కరణం బలరాంపై చంద్రబాబు ఆగ్రహం
అమరావతి: ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల మధ్య వర్గ పోరుపై పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఇక్కడ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అద్దంకి నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలపై చర్చ జరిగింది. ఎమ్మెల్సీ కరణం బలరాం తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అద్దంకి నియోజక వర్గంలో కరణం బలరాం మాట చెల్లదని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఆ నియోజకవర్గంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చెప్పిందే ఫైనల్ అని తేల్చేశారు. కరణం బలరాంకు ఎమ్మెల్సీ ఇచ్చిన సమయంలోనే ఈ విషయం చెప్పినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. అయితే అప్పుడు అంగీకరించిన బలరాం ఇప్పుడు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మరోవైపు గత కొన్ని రోజులుగా గొట్టిపాటి, కరణం వర్గీయులు పరస్పరం దాడులకు పాల్పుడుతున్న విషయం తెలిసిందే. విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన చంద్రబాబు.. అద్దంకి నియోజక వర్గంలో మాత్రం రవికుమార్ నిర్ణయాలు చెల్లుబాటు అవుతాయని చెప్పడం కరణం బలరాం వర్గీయులలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం.