
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కానిస్టేబుళ్లు ఒక్క పదోన్నతి కూడా లేకుండానే రిటైర్ అవుతున్నారని, అలా కాకుండా ప్రతీ పోలీసుకు విధి నిర్వహణలో కనీసం ఒక ప్రమోషన్ వచ్చేలా కొత్త విధానాన్ని తీసుకొస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసు కుటుంబాల సంక్షేమం బాధ్యత తనదని, ప్రజల సంరక్షణ బాధ్యత పోలీసులదని అన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో మోడల్‌గా మారుస్తామని ప్రకటించారు. అమరావతిలో పోలీసు అమరవీరుల స్థూపం నిర్మిస్తామన్నారు. పోలీసులకు ఇళ్లు, ఇతర వసతులు కల్పిస్తామన్నారు.
రాష్ట్రంలో పోలీసులు కన్పించకూడదని (విజిబుల్ పోలీస్), పోలీసింగ్ మాత్రమే కన్పించాలని (ఇన్విజిబుల్ పోలీసింగ్) అన్నారు. అలాగే.. రాష్ట్రంలో రౌడీలు ఉండకూడదని, వారంతా ఏపీ బయట ఉండేలా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని, మొదటిస్థానంలో నిలిచేలా కృషి చేయాలన్నారు. కాగా, పోలవరం భూసేకరణను అడ్డుకోవడం, రాజధానిలో చెరుకుతోట దగ్థం, తిత్లీ తుపాను బాధితులను రెచ్చగొట్టడం వంటివి రాజకీయ ముసుగులో జరుగుతున్నాయని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి సంఘటనలను అడ్డుకోవడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. ప్రాణాలకు తెగించి పోలీసులు ప్రజలను కాపాడుతున్నారని.. వీరి త్యాగాలను అందరూ గుర్తుంచుకోవాలని కోరారు.
ఫ్రెండ్లీ పోలీసింగే లక్ష్యం: డీజీపీ
పోలీసులు తమ కుటుంబాలకంటే ప్రజాసేవకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని డీజీపీ ఆర్పీ ఠాకుర్ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగే తమ లక్ష్యమని, చేరువ కార్యక్రమం ద్వారా ప్రజలను పోలీస్ కుటుంబంలో భాగం చేస్తున్నామని చెప్పారు. అనంతరం.. ఈ ఏడాది విధి నిర్వహణలో మరణించిన పోలీసులకు సీఎం, ఉపముఖ్యమంత్రి, డీజీపీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ ఎం. మాలకొండయ్య, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. కాగా, గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పోలీసు సంక్షేమ నిధికి రూ.15కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం చేసిన ప్రకటనపై పోలీసులు పెదవి విరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment