
సాక్షి, అమరావతి: ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలను ఎలా నిర్వహించాలనే దానిపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. ప్రతిపక్షం లేకపోయినా తమ పార్టీ వారితోనే ప్రశ్నలు అడిగించి వాటికి సమాధానం చెప్పించాలని నిర్ణయించారు. మంగళవారం ఆయన సచివాలయంలోని తన కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ప్రశ్నలను తయారు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. సింగపూర్‌లో ప్రతిపక్షం పాత్ర పెద్దగా ఉండదని, అధికార పక్షమే పార్లమెంటు సమావేశాల్లో సమస్యలను లేవనెత్తి పరిష్కరించే ప్రయత్నం చేస్తుందని చెప్పిన చంద్రబాబు ఈ సమావేశాల్లో అదే విధానాన్ని అనుసరించాలని చెప్పారు. ఈ నెల 26న మంగళగిరిలో పార్టీ నూతన కార్యాలయానికి శంకుస్థాపనకు, భవన డిజైన్లకు పలు సూచనలు చేశారు.