మహానాడులో చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగాలు
తెర వెనుక..ముందూ లోకేష్ హంగామా
రెండో రోజు నేతలంతా ఎన్టీఆర్ స్మరణ
ముగిసిన మూడు రోజుల కార్యక్రమాలు
తిరుపతిలో మూడు రోజుల పాటు నిర్వహించిన టీడీపీ మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ అంతా తామే అన్నట్లు వ్యవహరించారు. మూడు రోజులూ చంద్రబాబు సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చారు. ఆద్యం తం లోకేష్ హడావుడి కనిపించింది. స్టేజీ నిర్మా ణం నుంచి మైకు వరకు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ హంగామా చేశారు.
తిరుపతి : తెలుగుదేశం పార్టీ మూడు రోజుల పాటు తిరుపతిలో నిర్వహించిన మహానాడు ఆదివారం సాయంత్రం ముగిసింది. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఒకరోజు ముందే తిరుపతి చేరుకున్నారు. మహానాడు వేదిక ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇంకా వేగంగా పనులు జరగాలంటూ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మహానాడు ప్రారంభం రోజు నుంచి చివరి రోజు వరకు అధ్యక్షత వహించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గంటల తరబడి ఉపన్యసించారు. చివరి రోజు ఆయన తనయుడు లోకేష్ ఆవేశంగా ప్రసంగించా రు. రెండో రోజు శనివారం ఎన్టీ రామారావు జయంతి కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రసంగించిన నాయకులంతా ఎన్టీఆర్ స్మరణ చేశారు.
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
ముగింపు సందేశంలో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. మహానాడు నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన జిల్లా నాయకులను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాకు చెందిన 1000 మంది కార్యకర్తలు పార్టీ జిల్లా కన్వీనర్ గౌనివారి శ్రీనివాసులు పర్యవేక్షణలో ఉత్తమ సేవలను అందించారని ప్రశంసించారు. తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు.
28 తీర్మానాలకు ఆమోదం
మూడు రోజుల మహానాడులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 28 తీర్మానాలకు పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఇందులో 146 మంది నాయకులు, కార్యకర్తలు భాగస్వాములయ్యారు. ఆదివారం తెలంగాణకు చెందిన మూడు కీలక తీర్మానాలను బలపరిచే క్రమంలో ఆ రాష్ట్రం నుంచి హాజరైన రేవంత్‌రెడ్డి, ఎల్.రమణ పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన అధ్వానంగా ఉందనీ, అక్కడ శాంతిభద్రతలు గాడితప్పి మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయిందని టీటీడీపీ నేతలు పలువురు కేసీఆర్‌పై ధ్వజమెత్తారు.
మొత్తం విరాళాలు రూ.11.55 కోట్లు..
ఈ మూడు రోజుల్లోనూ పార్టీ కోసం రూ.11.55 కోట్ల విరాళాలు అందినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. మొత్తం 851 మంది కార్యకర్తలు రక్తదానం చేసినట్లు తెలిపారు. 3 వేల మందికి ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మొరాయించిన మైకులు
మహానాడులో మూడోరోజు ఆదివారం సభా కార్యక్రమం ప్రారంభం నుంచీ మైకులు మొరాయించాయి. ‘‘మైకులు సరిగా పనిచేయడం లేదు.. అరిచి అరిచి నా గొంతు పోతుంది. మీకు అర్థం కాదా?’’ అంటూ చంద్రబాబునాయుడు నిర్వాహకులపై మండిపడ్డారు. మైకుల కారణంగా సభను సవ్యంగా జరుపుకోలేని పరిస్థితి తలెత్తిందన్నారు. సాయంత్రం ఆరు గంటల వరకూ కొనసాగిన మహానాడు కార్యక్రమం పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు వందన సమర్పణతో ముగిసింది.