాలయాలను తీసుకొస్తామని, ఒక్కొక్క సచివాలయంలో పది మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రమాణస్వీకార వేదికపై తెలి పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన నిరుద్యోగ యువతలో ఉత్సాహం నింపింది. మరో వైపు అవినితికి, సిఫార్సులకు తావులేకుండా సంక్షేమ పథకాలు తమకు అందుతాయని ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగాల కల్పన ఇలా.. పంచాయతీరాజ్ ఇన్ఫర్మేటిక్ సిస్టం(ప్రిస్) సర్వే ప్రకారం జిల్లాలో 8,40,613 ఇళ్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. 8,23,237 ఇళ్లలో ప్రజలు నివసిస్తున్నారని తేల్చారు. ఈ లెక్క ప్రకారం ప్రతి 50 కుటుంబాలకు ఒకరి చొప్పున 16,465 మందికి వలంటీర్లుగా పనిచేసే అవకాశం కలుగుతుంది. వలంటీరుగా నెలకు రూ.5 వేల వేతనం అందుతుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి వలంటీర్ల నియామకం అమలులోకి రానుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటనతో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత సంతోషం వ్యక్తంచేస్తోంది. వేలాది మందికి ఉపాధి కలుగుతుందని పేర్కొంటున్నారు. గ్రామ సచివాలయాల్లో 10 మందికి అవకాశం గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాల ద్వారా పాలనలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ అమలులోకి వస్తుంది. గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ అవుతాయి. రేషన్ కార్డులు, పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే దిశగా గ్రామ పంచాయతీల నుంచి సుపరిపాలన అందనుంది. జిల్లాలో 1,029 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ లెక్కన ప్రతి పంచాయతీకి 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. అంటే 10,290 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉపాధి దక్కుతుంది. జిల్లాలో అక్టోబర్ రెండో తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 26,865 మంది చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సీఎం ప్రకటనతో యువతీ యువకులు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. స్వగ్రామంలోనే ఉద్యోగం చేసుకునే వీలు ఉంటుందని సంతోషిస్తున్నారు. 72 గంటల్లో సమస్యల పరిష్కారం దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే సమస్యలను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంపై ప్రజలు సంతోషం వ్యక్తంచేసుకున్నారు. రేషన్ కార్డులు, పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇలా అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసిన 72 రెండు గంటల్లోనే లబ్ధి చేకూరుతుందని, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎవరి సిఫార్సులూ అక్కర్లేదని చెప్పడంపై అభినందనలు కురిపిస్తున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తానని సీఎం చెప్పడంతో ప్రజల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. సంక్షేమం చేరువ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పరిసాలనలో మార్పులు తెచ్చేదిశగా అడుగులు వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువకానున్నాయి. పంచా యతీల్లో సుపరిపాలన సాకారం కానుంది.మా భవిష్యత్తు మారనుంది.– శివారెడ్డి,జంగమహేశ్వపురం, గురజాల మండలం వేలాది ఉద్యోగాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజన్న పాలన దిశగా అడుగులు వేస్తున్నారు. మ్యానిఫెస్టోను పవిత్ర గంథంగా భావించి ప్రమాణ స్వీకారం చేసిన రోజే, జిల్లాలో వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగించేలా, గ్రామ వలం టీర్లు, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, మాటతప్పని, మడమ తిప్పని నేతగా పేరు తెచ్చుకొంటున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తారన్న నమ్మకం ఉంది.– రాంబాబు, వెంగళాయపాళెం, గుంటూరు -
నిరుద్యోగులను బెదిరించడం దుర్మార్గం
సాక్షి, అమరావతి: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతోందంటూ కోతలు కోసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగాలు అడిగినందుకు నిరుద్యోగులను బెదిరించడం దుర్మార్గమని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ట్విటర్లో సీఎం ధోరణిని ఆయన తప్పుబట్టారు. ‘‘తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల కోసం ఏపీ ప్రభుత్వం తరుఫున భారీ ప్రకటనలు ఇచ్చారు. ఇళ్లు కట్టాం, పరిశ్రమలు పెట్టాం, అభివృద్ధిలో దూసుకుపోతున్నాం అని బాబు లేనిపోని కోతలు కోశారు. తిరుపతిలో గురువారం మా ఉద్యోగాలేవి అని అడిగిన డీఎస్సీ అభ్యర్థులతో ‘తమాషాగా ఉంది మీకు.. నిరుద్యోగుల ఒక్కరి కోసం పనిచేయడానికి సిద్ధంగా లేము.. తమాషా ఆటలు ఆడకండి.. బికేర్ ఫుల్’ అంటూ విరుచుకుపడ్డారు. ఎంతటి దుర్మార్గం?’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ వాయిదా
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: డీఎస్సీ–2018 పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం వాయిదా వేసింది. డిసెంబర్ ఆరో తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా గతంలో విడుదల చేసిన షెడ్యూల్లో మార్పులు చేసింది. డిసెంబర్ 24 నుంచి జనవరి 30వ వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా కొత్త షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. ఈ నెల 30న పోస్టు, సబ్జెక్ట్, సెషన్ల వారీగా కొత్త షెడ్యూల్‌ను వెబ్సైట్లో అధికారికంగా పొందుపరచనున్నారు. కాగా, షెడ్యూల్ చూసి డీఎస్సీ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 23 వేలకుపైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా కేవలం అందులో సుమారు మూడో వంతు అయిన 7,902 పోస్టులు మాత్రమే భర్తీచేసేలా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 6 లక్షల మంది పోటీపడుతున్నందున పోస్టుల సంఖ్య పెంచాలని అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ సమయంలో పోస్టులు పెంచకుండా ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్‌ను మార్చడంపై వారు మండిపడుతున్నారు. ఎస్జీటీ అభ్యర్థులకు రోజుకో షాక్ ప్రభుత్వం డీఎస్సీ–2018 అభ్యర్థులకు షాక్‌ల మీద షాకులను ఇస్తోంది. రెండేళ్లపాటు ఊరించి అభ్యర్థులను కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పింది. తీరా అరకొర పోస్టులతో అభ్యర్థులకు చుక్కలు చూపించింది. ప్రకటన వచ్చిన రోజు నుంచి ఏదో ఒక సాకుతో ఎస్జీటీ పోస్టుల్లో కోతలు విధిస్తోంది. ఇన్ని తక్కువ పోస్టులతో డీఎస్సీ విడుదల చేయడం కన్నా మానుకోవడమే మేలని అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు. ఎస్జీటీ పోస్టులు భారీగా ఖాళీలున్నా.. ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదంటూ కేవలం 4,221 పోస్టులను విడుదల చేసింది. పీఈటీల పోస్టులను పెంచే సాకుతో 250 ఎస్జీటీలను కోతపెట్టింది. తాజాగా డిప్యూటీ డీవైఈఓల నియామకం పేరుతో మరో 366 పోస్టులను తగ్గించడానికి రంగం సిద్ధం చేసింది. మరోవైపు ఈ డీఎస్సీలో బీఈడీలను అనుమతించడం, టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించడంతో పోటీ మరింత పెరిగింది. కంటితుడుపు చర్యలు వద్దు డీఎస్సీ రాయటానికి సమయం పెంచకపోయినా పర్లేదు.. పోస్టులు పెంచడం ముఖ్యం. పోస్టులు లేకుండా ఎన్ని కంటితుడుపు చర్యలు చేపట్టినా ఉపయోగం ఉండదు. పీఈటీలకు న్యాయం చేయాలనుకుంటే పోస్టుల సంఖ్య పెంచాల్సిందిపోయి మా కడుపు కొట్టడం అన్యాయం. పోస్టుల సంఖ్య పెంచకపోతే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి ఉంటుంది. – రాజేష్, ఎస్జీటీ అభ్యర్థి, కడప. ప్రమాదంలో ప్రాథమిక విద్య డీఎస్సీ ప్రకటించిన రోజు నుంచి దాదాపు 600 ఎస్జీటీ పోస్టులను ప్రభుత్వం కోత విధించింది. ఇలా చేయటంతో ఉపాధ్యాయుల కొరతతో ప్రాథమిక విద్య ప్రమాదంలో పడుతుంది. నగర శివార్లలో జనాభా పెరుగుతుండటంతో అక్కడ ప్రాథమిక పాఠశాలల సంఖ్య పెంచి ఎస్జీటీ పోస్టులను పెంచాలి. ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలంటే ఎస్జీటీ పోస్టులను పెంచాలి. – కొక్కెరగడ్డ సత్యం, రాష్ట్ర కార్యదర్శి, సెకండరీ గ్రేడ్ టీచర్ ఫెడరేషన్. బీఈడీ వారితో పోటీ పెరిగింది సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు కేవలం డీఎడ్ చేసిన వారికి మాత్రమే అవకాశం ఉండేది. కానీ తాజా ప్రకటనలో బీఈడీ చేసిన వారు, బీటెక్‌తో పాటు బీఈడీ చేసిన వారు కూడా రావటంతో గతంలో కంటే పోటీ దాదాపు ఎనిమిది రెట్లు పెరిగింది. ఇటువంటి సమయంలో పోస్టులను పెంచాల్సిన ప్రభుత్వం రోజురోజుకు పోస్టుల్లో కోతలు విధించడం అన్యాయం. ఇటువంటి నిర్ణయాలతో ఎస్జీటీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నాం. – ఆర్.శోభారాణి, ఎస్జీటీ అభ్యర్థి, కొత్తచెరువు, అనంతపురం జిల్లా -
నిరుద్యోగులతో బాబు తొండాట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఏళ్ల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న 6 లక్షల మంది నిరుద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలువునా వంచించారు. 23,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా, తీరా ఎన్నికల ముందు కేవలం 7,902 పోస్టుల భర్తీకి డీఎస్సీ–2018 నోటిఫికేషన్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ఇదేం అన్యాయం అని ప్రశ్నిస్తే ఆర్థిక శాఖ ఒప్పుకోవడం లేదంటూ కుంటిసాకులు చెబుతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరీక్షిస్తూ రూ.లక్షలు ఖర్చు చేసి, ఇన్నాళ్లూ కోచింగ్ తీసుకున్నామని, ఇప్పుడు కేవలం 7,902 పోస్టులనే భర్తీ చేస్తామంటూ ముఖ్యమంత్రి తమ నోట్లో మట్టి కొట్టారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 88,914 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని వారు గుర్తుచేస్తున్నారు. ఆర్థిక శాఖ అభ్యంతరాలను సైతం లెక్కచేయకుండా నిరుద్యోగులకు భవిష్యత్తును దృష్టి పెట్టుకుని దృఢమైన నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. నిరుద్యోగులకు వైఎస్సార్ అభయం 2004 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులను మభ్యపెడుతూ 2003 నవంబరు 13న 16,449 పోస్టులతో డీఎస్సీని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఆయన చిత్తుచిత్తుగా ఓడిపోయారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డీఎస్సీ–2003 ప్రక్రియను సకాలంలో పూర్తి చేశారు. ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇప్పించారు. అనంతరం 2006లో మరో డీఎస్సీని ప్రకటించారు. 20,193 పోస్టులతో 2006 మే 30న ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎంపిక ప్రక్రియను దిగ్విజయంగా పూర్తిచేశారు. అది ముగిసిన వెంటనే 2008లో మెగా డీఎస్సీకి ఆదేశాలు ఇచ్చారు. ఆర్థిక శాఖ 30,000 పోస్టులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అప్పటికే సక్సెస్ స్కూళ్లను, ప్రత్యేక స్కూళ్లను ప్రారంభించినందున, అదనంగా టీచర్ పోస్టులు అవసరమని, మరిన్ని పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారులకు సూచించారు. అయితే, బడ్జెట్ పరిమితుల దృష్ట్యా 30,000 పోస్టులనే భర్తీ చేయగలమని, అదనపు పోస్టులకు అనుమతులు కష్టమని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. నిధుల సంగతి తాను చూసుకుంటానని, నిరుద్యోగులకు మేలు కలిగేలా 50,000కు తగ్గకుండా టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాలని వైఎస్ రాజశేఖరరెడ్డి తేల్చిచెప్పారు. 2008 డిసెంబర్ 6న 52,272 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఈ డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చారు. డీఎస్సీలో ఎంపికై, పోస్టులు ఖాళీ లేక నియామకం కాని వారికి హామీ పత్రాలు జారీ చేశారు. అనంతరం రిటైరైన వారి పోస్టులతోపాటు కొత్త పోస్టులను మంజూరు చేయించి మరీ వారిని టీచర్ కొలువుల్లో నియమించారు. ఫలితంగా వేలాది మంది నిరుద్యోగులు లబ్ధి పొందారు. గరిష్ట వయో పరిమితి అంతకు ముందు వరకు 33 ఏళ్లు మాత్రమే ఉండగా, ముఖ్యమంత్రిగా వైఎస్సార్ దాన్ని ఓసీలకు 39 ఏళ్లకు, బీసీలకు 44 ఏళ్లకు, ఎస్సీ, ఎస్టీలకు 44 ఏళ్లకు, దివ్యాంగులకు 49 ఏళ్లకు పెంచారు. పైగా వయోపరిమితి దాటిపోతున్న వారు ఈ డీఎస్సీలో హామీ పత్రాలు పొందడం ద్వారా తరువాతి కాలంలో నిర్ణీత వయసుతో సంబంధం లేకుండానే ఉపాధ్యాయ పోస్టుల్లో నియమితులయ్యారు. ఆర్థిక శాఖపై చంద్రబాబు ఒత్తిడి తాము అధికారంలోకి వస్తే ప్రతిఏటా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. గద్దెనెక్కాక నాలుగున్నరేళ్లుగా ఆ మాటే మర్చిపోయారు. చివరకు ఎన్నికల ముందు కేవలం 7,902 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్రంలో 22,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గతేడాది స్వయంగా ప్రకటించారు. కానీ, కేవలం 12,370 పోస్టుల భర్తీకి డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేశారు. తరువాత 14,300 పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావడంతో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. కానీ, భర్తీ చేయాల్సిన టీచర్ పోస్టుల సంఖ్యను టీడీపీ ప్రభుత్వం అనూహ్యంగా 10,351కి కుదించింది. ఆ మేరకే ఆర్థిక శాఖ అనుమతులున్నాయని మంత్రి గంటా చెప్పారు. రెండోసారి డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి మేరకు ఆర్థిక శాఖ కొత్త కొర్రీలు వేసింది. పోస్టుల సంఖ్యను 7,729కి కుదించింది. గతంలో ప్రత్యేక డీఎస్సీలో మిగిలిపోయిన 173 ఉర్దూ పోస్టులను కూడా కలిపి మొత్తం 7,902 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. బాబు పాలనలో అంతేమరి ఆర్థిక శాఖ కాదన్నా వైఎస్ రాజశేఖరరెడ్డి మెగా డీఎస్సీ సహా తన హయాంలో 88,914కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేశారు. రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ చంద్రబాబు అందులో మూడోవంతు పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. 2014లో ప్రకటించిన డీఎస్సీకి అంతకు ముందు కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. అప్పట్లో తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలతో నోటిఫికేషన్ నిలిచిపోగా 2014లో వెలువరించారు. ఆ డీఎస్సీని వేయడం ఇష్టంలేని చంద్రబాబు మూడేళ్లపాటు నాన్చి 2016 చివర్లో గానీ పూర్తి చేయించలేదని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. విద్యావాలంటీర్ల సృష్టికర్త చంద్రబాబే విద్యారంగంలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయులను నియమించకుండా విద్యా వాలంటీర్లను నియమించి ఆ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ఘనత చంద్రబాబుదే. అప్పటివరకు లేని ఈ విద్యా వాలంటీర్ల వ్యవస్థను సృష్టించి నిరుద్యోగులను దగా చేశారు. 2002లో 8,954 మంది విద్యావాలంటీర్లను నియమించారు. వారికి అత్యల్పంగా రూ.1,000 నుంచి రూ.2,000 వరకు మాత్రమే వేతనం ఇచ్చారు. రాష్ట్రంలో మళ్లీ ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొంది. నేడు మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి ముట్టడి అవనిగడ్డ: డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులను పెంచాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని సోమవారం ముట్టడించనున్నట్లు డీఎస్సీ జేఏసీ నేతలు సీహెచ్ రాంబాబు, గోవింద్, గౌరినాయుడు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 23,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేవలం 7,902 పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని ధ్వజమెత్తారు. పోస్టుల సంఖ్య పెంచాలని ఇటీవల అవనిగడ్డ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో నిరుద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తే కనీసం సమాధానం చెప్పకుండా పోలీసులతో బలవంతంగా పలు పోలీసుస్టేషన్లకు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. సిలబస్ పెంచి, తక్కువ సమయం ఇవ్వడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారని, గడువు పెంచాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులు పెద్ద ఎత్తున హాజరై మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని, మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
డీఎస్సీ అభ్యర్థులకు సర్కార్ షాక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వ చర్యలు షాక్ ఇస్తున్నాయి. సుదీర్ఘకాలం నిరీక్షణ తర్వాత 7,729 పోస్టులతో వెలువడిన డీఎస్సీ–2018లో సవాలక్ష నిబంధనలు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. డీఎస్సీ ముందుకు వెళ్లకుండా న్యాయవివాదాల్లో చిక్కుకునేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రితో డీఎస్సీ దరఖాస్తు గడువు ముగియగా మొత్తం 6,26,791 మంది ఒక్కో పేపర్‌కు రూ.500 చొప్పున రూ.31.33 కోట్ల ఫీజు చెల్లించారు. ఎస్జీటీ పోస్టులకు టెట్ కమ్ టీఆర్టీ, ఇతర పోస్టులకు డీఎస్సీ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 6 నుంచి కేటగిరీల వారీగా ఇవి ప్రారంభమవుతాయి. ఫీజులు కట్టించుకున్నాక తిరకాసు షరతులు పోస్టులు తక్కువగా ఉండడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అభ్యర్ధులు తమ సొంత జిల్లాలోని స్థానిక కోటాతోపాటు నాన్ లోకల్ కింద ఇతర జిల్లాల్లో పోస్టులకూ పరీక్ష రాయడానికి వేర్వేరుగా ఫీజులు చెల్లించి దరఖాస్తు చేశారు. వీటిని పాఠశాల విద్యాశాఖ కూడా ఆమోదించింది. తీరా దరఖాస్తు గడువు ముగిశాక ప్రభుత్వం కొత్త షరతులు పెట్టింది. ఫీజు ఎన్నిసార్లు చెల్లించినా ఏ కేటగిరీలోనైనా ఒక్కసారి మాత్రమే పరీక్ష రాయాలని మెలికపెడుతోంది. అభ్యర్థులు ఫీజులు చెల్లించిన మేరకు వేర్వేరు హాల్‌టిక్కెట్లు ఇచ్చినా ఒక్క పరీక్షకు మాత్రమే అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. పరీక్ష రాసేది తన సొంత జిల్లా పోస్టుకా.. లేక ఇతర జిల్లాలోని పోస్టుకా అనేది నిర్ణయించుకొని ఒక్క పరీక్ష మాత్రమే రాయాలని పేర్కొంటున్నారు. ఈ నిబంధనను నోటిఫికేషన్లో పెట్టలేదని, తీరా తాము ఫీజులు చెల్లించాక పరీక్ష రాయడానికి వీల్లేదని చెప్పడమేమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. పరీక్షలకు అనుమతిపై అధికారులను సంప్రదిస్తే.. ఫీజులు వసూలు చేసినందున హాల్‌టిక్కెట్లు ఇవ్వకుంటే చిక్కులు వస్తాయని, అందుకే వాటిని మాత్రమే ఇచ్చి పరీక్షకు మాత్రం అనుమతించబోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాల్‌టిక్కెట్లు ఇచ్చాక పరీక్షకు అనుమతించకపోయినా ఎవరో ఒకరితో కోర్టులో కేసు వేయించి డీఎస్సీ నిలిచిపోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని ధ్వజమెత్తుతున్నారు. మూడేళ్లుగా డీఎస్సీ కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకున్నామని, తాము స్థానిక, స్థానికేతర కోటాలో ఫీజులు కట్టినా పరీక్షలు రాసుకోవడానికి అనుమతించకపోవడం దారుణమని వాపోతున్నారు. తెలంగాణ డీఎస్సీలో ఇలా.. తెలంగాణలో ఇటీవలే డీఎస్సీని నిర్వహించారు. అభ్యర్థి దరఖాస్తు చేసుకునేటప్పుడే స్థానిక జిల్లాతోపాటు నాన్ లోకల్ కోటా కింద ఇతర జిల్లాలకు వరుస క్రమంలో ఆప్షన్ ఇచ్చుకునేలా అవకాశం కల్పించారు. అభ్యర్థులు ఏ కేటగిరీలో అయినా ఒకే ఫీజు చెల్లించి ఒకే పరీక్ష రాస్తే చాలు. ఆపరీక్ష ప్రతిభను అనుసరించి స్థానిక కోటా కింద సొంత జిల్లాలో లేదా స్థానికేతర కోటాలో ఇతర జిల్లాలో పోస్టును దక్కించుకునేలా వెసులుబాటు ఇచ్చారు. తెలంగాణ డీఎస్సీలో స్థానికేతర కోటాలో ఏపీ అభ్యర్థులకు అక్కడి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏపీ ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది. ఏపీ డీఎస్సీలో స్థానికేతర కోటాలో తెలంగాణ అభ్యర్థులకు అవకాశం లేదని ముందు తిరస్కరించారు. చివరలో కోర్టు ఆదేశాలతో అనుమతించారు. దీంతో తెలంగాణ అభ్యర్థులతోపాటు అక్కడ స్థిరపడిన వేలాదిమంది సీమాంధ్ర నిరుద్యోగులు దరఖాస్తు చేయలేకపోయారు. -
ఉద్యోగాల పేరుతో మోసం..
ప్రొద్దుటూరు క్రైం(వైఎస్సార్‌కడప): ఉద్యోగాలు వస్తాయనే ఆశతో పెద్ద పెద్ద చదువులు చదివారు.. ఒక్కో ఇంట్లో ఇంజినీరింగ్ చదివిన వారు ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు.. 10, ఇంటర్ అర్హత కలిగిన ఉద్యోగాలకు బీటెక్, ఎంటెక్ చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు.. ఉన్నత చదువులు చదివి వేలాది మంది యువకులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.. చిన్న ప్రైవేట్ ఉద్యోగమైనా దొరికితే చాలనుకునే ఇలాంటి నిరుద్యోగుల ఆశలను, అవకాశాలను కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసుకొని ఉడాయిస్తున్నారు. నిరుద్యోగులు మోసపోయిన సంఘటనలు ఇటీవల జిల్లాలో అనేకం చోటు చేసుకున్నాయి. ఉద్యోగాల కోసం డబ్బు చెల్లించిన యువకులు వారు మోసపోయామని గ్రహించడానికి నెలలు, ఏళ్లు పడుతోంది. ఈ లోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. మోసగాళ్లపై కేసులు నమోదవుతున్నా ఫలితం లేదనే చెప్పాలి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడే ఇలాంటి మోసగాళ్లను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో పలువురు నిరుద్యోగులు మోసపోయిన సంఘటనలు ∙కొండాపురం మండలంలో రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇద్దరు నిరుద్యోగులను మోసం చేశారు. ఒక్కో వ్యక్తి వద్ద రూ.6 లక్షలు వసూలు చేసి వాళ్లిద్దరూ ఉడాయించారు. కొండాపురం, సింహాద్రిపురం మండలంలోని పలువురు యువకులు అతనికి డబ్బు ఇచ్చి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఈ సంఘటనపై కేసులు నమోదైనా బాధితులకు మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదనే చెప్పాలి. ∙కొన్ని రోజుల క్రితం నందలూరులోని ఆల్విన్ ఫ్యాక్టరీ స్థలంలో సోలార్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారని కడపకు చెందిన వ్యక్తి బాగా ప్రచారం చేశాడు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు తన వద్ద ఉన్నాయని చెప్పి దరఖాస్తు ఫారం రూ.100గా నిర్ణయించాడు. ఈ ఫ్యాక్టరీలో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పడంతో కడపతో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన యువకులు నిరుద్యోగులు అతని వద్ద దరఖాస్తు ఫారాలు తీసుకొని వెళ్లారు. అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదని, మోసపోయామని గ్రహించిన కొందరు నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ∙కొన్ని నెలల క్రితం ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తులు స్థానికుల సాయంతో ప్రొద్దుటూరులో ఆఫీసు ఏర్పాటు చేసుకున్నారు. దుబాయ్, మస్కట్, ఖతార్ తదితర ప్రాంతాల్లోని కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని బాగా ప్రచారం చేశారు. ఒక్కో వ్యక్తి వద్ద నుంచి సుమారు రూ. 50 వేలు వసూలు చేసుకున్నారు. వారి పాస్‌పోర్టులను కూడా తీసుకొని రాత్రికి రాత్రే ఉడాయించారు. సుమారు 40 మందికి పైగా మోసపోయారు. బాధితులు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ∙తాజాగా ప్రొద్దుటూరులో సుమారు 150 మంది యువకులు ఉద్యోగాల కోసం డబ్బు ఇచ్చి మోసపోయారు. వీరు ఏడాది క్రితం ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులకు రూ. 50 వేలు చొప్పున చెల్లించారు. ఆస్ట్రేలియాలోని ప్రముఖ కంపెనీలో ప్యాకింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని, జీతం కూడా సుమారు రూ.1.20 లక్షలు దాకా ఉంటుందని చెప్పడంతో డబ్బు కట్టారు. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, వేంపల్లి, ఖాజీపేట, గోపవరంతో పాటు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువకులు డబ్బు చెల్లించారు. వీరిలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివిన వారు కూడా ఉన్నారు. ఆస్ట్రేలియాకు ఎప్పుడు పంపిస్తారని ఐదు నెలల నుంచి అడుగుతున్నా వారు ఒకరిపై మరొకరు చెప్పుకుంటూ వచ్చారు. ఇటీవల ముగ్గురి ఫోన్లు కూడా పని చేయకపోవడంతో టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల్లో ఒకరైన పాతకడప రెడ్డయ్య ఫిర్యాదు మేరకు శ్రీనివాసనగర్‌కు చెందిన హెచ్ఎం బాషా, నాగరాజు, నాగేంద్రకుమార్‌లపై చీటింగ్ కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ మధుమళ్లేశ్వరరెడ్డి తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామన్నారు. -
విదేశీ మోజులో మరో మోసం
విదేశీ మోజులో తెలుగు రాష్ట్రాలకు చెందిన తొమ్మిది మంది నిరుద్యోగులు మోసపోయిన ఘటన బుధవారం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. ఎయిర్పోర్ట్ సీఐ మళ్ల శేషు తెలిపిన వివరాల ప్రకారం.. సాక్షి, ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ) : తెలంగాణ రాష్ట్రం కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాష్ట్రంలోని నెల్లూరుకు చెందిన 9 మంది యువకులు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరంతా సింగపూర్‌లో ఆల్ఫిన్ బిల్డర్స్ కనస్ట్రక్షన్ పీటీఈ లిమిటెడ్‌లో ఉద్యోగాలొచ్చాయంటూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. విజిటింగ్‌పై విశాఖ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఆసియా విమానంలో కౌలలాంపూర్‌కు వెళ్లి, అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు బయలుదేరారు. అయితే బోర్డింగ్ పూర్తయిన తరువాత వీరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేశారు. వర్క్ ఆర్డర్‌పై తొమ్మిది మందికి ఒకే నంబర్ ఉండడంతో అనుమానం వచ్చి పరిశీలించారు. ఒక్కో వ్యక్తికి వేర్వేరు వర్క్ ఆర్డర్ నంబర్ ఉండాలి. అందరికి ఒకే నంబర్ ఉండడంతో 9 మందిని అదుపులోకి తీసుకున్నా రు. వీరిని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించా రు. ఈ ఘటనతో నిరుద్యోగులు ఖంగుతిన్నారు. తామంతా మోసపోయామని లబోదిబోమన్నా రు. బాధితులను 6 గురు సబ్ ఏజెంట్లు మోసగించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తు తం ఏజెంట్ల ఫోన్లు స్విచ్ఛాప్ చేసి ఉన్నాయి. సీహెచ్ శ్రీనివాస్ అనే ఏజెంట్‌కు నరేష్, ప్రసాద్‌లు రూ.80 వేల చొప్పున ముట్టజెప్పారు. శంకర్ అనే ఏజెంట్‌కు తెడ్డు గంగాధర్ రూ.70 వేలు, రాజేష్‌కు కాశీమని శ్రీనివాస్, అలువల మల్లేష్లు రూ.70 వేల చొప్పున ఇచ్చారు. ఏజెంట్ మురళీకి యర్ల శ్రీను 65 వేలు, ఏజెంట్ పోతన్నకు దేవల గంగాధర్ రెడ్డి, షేక్ సైదుళ్ల రూ.65 వేలు, ఏజెంట్ ఝాన్సీకి దత్తరావు రూ.65 వేలు సమర్పించుకుని మోసపోయారు. కాగా.. సింగపూర్‌లో ఆల్ఫిన్ బిల్డర్స్ సంస్థ లేదని ప్రాథమికంగా తేలింది. దీనిపై ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిరుద్యోగులకు కౌనెల్సింగ్ బాధితులకు సీఐ మళ్ల శేషు కౌన్సెలింగ్ ఇచ్చారు. విదేశీ ఉద్యోగాల మోజులో చాలా మంది మోసపోతున్నారని తెలిపారు. సరైన అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. అయితే వేర్వేరు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు వేర్వేరు ఏజెంట్ల ద్వారా వచ్చినా.. వర్క్ ఆర్డర్ మాత్రం ఒకే వ్యక్తి వద్ద నుంచి వచ్చినట్టు గుర్తించామన్నారు. ఈ మోసానికి మూలమైన ఏజెంట్‌ను పట్టుకుంటామని విలేకరులకు తెలిపారు. -
మళ్లీ జాబ్‌మేళాలకు సిద్ధమైన జీహెచ్ఎంసీ
సాక్షి, సిటీబ్యూరో: నిరుద్యోగులకు ఆశలు కల్పిస్తూ భారీ ఎత్తున ‘జాబ్‌మేళా’ నిర్వహించేందుకు గ్రేటర్ అధికారులకు నడుంబిగించారు. అయితే ఈ మేళాలకు నిరుద్యోగుల నుంచి వచ్చిన స్పందన అంతంత మాత్రమే.. గడచిన రెండేళ్లలో ఎంతో అట్టహాస ఆర్భాటాలతో జాబ్‌మేళాలు నిర్వహించాం, పెద్ద ఎత్తున స్పందన లభించిందని బల్దియా చెబుతున్నా మేళాలో ఎంపికైన వారు మాత్రం ఉద్యోగాల్లో చేరడంలో ఆసక్తి చూపలేదు. తరువాత చర్యలు తీసుకోవడంలో కూడా అధికారులు విఫలమయ్యారనే చెప్పవచ్చు. మొక్కుబడిగా నిర్వహణ జీహెచ్ఎంసీ అధికారులు మొక్కుబడి తంతుగా జోన్ల వారీగా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నారు. స్వయం సహాయక మహిళాసంఘాలు, మీడియా తదితర మార్గాల ద్వారా భారీ ప్రచారం కల్పిస్తున్నారు. ఉద్యోగాలనగానే యువత భారీయెత్తున హాజరైనప్పటికీ, ఉద్యోగాల్లో చేరకుండా వెనకడుగు వేస్తున్నారు. అందుకు కారణం అన్నీ ప్రైవే టు కంపెనీలవి కావడం.. ఎంతకాలముంటాయో తెలియకపోవడం.. తాము ఆశించే పని ఉండకపోవడం.. ఆకర్షణీయమైన వేతనం కూడా లేకపోవడం తదితర కారణాలున్నాయి.మరికొందరు మాత్రం దూరాభారం వల్ల వాటిల్లో చేరడం లేదు.అయితే జీహెచ్ఎంసీ మాత్రం ఎందుకు, ఏమిటి అనేవి ఆలోచించడం లేదు. నిరాసక్తత జాబ్‌మేళాల ద్వారా ఏటా కనీసం మూడువేలమందికి ఉపాధి కల్పించాలనేది జీహెచ్ఎంసీ లక్ష్యం. జాబ్‌మేళాలకు 2016–17లో భారీయెత్తున (23,328 మంది)హాజరైనప్పటికీ, వారిలో 5,039 మంది మాత్రం వివిధ ఉద్యోగాలకు ఎంపి కయ్యారు. అందులోనూ కేవలం 646 మంది మా త్రమే ఉద్యోగాల్లో చేరారు. ఆ తర్వాత ఎంత కాలం వారు పనిచేశారన్నది మాత్రం తెలియదు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన జాబ్‌మేళాకు కేవలం 6,241 మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో 2,483 మంది ఎంపిక కాగా, 670 మంది మాత్రం ఆయా ఉద్యోగాల్లో చేరారు. ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నా.. 2016–17లో మొత్తం 89 సంస్థలు జాబ్‌మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఇంటర్వ్యూలు నిర్వహించిన వాటిల్లో ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్, హెరిటేజ్ ఫుడ్స్, ఇన్నోవ్ సోర్స్, శుభగృహ ఇన్ఫ్రా, టీబీఎస్ఎస్, ఐక్యాగ్లోబల్, కార్పొన్ ఔట్సోర్సింగ్, జీ4ఎస్, అపోలో ఫార్మసీ, ఫ్లిప్‌కార్ట్, యురేకా ఫోర్బ్స్, వాల్‌మార్ట్, టీమ్‌లీజ్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, కార్వి, వీటీఐ, జస్ట్‌డయల్, టీమ్‌లీజ్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్నెట్, టాటా ఏఐఏ, డొమినో పిజ్జా మెర్లిన్ సొల్యూషన్స్వంటివి ఉన్నాయి. 2017–18లో 67 సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. వాటిల్లో హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీస్, లాట్ మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, కంట్రీక్లబ్, అక్వాఫిట్, బిగ్ మొబైల్స్, స్విగ్గీ, పవన్మోటార్స్, కాఫీడే, టెక్‌మహీంద్ర, వరుణ్ మోటార్స్, బిగ్‌బాస్కెట్, వొడాఫోన్, కోటక్ మహీంద్ర బ్యాంక్, యాక్ట్ ఫైబర్, హెటరో ల్యాబ్స్ లిమిటెడ్ తదితరమైనవి ఉన్నాయి. పేరెన్నికగన్న ప్రముఖ సంస్థలున్నప్పటికీ, వారికి అర్హమైన వారు లేకపోవడం.. అర్హత పొందినవారికి ఆశించిన వేతనాలు లేకపోవడంతో చాలాకొద్దిమంది మాత్రమే జాబ్‌మేళాల ద్వారా ఉద్యోగాల్లో చేరారు. ఈ నెల 25 నుంచి వచ్చేనెల 12 వరకు.. ఈనెల 25వ తేదీ నుంచి జూన్ 12 వరకు ఆయా తేదీల్లో, ఆయా జోన్లలో జాబ్‌మేళాలు నిర్వహించనున్నారు. ఏ జోన్లో ఏరోజు జాబ్‌మేళా జరిగేది వివరాలిలా ఉన్నాయి. జోన్ జాబ్‌మేళా తేదీ ఎల్బీనగర్ జోన్ 25.05. 2018 సికింద్రాబాద్ జోన్ 28.05.2018 కూకట్పల్లి జోన్ 30.05.2018 ఖైరతాబాద్ జోన్ 04.06.2018 శేరిలింగంపల్లి జోన్ 08.06.2018 చార్మినార్ జోన్ 12.06.2018 -
నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ
ఖమ్మం మయూరిసెంటర్: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగులకు ఉచిత నైపు ణ్య శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించడం జరుగుతు ందని, ఈ శిక్షణ పొందేందుకు సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన యువతీ, యువకులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల సహకార సంఘం లిమిటెడ్ కార్యనిర్వాహక సంచాలకులు సత్యనారాయణశర్మ ఓ ప్రకటనలో తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ష్ట్రక్షన్ హైదరాబాద్‌కు చెందిన వారు హైదరాబాద్ కేంద్రంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మూడు నెలల పాటు ఇచ్చే ఈ శిక్షణలో అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు ఉచిత వసతి కల్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ లోగా దరఖాస్తులను సంక్షేమ భవనంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందించాలన్నారు. వివరాలకు 85007 27916ను సంప్రదించాలన్నారు. జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో.. ఖమ్మంస్పోర్ట్స్: ప్రధానమంత్రి కౌశల్ యోజన కింద ప్రముఖ శిక్షణ కేంద్రాల్లో ఆయా కోర్సుల్లో ఈ నెల 17న నగరంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో ఆసక్తి కలిగిన నిరుద్యోగులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ ఓ ప్రకటనలో తెలిపారు. డోమాస్ట్రిక్ డేటా ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ అసోసియేటెడ్ , వెబ్ డెవలపర్స్, అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైలర్, డేటాబేస్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు కనీసం అయిదో తరగతి నుంచి ఐటీఐ డిప్లామా, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ కోర్సులు పూర్తి చేసి ఉండాలన్నారు. ఈ నెల 17న ఉద యం 8గంటలకు జరిగే మేళాకు హాజరు కావాలన్నారు. శిక్షణ సమయంలో రవాణ భత్యం కింద రూ. వెయ్యి, శిక్షణ పూర్తి చేసిన యువకులకు నెల పాటు ఉచితంగా రూ.1500 చొప్పున చెల్లిస్తారన్నారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికెట్‌ను శిక్షణ పొందిన వారికి అందజేస్తామన్నారు. అంతేగాక ప్రధానమంతి కౌశల్ యోజన కింద రుణాలు అందిస్తామని తెలిపారు. వివరాలకు 79979 73329 నంబర్‌కు సంప్రదించాలన్నారు. -
‘నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకోవాలి’
సాక్షి, విజయవాడ: ఎన్నికల్లో గెలవడం కోసం సీఎం చంద్రబాబా నాయుడు అప్పట్లో చాలా హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో నిరుద్యోగ భృతి కూడా ఒక్కటి. ఆ నిరుద్యోగ భృతి హామీని టీడీపీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని బీజేపీ నేతలు చిన్నపురెడ్డి, రవీంద్ర రెడ్డి, రమేష్ నాయుడులు సూచించారు. వారు బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. వయసుతో సంబంధం లేకుంగా ప్రతి ఒక్కరికి 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో 34 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా ఉన్నారని అన్నారు. ఉపాధి అవకాశాలు లేక చాలామంది నిరుద్యోగులు ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారు తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో నిరుద్యోగ భృతి ప్రకటించాలని కోరారు. ఆలస్యం చేస్తే నిరుద్యోగుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్ష 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంలో ఏపీపీఎస్సీ పూర్తిగా విఫలమైందని బీజేపీ నేతలు విమర్శించారు. -
శిక్షణతో శక్తిమంతం
మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం (చిలకలపూడి) : యువతను శక్తిమంతులను చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో కృష్ణా యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చంద్రన్న జాబ్ మేళా-2016కు ఎంపికైన విద్యార్థులకు నియామక పత్రాలను ఆదివారం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు నైపుణ్యతపై శిక్షణ పొంది ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తమ పదవులను త్యాగం చేసైనా సరే బందరు పోర్టును తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ యువతలో నైపుణ్యం ఉంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. జెడ్పీ చైర్ పర్సన్ గద్దె అనూరాధ యువత ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. యూనివర్శిటీ వైస్ చాన్సలర్ సుంకరి రామకృష్ణారావు మాట్లాడుతూ త్వరలో యూనివర్సిటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ బాలురు, బాలికల ఆటల పోటీలు నిర్వహించనున్నామని వివరించారు. విద్యార్థులు వీఎన్వీ భవానీ, ఎస్. రామయ్య, మౌనిక మాట్లాడుతూ శిక్షణ తమకు ఎంతగానో ఉపయోగపడిందన్నారు. మచిలీపట్నం మునిసిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, యూనివర్సిటీ రిజిష్ట్రార్ డి. సూర్యచంద్రరావు, క్యాంపస్ ప్రిన్సిపాల్ వైకే సుందరకృష్ణ, ప్లేస్మెంట్ ఆఫీసర్ డి. రామశేఖరరెడ్డి పాల్గొన్నారు. అనంతరం చంద్రన్న జాబ్ మేళాలో ఎంపికైన 214 మంది విద్యార్ధులకు మంత్రి చేతల మీదుగా నియామక పత్రాలు అందజేశారు.