సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: డీఎస్సీ–2018 పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం వాయిదా వేసింది. డిసెంబర్ ఆరో తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌లో మార్పులు చేసింది. డిసెంబర్ 24 నుంచి జనవరి 30వ వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా కొత్త షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. ఈ నెల 30న పోస్టు, సబ్జెక్ట్, సెషన్ల వారీగా కొత్త షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో అధికారికంగా పొందుపరచనున్నారు. కాగా, షెడ్యూల్ చూసి డీఎస్సీ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 23 వేలకుపైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా కేవలం అందులో సుమారు మూడో వంతు అయిన 7,902 పోస్టులు మాత్రమే భర్తీచేసేలా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 6 లక్షల మంది పోటీపడుతున్నందున పోస్టుల సంఖ్య పెంచాలని అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ సమయంలో పోస్టులు పెంచకుండా ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్‌ను మార్చడంపై వారు మండిపడుతున్నారు.
ఎస్‌జీటీ అభ్యర్థులకు రోజుకో షాక్
ప్రభుత్వం డీఎస్సీ–2018 అభ్యర్థులకు షాక్‌ల మీద షాకులను ఇస్తోంది. రెండేళ్లపాటు ఊరించి అభ్యర్థులను కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పింది. తీరా అరకొర పోస్టులతో అభ్యర్థులకు చుక్కలు చూపించింది. ప్రకటన వచ్చిన రోజు నుంచి ఏదో ఒక సాకుతో ఎస్‌జీటీ పోస్టుల్లో కోతలు విధిస్తోంది. ఇన్ని తక్కువ పోస్టులతో డీఎస్సీ విడుదల చేయడం కన్నా మానుకోవడమే మేలని అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు. ఎస్‌జీటీ పోస్టులు భారీగా ఖాళీలున్నా.. ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదంటూ కేవలం 4,221 పోస్టులను విడుదల చేసింది. పీఈటీల పోస్టులను పెంచే సాకుతో 250 ఎస్‌జీటీలను కోతపెట్టింది. తాజాగా డిప్యూటీ డీవైఈఓల నియామకం పేరుతో మరో 366 పోస్టులను తగ్గించడానికి రంగం సిద్ధం చేసింది. మరోవైపు ఈ డీఎస్సీలో బీఈడీలను అనుమతించడం, టెట్ కమ్ టీఆర్‌టీ నిర్వహించడంతో పోటీ మరింత పెరిగింది.
కంటితుడుపు చర్యలు వద్దు
డీఎస్సీ రాయటానికి సమయం పెంచకపోయినా పర్లేదు.. పోస్టులు పెంచడం ముఖ్యం. పోస్టులు లేకుండా ఎన్ని కంటితుడుపు చర్యలు చేపట్టినా ఉపయోగం ఉండదు. పీఈటీలకు న్యాయం చేయాలనుకుంటే పోస్టుల సంఖ్య పెంచాల్సిందిపోయి మా కడుపు కొట్టడం అన్యాయం. పోస్టుల సంఖ్య పెంచకపోతే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి ఉంటుంది.
– రాజేష్, ఎస్‌జీటీ అభ్యర్థి, కడప.
ప్రమాదంలో ప్రాథమిక విద్య
డీఎస్సీ ప్రకటించిన రోజు నుంచి దాదాపు 600 ఎస్‌జీటీ పోస్టులను ప్రభుత్వం కోత విధించింది. ఇలా చేయటంతో ఉపాధ్యాయుల కొరతతో ప్రాథమిక విద్య ప్రమాదంలో పడుతుంది. నగర శివార్లలో జనాభా పెరుగుతుండటంతో అక్కడ ప్రాథమిక పాఠశాలల సంఖ్య పెంచి ఎస్‌జీటీ పోస్టులను పెంచాలి. ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలంటే ఎస్‌జీటీ పోస్టులను పెంచాలి.
– కొక్కెరగడ్డ సత్యం, రాష్ట్ర కార్యదర్శి, సెకండరీ గ్రేడ్ టీచర్ ఫెడరేషన్.
బీఈడీ వారితో పోటీ పెరిగింది
సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు కేవలం డీఎడ్ చేసిన వారికి మాత్రమే అవకాశం ఉండేది. కానీ తాజా ప్రకటనలో బీఈడీ చేసిన వారు, బీటెక్‌తో పాటు బీఈడీ చేసిన వారు కూడా రావటంతో గతంలో కంటే పోటీ దాదాపు ఎనిమిది రెట్లు పెరిగింది. ఇటువంటి సమయంలో పోస్టులను పెంచాల్సిన ప్రభుత్వం రోజురోజుకు పోస్టుల్లో కోతలు విధించడం అన్యాయం. ఇటువంటి నిర్ణయాలతో ఎస్‌జీటీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నాం.
– ఆర్.శోభారాణి, ఎస్‌జీటీ అభ్యర్థి, కొత్తచెరువు, అనంతపురం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment