సాక్షి, అమరావతి: లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు కనికట్టు చేశారు. ఇదే కనికట్టుతో భారీ ఎత్తున అప్పులు చేశారు. చేసిన అప్పులతో ఆస్తులు ఏమైనా సమకూర్చారా? అంటే అదీ లేదు. కమీషన్ల రూపంలో భారీగా కాజేశారు. ఇదీ నాలుగేళ్ల పది నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్వాకం. ఉమ్మడి రాష్ట్రంలో అంటే 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ) 2013–14 నాటికి రూ.8,55,935 కోట్లు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ జీఎస్‌డీపీ 2019–20 నాటికి రూ.10,67,990 కోట్లకు చేరుకుందని చంద్రబాబు సర్కార్ లెక్కలు వేసింది. ఇవే లెక్కలను చూపించి 2018–19 నాటికే రూ.2.58 లక్షల కోట్ల అప్పులు చేసింది. గత ఐదేళ్లలో ఏటా పది శాతం వృద్ధి రేటు సాధించినట్లు చంద్రబాబు పదేపదే చెబుతూ వచ్చారు. ఆ లెక్కన చూసుకున్నా జీఎస్‌డీపీ వృద్ధి రేటు ఐదేళ్లలో 50 శాతానికి మించకూడదు. కానీ, 2013–14లో 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ జీఎస్‌డీపీతో పోల్చితే 2019–20 నాటికి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ జీఎస్‌డీపీ 124.79 శాతం అధికంగా ఉన్నట్లు చెప్పడంపై ఆర్థిక నిపుణులు నివ్వెరపోతున్నారు. కేవలం భారీ ఎత్తున అప్పులు తేవడం కోసమే లేని వృద్ధి రేటును ఉన్నట్లు చూపి చంద్రబాబు మాయ చేశారని స్పష్టమవుతోంది.
అన్నింటా అదే కథ
రాష్ట్ర విభజన జరిగే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి 2013–14లో 8,55,935 కోట్లు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం లేని వృద్ధి రేటును ఉన్నట్లు చూపుతూ వచ్చింది. దేశంలో డబుల్ డిజిట్ వృద్ధిరేటు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ ఊదరగొట్టింది. వాస్తవానికి వ్యవసాయ వృద్ధి తిరోగమనంలోనే కొనసాగింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయంతో సంబంధం లేని చేపలు, మాంసం ఉత్పత్తులు భారీగా పెరిగినట్లు అంచనాలు వేస్తూ దాన్ని వ్యవసాయంలో కలిపేసి వృద్ధిరేటు అమోఘం అంటూ కనికట్టు చేసింది. పరిశ్రమల
నుంచి సేవల రంగం వరకూ వృద్ధి రేటులో ఇదే కథ.
అప్పులతో రాష్ట్రానికి ఒరిగిందేమిటి?
రాష్ట్ర విభజన మరుసటి ఏడాదే అంటే 2014–15లో జీఎస్‌డీపీ రూ.5,26,470 కోట్లకు.. 2015–16లో రూ.6,09,934 కోట్లకు.. 2016–17లో రూ.6,99,307 కోట్లకు, 2017–18లో రూ.8,03,873 కోట్లు, 2018–19లో 9,18,964 కోట్లు.. 2019–20 నాటికి కేవలం 13 జిల్లాల రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏకంగా రూ.10,67,990 కోట్లకు చేరినట్లు బాబు సర్కారు మాయ చేసింది. ఇలా లేని వృద్ధి రేటును ఉన్నట్లు చూపి 2018–19 నాటికే రూ.2.58 లక్షల కోట్ల అప్పులు తెచ్చింది. 2019–20లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచి చూపిస్తూ, దాని ఆధారంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.32,000 కోట్ల అప్పులు చేయాలని చంద్రబాబు భావించారు. ఇప్పటివరకూ చేసిన అప్పులతో టీడీపీ ప్రభుత్వ పెద్దల జేబులు నిండడం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment