ఐటీ గుప్పిట్లో బిగ్‌బాస్‌ గుట్టు! | Chandrababu irregularities emerge in 13 pages Panchnama | Sakshi
Sakshi News home page

ఐటీ గుప్పిట్లో బిగ్‌బాస్‌ గుట్టు!

Published Tue, Feb 18 2020 1:27 AM | Last Updated on Tue, Feb 18 2020 8:26 AM

Chandrababu irregularities emerge in 13 pages Panchnama - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు సన్నిహితుడైన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రా కార్యాలయం, నివాసాల్లో సోదాల అనంతరం ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ విడుదల చేసిన 13 పేజీల పంచనామాను పరిశీలిస్తే ‘బిగ్‌బాస్‌’ ఐదేళ్ల కమీషన్ల బాగోతం ఆవిష్కృతమవుతుంది. అక్కడి నుంచి వెయ్యికి పైగా డాక్యుమెంట్లు (పత్రాలు), రెండు బ్యాంకు లాకర్లు స్వాధీనం చేసుకున్నట్లు పంచనామాలో ఐటీ శాఖ పేర్కొంది. పంచనామాలోని 5, 6వ పేజీల్లో ఈ వివరాలున్నాయి. ఒక్కో డాక్యుమెంట్‌ ద్వారా రూ.కోట్లలో కమీషన్లు చేతులు మారినట్లు ఐటీ శాఖ గుర్తించింది. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు చెందిన అవెక్సా ఇన్‌ఫ్రా,  లోకేష్‌ సన్నిహితుడు నరేన్‌ చౌదరికి చెందిన డీఎన్‌సీ ఇన్‌ఫ్రా కార్యాలయాల నుంచి స్వాధీనం చేసుకున్న వేలాది డాక్యుమెంట్లలోనూ ఇదే రీతిలో కమీషన్లు చేతులు మారినట్లు వెల్లడించింది. రూ.2 వేల కోట్లకుపైగా దోపిడీ చేశారని స్పష్టం చేసింది.

ఐటీ శాఖ పంచనామా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఈ సొమ్మంతా ఎక్కడికి చేరిందన్నది ప్రముఖుడి మాజీ పీఎస్‌ నివాసాల్లో స్వాధీనం చేసుకున్న వేలాది డాక్యుమెంట్లు, డైరీలలో అక్షరబద్ధం చేయడాన్ని గుర్తించింది. కమీషన్ల రూపంలో వసూలు చేసిన నల్లధనాన్ని సింగపూర్‌కు తరలించి.. అక్కడి నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్సులోకి రప్పించి ఎవరి జేబుల్లోకి వెళ్లాయన్నది పీఎస్‌గా పనిచేసిన వ్యక్తి ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్లలో స్పష్టంగా ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. వీటి ఆధారంగా ‘బిగ్‌బాస్‌’ అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. బిగ్‌బాస్‌ అక్రమాల బాగోతంలో స్వల్ప భాగాన్ని ఐటీ శాఖ రట్టు చేయడం కలకలం రేపడంతో.. వాటిని వక్రీకరిస్తూ కమీషన్ల  బాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ నేతలు కిందామీదా పడుతున్నారు.  శ్రీనివాస్‌కు, టీడీపీకీ సంబంధం లేదని తొలుత బుకాయించిన ఆ పార్టీ నేతలు ఐటీ శాఖ విడుదల చేసిన పంచనామాలో కేవలం ఒక పేజీని మాత్రమే చూపుతూ దాడుల్లో ఏమీ దొరకలేదంటూ బుకాయిస్తుండటం గమనార్హం.

రూ.150 కోట్ల కమీషన్ల తీగ లాగితే..
గతేడాది నవంబర్‌లో ఢిల్లీ, ముంబై, ఈరోడ్, పుణె, ఆగ్రా, గోవాలలో భారీ మౌలిక సదుపాయాల సంస్థల (కాంట్రాక్టు సంస్థలు) కార్యాలయాల్లో ఐటీ శాఖ 42 చోట్ల సోదాలు నిర్వహించింది. బోగస్‌ బిల్లుల ద్వారా రూ.3,300 కోట్లకుపైగా కమీషన్లు చేతులు మారినట్లు గుర్తించింది. ఓ  కాంట్రాక్టు సంస్థ నుంచి ఏపీలో ప్రముఖుడికి రూ.150 కోట్లకుపైగా ముడుపులు ముట్టాయనడానికి పక్కాగా ఆధారాలు సేకరించినట్లు 2019 నవంబర్‌ 11న కేంద్ర ప్రత్యక్ష పెట్టుబడుల మండలి(సీబీడీటీ) అధికార ప్రతినిధి సురభి అహ్లూవాలియా విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. తాత్కాలిక సచివాలయం, పట్టణ పేదల గృహ నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ పనులను టెండర్‌ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా ఏపీ ప్రముఖుడు ముడుపులు అందుకున్నాడు. షాపూర్‌జీ పల్లోంజీ కార్యాలయాల్లో సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఈ వ్యవహారాన్ని ఐటీ శాఖ బహిర్గతం చేసింది. వీటి ఆధారంగా తీగలాగితే చంద్రబాబు కమీషన్ల  బాగోతంలో స్వల్ప భాగం రూ.రెండు వేల కోట్లకుపైగా అవినీతి బట్టబయలైంది.

చిరునామా ఒక్కటే..
ఏపీ, తెలంగాణల్లో ఈనెల 6 నుంచి 10 వరకు ఐటీ శాఖ 40 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రా, కిలారు రాజేష్‌(చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ నిర్వాణ హోల్డింగ్స్‌లో శాశ్వత డైరెక్టర్‌), నరేన్‌ చౌదరి(డీఎన్‌సీ ఇన్‌ఫ్రా), ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌(అవెక్సా ఇన్‌ఫ్రా) కార్యాలయాలు, ఇళ్లలో జరిపిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న వేలాది పత్రాలను విశ్లేషించింది. ఆర్కే ఇన్‌ఫ్రా, డీఎన్‌సీ ఇన్‌ఫ్రా, అవెక్సా ఇన్‌ఫ్రా కాంట్రాక్టు సంస్థల్లో లెక్కకు మించి సబ్‌ కాంట్రాక్టు సంస్థలు పనులు చేసినట్లు,  రూ.రెండు వేల కోట్లకుపైగా అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా ఐటీ శాఖ తేల్చింది. ఈ మూడు కాంట్రాక్టు సంస్థలు, లెక్కకు మించిన సబ్‌ కాంట్రాక్టు సంస్థలు ఒకే చిరునామా(ఐపీ) నుంచి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌లు దాఖలు చేయడంతో కమీషన్ల వ్యవహారంలో స్వల్ప భాగం బహిర్గతమైంది. ఈ మూడు సంస్థలు బాబుకు అత్యంత సన్నిహితమైనవి.

ఐటీ శాఖ పంచనామా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

తాము జరిపిన సోదాల్లో వందలాది డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు పంచనామాలోని ఐదో పేజీలో పేర్కొన్న ఐటీ శాఖ  
 

ఈడీ, జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ దర్యాప్తు..
► షాపూర్‌జీ పల్లోంజీ నుంచి రూ.150 కోట్లకుపైగా ముడుపులు ఆంధ్రా ప్రముఖుడైన బిగ్‌బాస్‌కు చేరిన వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ఆ తీగ ఆధారంగా ఐటీ శాఖ చేధించిన రూ.రెండు వేల కోట్లకుపైగా నల్లధనం రాకెట్‌పై గురి పెట్టింది. హైదరాబాద్, చెన్నైల్లో ఈడీ విభాగాల అధికారులు ఒకటి రెండు రోజుల్లోనే ఈ వ్యవహారంపై దృష్టి సారించనున్నట్లు ఐటీశాఖ వర్గాలు చెబుతున్నాయి. అవెక్సా ఇన్‌ఫ్రా, డీఎన్‌సీ ఇన్‌ఫ్రా, ఆర్కే ఇన్‌ఫ్రాలు భారీ ఎత్తున జీఎస్టీ ఎగ్గొట్టినట్లు జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ విభాగం గుర్తించింది. ఇప్పటికే డీఎన్‌సీ ఇన్‌ఫ్రాపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. అవెక్సా ఇన్‌ఫ్రా, ఆర్కే ఇన్‌ఫ్రాలపై కూడా కేసుల నమోదుకు సిద్ధమైంది. 
► హంద్రీ–నీవాలో భాగమైన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులను కేవలం రూ.200 కోట్లతో పూర్తి చేయవచ్చని అధికారులు ప్రతిపాదించగా గత ప్రభుత్వ హయాంలో అంచనా వ్యయాన్ని రూ.430 కోట్లకు పెంచేశారు. 4.85 శాతం అధిక ధరలకు సింగిల్‌ షెడ్యూలు దాఖలు చేసిన ఆర్కే ఇన్‌ఫ్రాకు పనులు కట్టబెట్టారు. రూ.200 కోట్లతో పూర్తయ్యే పనిని రూ.450.86 కోట్లకు కట్టబెట్టారు. డిజైన్లు మారాయనే నెపంతో రూ.129 కోట్ల బిల్లులు అదనంగా చెల్లించారు. వీటిని బోగస్‌ సబ్‌ కాంట్రాక్టు సంస్థల ద్వారా టీడీపీ పెద్దలు తమ జేబులో వేసుకున్నట్లు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్ల ఆధారంగా వెల్లడైంది.
► సబ్‌ కాంట్రాక్టుల ముసుగులో అవెక్సా ఇన్‌ఫ్రా, డీఎన్‌సీ ఇన్‌ఫ్రా నుంచి వసూలు చేసిన సొమ్మును దారి మళ్లించినట్లు ఐటీ శాఖ గుర్తించింది.
ఏపీకి చెందిన ముఖ్యనేతకు రూ.150 కోట్లు చెల్లించినట్లు పేర్కొంటూ 2019 నవంబర్‌లో సీబీడీటీ విడుదల చేసిన నోట్‌ 

ఐటీ శాఖ పంచనామా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement