డీఎస్సీ అభ్యర్థులకు సర్కార్‌ షాక్‌ | State Govt Shock for DSC candidates | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అభ్యర్థులకు సర్కార్‌ షాక్‌

Published Tue, Nov 20 2018 4:55 AM | Last Updated on Tue, Nov 20 2018 4:55 AM

State Govt Shock for DSC candidates - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వ చర్యలు షాక్‌ ఇస్తున్నాయి. సుదీర్ఘకాలం నిరీక్షణ తర్వాత 7,729 పోస్టులతో వెలువడిన డీఎస్సీ–2018లో సవాలక్ష నిబంధనలు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. డీఎస్సీ ముందుకు వెళ్లకుండా న్యాయవివాదాల్లో చిక్కుకునేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రితో డీఎస్సీ దరఖాస్తు గడువు ముగియగా మొత్తం 6,26,791 మంది ఒక్కో పేపర్‌కు రూ.500 చొప్పున రూ.31.33 కోట్ల ఫీజు చెల్లించారు. ఎస్జీటీ పోస్టులకు టెట్‌ కమ్‌ టీఆర్టీ, ఇతర పోస్టులకు డీఎస్సీ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 6 నుంచి కేటగిరీల వారీగా ఇవి ప్రారంభమవుతాయి. 

ఫీజులు కట్టించుకున్నాక తిరకాసు షరతులు
పోస్టులు తక్కువగా ఉండడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అభ్యర్ధులు తమ సొంత జిల్లాలోని స్థానిక కోటాతోపాటు నాన్‌ లోకల్‌ కింద ఇతర జిల్లాల్లో పోస్టులకూ పరీక్ష రాయడానికి వేర్వేరుగా ఫీజులు చెల్లించి దరఖాస్తు చేశారు. వీటిని పాఠశాల విద్యాశాఖ కూడా ఆమోదించింది. తీరా దరఖాస్తు గడువు ముగిశాక ప్రభుత్వం కొత్త షరతులు పెట్టింది. ఫీజు ఎన్నిసార్లు చెల్లించినా ఏ కేటగిరీలోనైనా ఒక్కసారి మాత్రమే పరీక్ష రాయాలని మెలికపెడుతోంది. అభ్యర్థులు ఫీజులు చెల్లించిన మేరకు వేర్వేరు హాల్‌టిక్కెట్లు ఇచ్చినా ఒక్క పరీక్షకు మాత్రమే అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. పరీక్ష రాసేది తన సొంత జిల్లా పోస్టుకా.. లేక ఇతర జిల్లాలోని పోస్టుకా అనేది నిర్ణయించుకొని ఒక్క పరీక్ష మాత్రమే రాయాలని పేర్కొంటున్నారు.

ఈ నిబంధనను నోటిఫికేషన్‌లో పెట్టలేదని, తీరా తాము ఫీజులు చెల్లించాక పరీక్ష రాయడానికి వీల్లేదని చెప్పడమేమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. పరీక్షలకు అనుమతిపై అధికారులను సంప్రదిస్తే.. ఫీజులు వసూలు చేసినందున హాల్‌టిక్కెట్లు ఇవ్వకుంటే చిక్కులు వస్తాయని, అందుకే వాటిని మాత్రమే ఇచ్చి పరీక్షకు మాత్రం అనుమతించబోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాల్‌టిక్కెట్లు ఇచ్చాక పరీక్షకు అనుమతించకపోయినా ఎవరో ఒకరితో కోర్టులో కేసు వేయించి డీఎస్సీ నిలిచిపోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని ధ్వజమెత్తుతున్నారు. మూడేళ్లుగా డీఎస్సీ కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్‌ తీసుకున్నామని, తాము స్థానిక, స్థానికేతర కోటాలో ఫీజులు కట్టినా పరీక్షలు రాసుకోవడానికి అనుమతించకపోవడం దారుణమని వాపోతున్నారు.

తెలంగాణ డీఎస్సీలో ఇలా..
తెలంగాణలో ఇటీవలే డీఎస్సీని నిర్వహించారు. అభ్యర్థి దరఖాస్తు చేసుకునేటప్పుడే స్థానిక జిల్లాతోపాటు నాన్‌ లోకల్‌ కోటా కింద ఇతర జిల్లాలకు వరుస క్రమంలో ఆప్షన్‌ ఇచ్చుకునేలా అవకాశం కల్పించారు. అభ్యర్థులు ఏ కేటగిరీలో అయినా ఒకే ఫీజు చెల్లించి ఒకే పరీక్ష రాస్తే చాలు. ఆపరీక్ష ప్రతిభను అనుసరించి స్థానిక కోటా కింద సొంత జిల్లాలో లేదా స్థానికేతర కోటాలో ఇతర జిల్లాలో పోస్టును దక్కించుకునేలా వెసులుబాటు ఇచ్చారు. తెలంగాణ డీఎస్సీలో స్థానికేతర కోటాలో ఏపీ అభ్యర్థులకు అక్కడి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏపీ ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది. ఏపీ డీఎస్సీలో స్థానికేతర కోటాలో తెలంగాణ అభ్యర్థులకు అవకాశం లేదని ముందు తిరస్కరించారు. చివరలో కోర్టు ఆదేశాలతో అనుమతించారు. దీంతో తెలంగాణ అభ్యర్థులతోపాటు అక్కడ స్థిరపడిన వేలాదిమంది సీమాంధ్ర నిరుద్యోగులు దరఖాస్తు చేయలేకపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement