
సాక్షి, అమరావతి: పోలవరం హెడ్ వర్క్స్ (జలాశయం) కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌కి అదనపు బిల్లులు ఇచ్చేలా నివేదిక ఇవ్వాలంటూ త్రిసభ్య కమిటీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. సోమవారం సీఎం, త్రిసభ్య కమిటీ పోలవరం పనులను పరిశీలించింది. పనుల ప్రగతిపై సమీక్ష అనంతరం జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, త్రిసభ్య కమిటీ సభ్యులు ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, సలహాదారు భార్గవ, పీపీఏ సభ్య కార్యదర్శి డాక్టర్ ఆర్కే గుప్తాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఆదివారం తాము నిర్వహించిన సమావేశంలో గుర్తించిన అంశాలను త్రిసభ్య కమిటీ సీఎం చంద్రబాబుకు వివరించింది. కాంట్రాక్టర్, ప్రభుత్వాల మధ్య మార్చి 3, 2013న జరిగిన ఒప్పందం ప్రకారం వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. అప్పట్లో ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచారని, కాంట్రాక్టర్ అధికంగా పనిచేసినా, తక్కువ పనిచేసినా ప్రభుత్వానికి సంబంధం ఉండదని పేర్కొంది. టెండర్లలో ఇతరులతో పోటీ పడి 14.55 శాతం తక్కువ ధరలకు కోట్ చేసి పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు అన్ని విషయాలపై అవగాహన ఉండే ఉంటుంది కదా? అని పీపీఏ సభ్య కార్యదర్శి డాక్టర్ ఆర్కే గుప్తా ప్రశ్నించినట్లు సమాచారం. కాంట్రాక్టర్ ఐదు అంశాలకు సంబంధించి అదనపు బిల్లుల కోసం క్లెయిమ్‌లు పంపినట్లు సీఎం చంద్రబాబుకు త్రిసభ్య కమిటీ వెల్లడించింది.
తొందరగా తేల్చేయండి..
అదనపు బిల్లులకు సంబంధించిన క్లెయిమ్‌ల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ సమావేశమై ఏదో ఒక నిర్ణయాన్ని త్వరగా వెల్లడించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. తక్కువకు టెండర్లు కోట్ చేయడం వల్ల కాంట్రాక్టర్ నష్టపోయారని, ఈ నేపథ్యంలో అదనపు బిల్లులకు సంబంధించిన క్లెయిమ్‌లపై సానుకూలంగా నివేదిక ఇవ్వాలని త్రిసభ్య కమిటీని కోరినట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీపై ఒత్తిడి తెచ్చినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే త్రిసభ్య కమిటీ మంగళవారం మరోసారి విజయవాడలో సమావేశం కావాలని నిర్ణయించింది.
పోలవరం పనులు ట్రాన్స్‌ట్రాయ్‌కి సాక్షి ప్రతినిధి,ఏలూరు/పోలవరం రూరల్:
ట్రాన్స్‌ట్రాయ్ పనులు సక్రమంగా చేయనందున 60 సీ నిబంధన కింద నోటీసు ఇచ్చి కొత్తగా టెండర్లు పిలిచామని, అయితే కొత్త సంస్థలతో కలసి కన్సార్షియంగా ఏర్పడితే ఆ పనులు ట్రాన్స్‌ట్రాయ్‌కు ఇవ్వడానికి తమకు ఇబ్బంది లేదని చంద్రబాబు ప్రకటించారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన తర్వాత సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన చంద్రబాబు సుమారు రెండు గంటల పాటు పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటన అనంతరం లేవనెత్తిన అంశాలపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుకు అడ్డుపడేవారికి సహకరించవద్దని మీడియాను కోరారు. స్పిల్‌వే కాంక్రీట్ ఎర్త్‌వర్క్ పనుల్లో 15 రోజులుగా పురోగతి లేకపోవడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment