నెల్లూరు(సెంట్రల్): నాలుగేళ్లుగా పూటకో మాట, రోజుకో అబద్ధం చెపుతూ ఊసరవెల్లి రంగులు మార్చినట్లు చంద్రబాబు నాలుకలు మారుస్తూ ప్రజలను మోసం చేస్తున్న తీరు చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు తీరుపై కాకాణి ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్షలు ప్రజలు లేక వెలవెలబోయాయని విమర్శించారు. ఉపాధి కూలీలను సభలకు తరలించి కాలం వెళ్లదీశారని ఆరోపించారు. చంద్రబాబు తీరుపై ప్రజల్లో పూర్తిగా నమ్మకం సన్నగిల్లిందన్నారు. ప్రజాధనాన్ని వృథా చేస్తూ ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర రాజధానిలో ఒక్క ఇటుక కూడా శాశ్వత నిర్మాణం చేయలేదని, కానీ చంద్రబాబు ఇంటిని మాత్రం అధునాతన హంగులతో నిర్మించుకున్నారని అన్నారు.
వంచనలకు బ్రాండ్ అంబాసిడర్
ఆంధ్రుల హక్కుల సాధన సమరపు సారధి చంద్రబాబు అంటూ ఆర్భాటపు ప్రకటనలు ఇస్తున్నారని, కానీ చంద్రబాబుకు సమరం అంటే ఎంటో తెలుసా అని ప్రశ్నించారు. వంచన, వెన్నుపోటు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం వంటి పదాలతో చం ద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ వంచన విధానాల వారధి అని పేరు పెడితే బాగుంటుందన్నారు. రాష్ట్రం అడ్డగోలు విభజనకు కారణమైన సీఎం చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష పేరుతో ప్రజలను వంచి స్తున్నారని పేర్కొన్నారు. అధికారులను పక్కన పెట్టి జన్మభూమి కమిటీలు, సాధికారమిత్రలతో సంక్షేమ పథకాలు అమలు చేయడం సిగ్గుచేటన్నారు.
రాజధానిని ప్రపంచంలోనే నంబర్1గా నిర్మిస్తానని చెబుతున్న చంద్రబాబు నాలుగేళ్లుగా ఒక్క ఇటుక కూడా ఎందుకు నిర్మించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రజలకు అండగా ఉండాల్సిందిపోయి, ప్రజలను అండగా ఉండాలని కోరడం సిగ్గుచేటన్నారు. మిల్లర్ల వద్ద కమీషన్లు తీసుకున్న మంత్రి సోమిరెడ్డి కూడా వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు బొమ్మతో చేతి సంచి తప్ప ప్రజలకు ఏమైనా చేశారా అని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తిని ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారన్నారు.
జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియదు
జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియని వ్యక్తి తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రాసిచ్చిన పేపర్‌లు చదువుతారని అనడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. నాలుగేళ్లుగా కలసి కాపురం చేసిన బీజేపీ, టీడీపీలు హోదా వద్దని, ప్యాకేజి చాలని అనడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ఎవరు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారో చెప్పాలని సీఎం చంద్రబాబును, మంత్రి లోకేష్‌లను ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లనే సజీవంగా ఉన్నదనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కేసులకు భయపడుతున్నారని వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీనే ఎదిరించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చురకలంటించారు. టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. సమావేశంలో సుధీర్‌రెడ్డి, మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, వెంకటశేషయ్య, భాస్కర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment