
రాష్ట్రంలో తయారీ యూనిట్ పెట్టండి: బాబు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనలో భాగంగా రెండవ రోజు శనివారం ఆపిల్ సీఈవో జెఫ్ విలియమ్స్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆపిల్ కంపెనీ సీఈవోను కోరారు. భారతదేశంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనంతరం ముఖ్యమంత్రితో క్వాలకమ్ టెక్నాలజీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గోపి సిరినేని, డైరెక్టర్ ప్రొడెక్ట్ మేనేజ్‌మెంట్ చందన పైరాల సమావేశం అయ్యారు.
టెలికమ్యునికేషన్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన క్వాల్‌కమ్ టెక్నాలజీస్ రాష్ట్రంలో చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఆసక్తి కనపరిచిందని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. స్ట్రోటోస్పియర్ బెలూన్స్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించే విభాగాధిపతి అలిస్టర్‌తో బాబు సమావేశమయ్యారు. లాస్ ఏంజెల్స్‌లో టెస్ట్రా ప్రెసిడెంట్ సీఎఫ్‌ఓ ఎలొన్ మస్క్ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు. అమెరికా పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈవీఎక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఐ–బ్రిడ్జి, ఇన్నోవా సొల్యూషన్స్ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.