సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పచ్చి రాజకీయ అవకాశవాది అని మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వినోద్‌కుమార్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా జాతీయస్థాయిలో చక్రం తిప్పినట్టుగా చెప్పుకుంటున్న చంద్రబాబు.. తెలంగాణ విషయం వచ్చేసరికి అవకాశవాదంతో మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలుగుజాతి అంటే 13 సీమాంధ్ర జిల్లాలేనా లేకుంటే 23 జిల్లాలతో కూడినదో.. చంద్రబాబు చెప్పాలన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమే అని చంద్రబాబు ఎందుకు స్పష్టంగా చెప్పడం లేదని వినోద్ ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పాటైతే సీమాంధ్రకు వచ్చే నష్టం ఏమిటో ఈ నెలరోజుల్లో ఎవరూ స్పష్టంగా చెప్పలేదన్నారు. హైదరాబాద్ ఆదాయం గురించి కూడా అసత్య, అర్ధ సమాచారంతో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మాట్లాడుతున్నాయని అన్నారు. చంద్రబాబు తాత పుట్టకముందే దేశంలోని అభివృద్ధి చెందిన ప్రధాన నగరాల్లో హైదరాబాద్ నాలుగోస్థానంలో ఉందని, ఇదే విషయాన్ని బ్రిటీషు ప్రభుత్వం కూడా చెప్పిందని వినోద్‌కుమార్ గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం అభివృద్ధి చెందుతున్న సమయంలో అవకాశంతోనో, అదృష్టంతోనో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనికే హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్టుగా ప్రచారం చేసుకోవడం మంచిది కాదన్నారు. అన్ని రాజకీయపార్టీల అధినేతలు విజ్ఞతతో వ్యవహరించాలని, రాష్ట్ర విభజనకు సహకరించాలని కోరారు. తెలంగాణ లేకుంటే సీమాంధ్ర బతకదా అని వినోద్ ప్రశ్నించారు.
బాబు పచ్చి అవకాశవాది
Published Mon, Sep 2 2013 1:32 AM | Last Updated on Wed, Oct 3 2018 7:42 PM
Advertisement
Advertisement