
చంద్రబాబు బెదిరింపులకు భయపడేది లేదు
► పోలీసుల చేత పొలిటికల్ డ్యూటీ చేయిస్తున్నారు
► బుకీలతో మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసు అధికారులకు నోటీసులిచ్చి విచారించండి
► వైఎస్సార్ సీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు సిటీ : సీఎం చంద్రబాబునాయుడి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, జిల్లా పోలీసు యంత్రాంగం చేత ఆయన పోలీసు డ్యూటీ కాకుండా పొలిటికల్ డ్యూటీ చేయిస్తున్నారని వైఎస్సార్ సీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఒకటన్నర గంటపాటు శ్రీధర్‌రెడ్డిని రెండోసారి క్రికెట్ బెట్టింగ్ కేసులో విచారణ జరిపారు. అనంతరం శ్రీధర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మొదటి విచారణలో ఏవైతే ప్రశ్నలు వేశారో అవే ప్రశ్నలు మళ్లీ వేశారన్నారు.
కొత్తగా బెంగళూరులో అకౌంట్ ఉందా? మీకు అకౌంట్ ఉన్నట్లు మా వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు. తనకు అకౌంట్లు లేవని స్పష్టం చేశానన్నారు. తన అకౌంట్‌లు, కుటుంబసభ్యుల బ్యాంకు స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రశ్నలు, మాటలు తప్ప తనపై వచ్చిన ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా చూపించలేదని తెలిపారు. తనకు నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ కుట్ర ఉందని స్పష్టం అవుతుందన్నారు. బాధ్యతగల ఎమ్మెల్యేగా విచారణకు సహకరిస్తున్నట్లు తెలిపారు. రూరల్ నియోజకవర్గ ప్రజలు తమ ఇంటి బిడ్డగా అధికార పార్టీ తీరును నిరసించాలని కోరారు.
నా జీతాన్ని పేదలకు ఖర్చుచేశాను..
ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతాన్ని పేద ప్రజల కోసం ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. శ్మశానవాటికలు, వాటర్‌ప్లాంట్ల నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించారు. తనపై ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా భయడపడనని చెప్పారు. ప్రభుత్వాలు ఎప్పుడూ ఒకటే ఉండవనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. అధికార పార్టీ అహంకారానికి వ్యతిరేకంగా మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఎదురొడ్డి పోరాటం చేస్తానని తెలిపారు. అధికారం చేతుల్లో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించి బుడ్డ బెదిరింపులకు దిగితే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు భయపడరని చెప్పారు.
పూర్తి విచారణ చేస్ వెలుగులోకి నిజాలు
పోలీసు ఉన్నతాధికారికి మూడు సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది మంది క్రికెట్ బుకీల ఫోన్ కాల్‌లిస్ట్‌ను పరిశీలించాలన్నారు. ఏడాదిగా వీరు తరచూ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గంటల తరబడి మాట్లాడారన్నారు. గన్‌మన్‌లు, డ్రైవర్‌లచే పోలీసు అధికారులు బుకీలతో మాట్లాడిన విషయాలు బయటపెట్టాలని కోరారు. గోవా పర్యటనలో మేయర్ అజీజ్‌కు కృష్ణసింగ్ ఆర్థికంగా సహాయపడ్డారా? అని ప్రశ్నించారన్నారు. దీనిపై అజీజ్‌ను విచారణ చేయాలన్నారు. బెట్టింగ్‌లో 400 మంది చిన్నచిన్న వారిని అరెస్ట్ చేశారన్నారు.
బెట్టింగ్‌ను కూకటివేళ్లతో లేకుండా చేయాలనే పోలీసుల చర్యలు అభినందనీయమన్నారు. అయితే బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరూ లేరా అని ప్రశ్నించారు. ఆ దిశగా విచారణ సాగించాలన్నారు. ఈ మూడింటిపై విచారణ జరపాలన్నారు. లేనిపక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా భారీగా జిల్లా ఎస్పీ కార్యాలయం వద్దకు ఎమ్మెల్యే మద్దతుదారులు చేరుకున్నారు. అధికార పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్పీ కార్యాలయం నుంచి శ్రీధర్‌రెడ్డి ర్యాలీగా కేవీఆర్ పెట్రోల్ బంకు వద్ద ఉండే ఆయన కార్యాలయానికి కాలినడకన వెళ్లారు.