ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎస్సీ కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని.....
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా
మచిలీపట్నం (చిలకలపూడి) : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎస్సీ కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధి మానికొండ శ్రీధర్ మాదిగ ఆరోపించారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకు, ఏడాదంతా బాబుజగ్జీవన్‌రామ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను చేపడతామని చెప్పిన చంద్రబాబు ఎస్సీలను విభజించడానికి చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడును ఓటమి పాలు చేయాలని గ్రామగ్రామాన తిరిగిన జూపూడి ప్రభాకర్, కారెం శివాజీలకు పదవులను కట్టబెట్టి కులాల మధ్య చిచ్చుకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరికి పదవులు కట్టబెట్టడంపై ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపిందన్నారు. ఎస్సీ వర్గీకరణపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అఖిలపక్ష నాయకులను తీసుకువెళ్లి చర్చించాలని కోరారు. అనంతరం డీఆర్వో సీహెచ్ రంగయ్యకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు డి సుధాకర్ మాదిగ, ఎం. ఆదినారాయణమాదిగ, పేటేటి ప్రభాకర్, డి. అంజమ్మ, కె డానియల్, దొండపాటి సుధాకర్ పాల్గొన్నారు.