శ్రీసిటీ ప్రధాన కార్యాలయం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రజల సంక్షేమం కోసం పరితపించిన వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన అది. రాళ్లు, రప్పలతో కూడిన భూముల్లో.. వర్షాధారిత వ్యవసాయంతో ప్రజలు అత్యంత దుర్భర జీవనం సాగించిన ప్రాంతమది. వారి జీవితాలను, ఆ ప్రాంతాన్ని మెరుగుపర్చాలనే సంకల్పం ఆ మహా నాయకుడిలో మొగ్గ తొడిగింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ప్రజల జీవన ప్రమాణాలు బాగుపడతాయని భావించిన ఆయన ‘సెజ్’ (స్పెషల్ ఎకనమిక్ జోన్) ఏర్పాటు చేశారు. ఇప్పుడది ఇంతింతై.. ఒటుడింతై అన్నట్టుగా దినదినాభివృద్ధి చెందుతూ.. అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు పొందుతోంది. చిత్తూరు జిల్లాకు మణిహారంగా నిలుస్తోంది.
పారిశ్రామక వాడగా మొదలై.. పారిశ్రామిక నగరంగా
వరదయ్యపాలెం, సత్యవేడు మండలాల పరిధిలో 14 గ్రామాల మధ్య శ్రీసిటీని ఆగస్టు 8, 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. దీనిద్వారా ప్రస్తుతం 5 0వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరో ఐదేళ్లలో 1.50 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళుతోంది. పారిశ్రామిక వాడగా మొదలైన శ్రీసిటీ పారిశ్రామిక నగరంగా రూపుదిద్దుకుంది. సామాజిక బాధ్యతను దృష్టిలో ఉంచుకుని వర్క్, లైవ్, లెర్న్, ప్లే అనే విధానంలో ప్రణాళికాబద్ధంగా వృద్ధి చెందుతోంది. ఇందులో ట్రిపుల్ ఐటీ, డిగ్రీ కళాశాలలు ఏర్పాటయ్యాయి. నాలుగు లేన్ల రహదారులు వచ్చి చేరాయి. 3 లక్షల మంది నివసించేందుకు వీలుగా భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. కన్జర్వేషన్ పద్ధతిలో భూగర్భ జలాలను పెంపొందించారు. వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా చెరువులు నిర్మించారు. కాలువల ద్వారా ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు చేరేలా లింక్ చానల్స్ నిర్మించారు. తద్వారా భూగర్భ జలాలు 4 మీటర్లు పెరిగాయి. శ్రీసిటీలో అన్ని పరిశ్రమలకు శుద్ధి చేసిన నాణ్యమైన నీరు సరఫరా చేస్తూనే.. పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత, వ్యర్ధ జలాలను శుద్ధి చేసి ఉద్యాన వనాలను పెంచుతున్నారు. 50 ఎకరాల్లో ప్రత్యేకంగా నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. సెజ్ వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటారు. ఫలితంగా కాలుష్య రహిత ప్రాంతం ఇక్కడ ఆవిష్కృతమైంది.
సెకనుకు 3 సెల్‌ఫోన్ల తయారీ
శ్రీసిటీ మొబైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లల్లో ప్రతి సెకనుకు 3 సెల్‌ఫోన్ల చొప్పున నిమిషానికి 180 తయారవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, సిమెన్స్ సంస్థ సంయుక్తంగా శ్రీసిటీలో టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పి నిరుద్యోగులను నిష్ణాతుల్ని చేస్తున్నారు. ఇలా రెండేళ్లలో 5వేల మందిని తీర్చిదిద్దారు. శిక్షణ తర్వాత ఉద్యోగం చూపించే లక్ష్యంతో ట్రైనింగ్ ఇస్తుండటం విశేషం. ఇక్కడ 27 దేశాలకు చెందిన 185 కంపెనీలకు వివిధ ఉత్పత్తులను విదేశీ సామర్థ్యంతో చేపడుతున్నారు. ఇస్రో, నాసా పరిశోధన సంస్థల రాకెట్ ప్రయోగంలో వినియోగించే లిక్విడ్ హైడ్రోజన్ ట్యాంక్స్, ఇసుజి వాహనాలు, సిద్ధార్థ లాజిస్టిక్స్, రఫేల్ యుద్ధ విమానాల ల్యాండింగ్ సీలింగ్ నిర్మాణం ఇక్కడే తయారవుతున్నాయి. డ్రగ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, ఎలక్ట్రికల్ కేబుల్స్ ఇలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులు సైతం ఇక్కడే చేస్తున్నారు.
మహిళలకూ ఆర్థిక స్వావలంబన
శ్రీసిటీ సెజ్ కారణంగా ఎందరో మహిళలు ఆర్థికంగా లాభపడ్డారు. దశాబ్ద కాలంలో అక్షరాస్యత అత్యంత వేగంగా పుంజుకుంది. పుష్కర కాలంలోనే ఇక్కడి పౌరుల సగటు ఆదాయం 200 శాతం పెరిగింది. ప్రతి కుటుంబంలో ఉద్యోగులు ఉన్నారు. పూరి గుడిసెల స్థానంలో అందమైన ఇళ్లు వెలిశాయి. శ్రీసిటీ పరిధిలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ వేలాది మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఇందులో ఉద్యోగాలు చేస్తున్న వారిలో 50 శాతం మంది మహిళలే ఉండటం మరో విజయం. ఫాక్స్‌గాన్ సెల్‌ఫోన్ల తయారీ కంపెనీలో దాదాపు 15 వేల మంది మహిళలు ఉద్యోగులున్నారు. పదో తరగతి పాస్, ఫెయిల్ అయిన మహిళలకు కూడా స్కిల్ డెవలప్‌మెంట్, డీఆర్‌డీఏ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి సెల్‌ఫోన్ ఉత్పత్తి ఉద్యోగాల్లో నియమించారు. ఎంఐ, ఆపిల్, నోకియా, ఒన్ ప్లస్ ఫోన్లు ఇక్కడ తయారై ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. తాజాగా శుక్రవారం కోవిడ్ బాధితులకు రూ.20 లక్షల విలువ చేసే 10 వేల లీటర్ల ఆక్సిజన్‌ను శ్రీసిటీ విరాళంగా అందించింది.
Comments
Please login to add a commentAdd a comment