
కేసుకు భయపడే హైదరాబాద్ నుంచి పరార్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసుకు భయపడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక రకాలుగా నష్టం చేకూర్చారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిన నేపథ్యంపై రామకృష్ణారెడ్డి వెలగపూడి అసెంబ్లీ ఆవరణలో స్పందించారు. ఓటుకు నోటు కేసులో నోటీసులు జారీ చేయడమంటే సుప్రీంకోర్టును చంద్రబాబుకు చుక్కెదురైనట్లేనని ఆయన అన్నారు.
చంద్రబాబునాయుడు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ సొత్తును దోచుకుంటూ అక్రమంగా సంపాదించిన లంచాల సొమ్ముతో అవసరం లేని తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొంటూ అడ్డంగా ఆడియో వీడియో టేపుల్లో దొరికిపోయారని చెప్పారు. "మనవాళ్లు దే బ్రీఫ్ డ్ మీ" అనే గొంతు ఆయనదే అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసని, అయినా అటు తెలంగాణ ఏసీబీ, ఇటు చంద్రబాబు ప్రభుత్వం ఇద్దరూ కూడా ఢిల్లీ పెద్దల కాళ్లు, గడ్డాలు పట్టుకుని తప్పించుకోజూశారని మండిపడ్డారు.
రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాష్ట్రంగా పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరం మీద హక్కులు ఉన్నా హైదరాబాద్‌ను వదులుకున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం గోదావరి, కృష్ణా నదులపై అక్రమంగా ఆనకట్టలు కడుతున్నా నోరెత్తలేదని.. పార్లమెంట్ సాక్షిగా లభించిన హామీ, ఆంధ్రరాష్ట్ర హక్కు అయిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర ఉంది. గత మూడు సంవత్సరాలుగా దీనిపై మేం పోరాడుతున్నాం. దివంగత రాజశేఖర రెడ్డి స్పూర్తితో, పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అండదండలతో మా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం. ఈ కేసులో తెలంగాణ మేజిస్ట్రేట్ కోర్టు నాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. స్టీఫెన్ సన్ తో "మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ" మాట్లాడిన వాయిస్ ను టెస్ట్ చేయించి, మాట్లాడింది చంద్రబాబు నాయుడేనని రూజువుచేయించి కోర్టుకు సమర్పించడం జరిగిందని చెప్పారు. దానిపై చంద్రబాబుకు నోటీసులు జారీచేయడం శుభపరిణామమని చెప్పారు.